దుబాయ్ లో వైభవంగా మాగల్ఫ్ దశాబ్ది వేడుకలు..హాజరైన అతిరథ మహారథులు..!!

- April 22, 2025 , by Maagulf
దుబాయ్ లో వైభవంగా మాగల్ఫ్ దశాబ్ది వేడుకలు..హాజరైన అతిరథ మహారథులు..!!

దుబాయ్: అతిరథ మహారథుల నడుమ మాగల్ఫ్ వెబ్ పోర్టల్ 10వ వార్షికోత్సవం(దశాబ్ది వేడుకలు) దుబాయ్ లోని అమిటీ యూనివర్సిటీ ఆడిటోరియంలో అంగరంగ వైభవంగా జరిగింది. ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ గనులు, భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ప్రముఖ తెలుగు సినీ గేయ రచయిత చంద్రబోస్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వీరితోపాటు యూఏఈ జర్నలిస్ట్ అసోసియేషన్ చైర్ పర్సన్ మిస్ ఫదీలా అబ్దుల్లా అల్ మోయినీ, బిజేందర్ సింగ్ (హెడ్ ఆఫ్ కాన్సులర్ అండ్ సోషల్ వెల్పేర్, ప్రోటోకాల్ అండ్ కల్చర్), డాక్టర్ నాసర్ సులేమాన్ (ఫౌండర్ ఆఫ్ మ్యూజియం ఆఫ్ దుబాయ్), డాక్టర్ సిరాశ్రీ (అభ్యుదయ గేయ రచయిత) తదితరులు గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. వీరితో పెద్ద సంఖ్యలో తెలుగు కమ్యూనిటీ సభ్యులు పాల్గొని, తమ ఆటపాటలతో అందరిని అలరించారు.

ఆంధ్రప్రదేశ్ గనులు, భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. 10 ఏళ్లుగా తెలుగువారందరికి సేవలందిస్తున్న మాగల్ఫ్ టీమ్ కు శుభాకాంక్షలు తెలిపారు. మచిలీపట్నానికి చెందిన లేటు చిత్తర్వు బాపూజీ గారి తనయుడు మాగల్ఫ్ చీఫ్ చిత్తర్వు శ్రీకాంత్ తో చిన్నప్పుడు తామిద్దరం ఒకే స్కూళ్లో చదివామని గుర్తుచేసుకున్నారు. వారి ఫ్యామిలీతో మంచి అనుబంధం ఉందన్నారు. గతంలో గల్ఫ్ లో కార్మికుల సంక్షేమానికి అనేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. దుబాయ్ కొచ్చి ఇబ్బుందులు పడ్డ వారికి అవసరమైన సహాయం కోసం పాటుపడినట్లు గుర్తుచేసుకున్నారు. స్వాతంత్రం వచ్చి 70ఏళ్లయిన వెనుకబడి ఉండటం బాధాకరమన్నారు. స్థానికంగా ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ప్రగతి సాధించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. దాంతో రాబోయే రోజులలో స్థానికంగానే ఎంతోమందికి ఉపాధి లభించే అవకాశం ఉంటుందన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పీ 4(పబ్లిక్, ప్రైవేట్, పీపుల్, పార్టనర్ షిప్) మోడ్ ద్వారా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. అందరూ ముందుకొచ్చి పేద కుటుంబాలను దత్తత తీసుకొని పేదరికాన్ని పాలద్రోలేందుకు పాటుపడాలని పిలుపునిచ్చారు.

ప్రముఖ తెలుగు సినీ గేయ రచయిత చంద్రబోస్ మాట్లాడుతూ.. మహిళలు తమ తమ రంగాల్లో రాణిస్తునే సంప్రాదాయ కళల్లోనూ రాణించడం ఎంతో గొప్ప విషయమని కొనియాడారు. ఈ సందర్భంగా కూచిపూడి, సంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించిన మహిళలను అభినందించారు. అనంతరం తనదైన శైలిలో ప్రేక్షకులు అడిగిన సినీ పాటలను ఆలపించి అలరించారు.  ముఖ్యంగా ఆస్కార్ అవార్డు సాధించిన నాటు నాటు పాట ఆహుతులను అలరించింది. అలాగే ఎంత సక్కగున్నావే లక్ష్మీ పాటతోపాటు తెలుగు భాష గొప్పతనం.. గురించి పాడిన పాటలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

హెడ్ ఆఫ్ కాన్సులర్ అండ్ సోషల్ వెల్పేర్, ప్రోటోకాల్ అండ్ కల్చర్ బిజేందర్ సింగ్ మాట్లాడుతూ..గల్ఫ్ రీజియన్ లో మాగల్ఫ్ సేవలకు వెలకట్టలేమని, అద్భుత రీతిలో పనిచేస్తుందని అభినందించారు. విశ్వసనీయత గల వార్తలను ప్రసారం చేస్తూ ఇక్కడి కమ్యూనిటీకి అవసరమైన సహకారాన్ని అందిస్తుందని కొనియాడారు. తన తోడ్పాటుతో ఇండియన్ కల్చర్, హెరిటేజీని కాపాడుతుందన్నారు.

 దుబాయ్ మ్యూజియమ్స్ ఫౌండర్ డాక్టర్ నాజిర్ సులేమాన్ మాట్లాడుతూ.. గల్ఫ్ లోని ఇండియన్స్ అందరికి మాగల్ఫ్ సుపరిచితమైందన్నారు. ముఖ్యంగా తెలుగు కమ్యూనిటీలకు విశేష సేవలందిస్తున్నదని ప్రశంసించారు. మాగల్ఫ్ సేవలు ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు.

అభ్యుదయ గేయ రచయిత డాక్టర్ సిరాశ్రీ మాట్లాడుతూ.. అనేక భాషా వేత్తలను ఒకే వేదికపైకి తీసుకొచ్చిన ఘనత మాగల్ఫ్ కు మాత్రమే దక్కుతుందన్నారు. పదేండ్లపాటు కష్టపడి మాగల్ఫ్ ను నిలిపారని కొనియాడారు. మాగల్ఫ్ ఎడిటర్ ఇన్ చిఫ్ చిత్వర్వు శ్రీకాంత్ తన క్లాస్ మెంట్ అని, తనతో తనకున్న అనుబంధం గురించి గుర్తుచేసుకున్నారు. గల్ఫ్ లోని తెలుగు ప్రాంత ప్రజలకు మాతృభాషలో అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తూ వెలకట్టలేని సేవలు అందిస్తుందని మాగల్ఫ్ టీమ్ పై ప్రశంసలు కురిపించారు. ''దుబాయ్ లోని తెలుగు వారికి వేదిక మాగల్ఫ్. జన్మభూమికి కర్మభూమికి వారధి మాగల్ఫ్. కార్మికుల సోదరులందరికి స్నేహహస్తం చపుతూ..ఇక్కడ పద్ధతి గుర్తుచేస్తూ మనుగడ మార్గం చూపుతుంది. ఇది అంతర్జాల పత్రిక...గల్ఫ్ దేశాలందరికి ప్రియ పుత్రిక"" అని కవితాత్మకమైన సందేవంతో తన ప్రసంగాన్ని ముగించారు.

చివరగా మాగల్ఫ్ ఎడిటర్ ఇన్ చీఫ్ శ్రీకాంత్ చిత్తర్వు మాట్లాడుతూ.. తమను ఆదరించిన ప్రతిఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. తన ఆహ్వానాన్ని మన్నించి మాగల్ఫ్ దశాబ్ది వేడుకలకు విచ్చేసిన అతిథులందరికి ధన్యవాదాలు తెలిపారు. తమను వెన్నంటి నిలిచి ప్రోత్సాహిస్తున్న స్పాన్సర్స్ కు, పాఠకులకు, వీక్షకులకు, గల్ఫ్ లోని తెలుగు కమ్యూనిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.

భారత జాతీయ గీతాలపనతో కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం దుబాయ్ మ్యూజిక్ టీమ్ గణపతి ప్రార్థన ఆలాపనతో ప్రధాన వేడుకలు ప్రారంభమయ్యాయి. మాగల్ఫ్ పోర్టర్ ప్రస్థానాన్ని వివరించే వీడియో ప్రదర్శన అనంతరం కీ నోట్ ను ఎడిటర్ ఇన్ చీఫ్ శ్రీకాంత్ సౌమ్య రామన్ ప్రవేశపెట్టారు. తన్మయ్ ఆర్ట్ స్టూడియోస్ టీమ్ వారు ప్రదర్శించిన కూచిపూడి నృత్యం ఆహుతులను అలరించింది. అనంతరం ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రదర్శించిన ఫోక్ డ్యాన్స్ సభను ఉర్రూతలూగించింది. ప్రెట్టి తెలుగు ఉమెన్ గ్రూప్ మహిళలు ప్రదర్శించిన భారత్ లోని వివిధ రాష్ట్రాల మహిళల వస్త్రధారణ ఫ్యాషన్ వాక్ అందరిని ఆకట్టుకుంది. అనంతరం దుబాయ్ లో అందరికి సుపరితమైన దుబాయ్ ఇండియా మ్యూజిక్ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆర్కెస్ట్రా అందరిని అలరించింది.

గల్ఫ్ వెల్పేర్ కమిటీ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు,  అనాథ శవాలకు దహనసంస్కారాలు జరిపించిన గుండెల్లి నర్సింహ్మ ను మాగల్ఫ్ సేవా అవార్డుతో సత్కరించారు. కార్మికులలో కళను ప్రోత్సాహించాలని  కార్మిక గీతాలపన పోటీలను మాగల్ఫ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇందులో విజేతలుగా నిలిచిన రంజిత్ కుమార్, రవికాంత్, రాజా గౌడ్ పాడిన పాటలు అందరిని అలరించాయి. అనంతరం వారికి నగదు పురస్కారంతోపాటు మెమోంటోతో ఘనంగా సత్కరించారు. యూఏఈ జర్నలిస్ట్ అసోసియేషన్ చైర్ పర్సన్ మిస్ ఫదీలా అబ్దుల్లా అల్ మోయినీ గెస్ట్ ఆఫ్ హానర్ గా హాజరు కాగా, వారిని మాగల్ఫ్ మేనేజ్ మెంట్ తరఫున ఘనంగా సత్కరించారు.

మాగల్ఫ్ దశాబ్ది వేడుకల్లో చివరగా మాగల్ఫ్ కు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్న స్పాన్సర్లను ఘనంగా సత్కరించారు. అదే విధంగా గల్ఫ్ ప్రాంతంలో విశేష సేవలందిస్తున్న తెలుగు కమ్యూనిటీ అసోసియేషన్ల ప్రతినిధులను శాలువ కప్పి మెమోంటోతో మాగల్ఫ్ తరఫున ఘనంగా సత్కరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com