ఈ దాడికి భారత్‌ గట్టిబదులిస్తుంది: కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్

- April 23, 2025 , by Maagulf
ఈ దాడికి భారత్‌ గట్టిబదులిస్తుంది: కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్

న్యూ ఢిల్లీ: కేంద్ర రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ పహల్గాంలో పర్యటకులపై జరిగిన ఉగ్రదాడి ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్‌పై కుట్ర పన్నుతున్న వారిని ఊరికే వదలబోమన్నారు. దాడికి భారత్‌ గట్టిబదులిస్తుందని ఉగ్రవాదులను హెచ్చరించారు. తమ కుటుంబసభ్యులను కోల్పోయిన బాధిత కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. పహల్గాం ఉగ్రదాడి పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ఉగ్రదాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించాలనేది భారత్‌ విధానమని..ఉగ్రవాదులను ఎదుర్కొనే విషయంలో దేశ ప్రజలంతా ఐక్యంగా ఉన్నారని పేర్కొన్నారు.

కుట్ర పన్నిన వారిని బయటకు లాగి, తగిన బుద్ధి చెబుతాం

దాడికి పాల్పడిన వారిని..కుట్ర పన్నిన వారిని బయటకు లాగి, తగిన బుద్ధి చెబుతామని అన్నారు. పహల్గాం ఘటనకు సంబంధించిన విషయాలు, శ్రీనగర్‌లో భద్రతా చర్యలు వంటి వాటి గురించి ఆయన ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్‌ అడ్మిరల్ దినేశ్‌ త్రిపాఠితో చర్చలు జరిపిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరగనున్న భద్రతా వ్యవహారాల కేబినెట్‌ కమిటీ సమావేశంలోనూ ఆయన పాల్గొననున్నారు.

అతి సమీపం నుంచి కాల్పులు

కశ్మీర్‌లో మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన పహల్గాం సమీప బైసరన్‌ లోయలో ఉగ్రవాదులు మంగళవారం భీకర దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. మధ్యాహ్నం 3 గంటల సమయంలో సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు పర్యటకులను చుట్టుముట్టి.. అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 28 మంది ప్రాణాలు కోల్పోగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఘటన అనంతరం అడవుల్లోకి పారిపోయిన ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు ముమ్మర గాలింపుచర్యలు చేపట్టాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com