మాస్ మూవీస్ దర్శక దిగ్గజం-బాపయ్య

- April 24, 2025 , by Maagulf
మాస్ మూవీస్ దర్శక దిగ్గజం-బాపయ్య

బాపయ్య  సినిమాలు అటు మాస్‌ను మెప్పిస్తాయి.. ఇటు క్లాస్‌ను అలరిస్తాయి.తన సినిమాల్లో హిరోలకు హై ఓల్డ్ ఇమెజ్ ఇచ్చి.. వారిని బాగా ఎలివేట్ చేయడం అప్పట్లో ఈ దర్శకుడికి పరిపాటిగా ఉండేది. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ సమానంగా ఇమేజ్ తెచ్చుకున్న తెలుగు దర్శకుల్లో బాపయ్య కూడా ఒకరు.బాలీవుడ్ సినీ రంగంలో ఆయన్ని అందరూ మాస్ కా బాప్ అనేవారు. నేడు మాస్  మూవీస్ దర్శక దిగ్గజం కె. బాపయ్య పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక కథనం.

కె. బాపయ్య పూర్తి పేరు కోవెలమూడి బాపయ్య. 1938, ఏప్రిల్ 24న ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కోలవెన్ను గ్రామంలో మధ్య తరగతి రైతు కుటుంబంలో జన్మించారు. దర్శకనిర్మాత కె.ఎస్.ప్రకాశరావు గారి సోదరుడి కుమారుడైన బాపయ్య తన చిన్నప్పుడే తల్లి దండ్రుల్ని కోల్పోయారు. ఆయన్ను పెదనాన్న కె.యస్. ప్రకాశరావే చేరదీశారు. విజయవాడ, చెన్నైలో విద్యాభ్యాసం పూర్తి చేసిన బాపయ్య , అప్పటి మేటి దర్శకుడు కె.బి.తిలక్ దగ్గర అప్రెంటిస్‌గా జాయిన్ అయ్యారు. ముద్దుబిడ్డ, యం.ఎల్.ఏ, అత్తా ఒకింటి కోడలే లాంటి చిత్రాలకు ఆయన దగ్గర అసోసియేట్‌గా పనిచేశారు.  

అసోసియేట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న సమయంలోనే సురేష్ ప్రొడక్షన్స్ వారి తొలిచిత్రం రాముడు భీముడు చిత్రానికి తాపీ చాణక్య దగ్గర జాయిన్ అయ్యారు. సినిమాల పట్ల బాపయ్య అంకిత భావాన్ని గుర్తించిన సురేష్ ప్రొడక్షన్స్ అధినేత రామానాయుడు గారు, తమ బ్యానర్ ద్వారా 'ద్రోహి' చిత్రంతో బాపయ్య దర్శకుడిగా పరిచయం చేశారు. ఆ సినిమా పరాజయం పాలైనా.. దర్శకుడిగా బాపయ్యకు అవకాశాలు ఆగలేదు. ‘ద్రోహి’ పరాజయంతో మరో మూడేళ్ళ వరకు బాపయ్య సినిమా రాలేదు. కృష్ణంరాజు హీరోగా ‘మేమూ మనుషులమే’ చిత్రం బాపయ్య రెండో చిత్రంగా వచ్చింది. అది కూడా అంతగా అలరించలేకపోయింది. అప్పటికే ‘ఊర్వశి’గా జేజేలు అందుకుంటున్న శారదతో అదే టైటిల్‌గాపెట్టి మూడో సినిమా తీశారు.

తెలుగు చిత్రం ‘ఊర్వశి’లో నాటి హిందీ అగ్రశ్రేణి నటుడైన సంజీవ్ కుమార్‌ను నటింప చేశారు. షరా మామూలే అన్నట్టు ఇదీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే దర్శకునిగానూ, పాటల చిత్రీకరణలోనూ ఆయనకు మంచి అభిరుచి ఉందన్న పేరు లభించింది. అదే సమయంలో ఎన్టీఆర్‌ చేతుల మీదుగా ‘వైజయంతీ మూవీస్’ను ఆరంభించిన అశ్వనీదత్ ఆయన హీరోగా 1975 డిసెంబర్ 12న బాపయ్య తెరకెక్కించిన తొలి చిత్రం ‘ఎదురులేని మనిషి’ విడుదలయింది.

దేవానంద్ హిందీ చిత్రం ‘జానీ మేరా నామ్’ ఆధారంగా ‘ఎదురులేని మనిషి’ రూపొందింది. ఎన్టీఆర్‌‌ను కొత్తగా చూపించాలన్న తపనతో ఆయనకు వరైటీ కాస్ట్యూమ్స్ ధరింప చేశారు. ‘ఎదురులేని మనిషి’ ఆ రోజుల్లో వసూళ్ళ వర్షం కురిపించింది. ఈ సినిమా మొదటివారం కలెక్షన్స్ చూసి సినీజనం నివ్వెర పోయారు. ఈ చిత్రంతో ఒక్కసారిగా బాపయ్య పేరు చిత్రసీమలో మారుమోగి పోయింది. ఆ తర్వాత  వారానికే అంటే 1975 డిసెంబర్ 19న బాపయ్య, శోభన్ బాబు తొలి కాంబినేషన్‌గా ‘సోగ్గాడు’ విడుదలయింది. ఆ సినిమా అనూహ్య విజయం సాధించింది. వరుసగా మూడు చిత్రాలతో అంతగా ఆకట్టుకోలేకపోయిన బాపయ్య, వారం గ్యాప్ లో రెండు బిగ్ హిట్స్ తో జనాన్ని మురిపించారు. దాంతో దర్శకునిగా కె.బాపయ్య పేరు మారు మోగి పోయింది.

బాపయ్య తెలుగులో ఎన్టీఆర్‌తో ఆరు చిత్రాలు తెరకెక్కించగా, శోభన్ బాబుతో ఆరు, కృష్ణతో ఎనిమిది సినిమాలు రూపొందించారు. తన తొలి చిత్రంలో కీలక పాత్ర పోషించిన కృష్ణంరాజుతోనూ మూడు చిత్రాలు తెరకెక్కించారు. చిరంజీవి హీరోగా బాపయ్య దర్శకత్వంలో ‘ఇంటిగుట్టు, చట్టంతో పోరాటం’ రూపొందాయి. ఏయన్నార్ తో ‘గురుశిష్యులు’ ఒక్కటే తెరకెక్కించారు. అందులోనూ కృష్ణ మరో హీరోగా నటించారు. కృష్ణ, శోభన్ తో బాపయ్య రూపొందించిన మల్టీస్టారర్స్ ‘మండే గుండెలు, ముందడుగు’ రెండూ మంచి విజయాలను చూశాయి. బ్లాక్ బస్టర్స్ చిత్రాలతో  బాపయ్య టాలీవుడ్‌లో టాప్ డైరెక్టర్‌గా ఎదిగారు.

టాలీవుడ్‌లో అగ్రపథాన దూసుకెళ్తున్న సమయంలోనే బాలీవుడ్ పరిశ్రమలో అడుగుపెట్టారు. తెలుగుతో పాటే హిందీ చిత్రసీమలోనూ బాపయ్య తనదైన బాణీ పలికించారు. బాపయ్యను హిందీ చిత్రసీమకు పరిచయం చేసింది ‘సోగ్గాడు’ నిర్మాత డి.రామానాయుడే కావడం విశేషం. సోగ్గాడు సినిమాను 1977లో దిల్ దార్ పేరుతో హిందీలో జితేంద్ర హీరోగా రూపొందించి హిట్ కొట్టారు. తెలుగులో విజయం సాధించిన పలు చిత్రాలను బాపయ్య హిందీలో రీమేక్ చేయడం విశేషం. తెలుగులో కంటే హిందీలోనే బాపయ్యకి సక్సెస్ రేటు బాగుంది. జితేంద్ర హీరోగానే ఆయన హిందీలో చిత్రాలను చేశారు. వీరి కాంబినేషన్లో వచ్చిన దాదాపు సింహభాగం చిత్రాన్ని సూపర్ డూపర్ హిట్స్‌గా నిలిచి బాలీవుడ్లో హిట్ జోడీగా కొనసాగింది. జితేంద్ర తర్వాత మిథున్ చక్రవర్తి హీరోగా ఎక్కువ చిత్రాలను రూపొందించారు.

1995లో చింకి పాండే హీరోగా తీసిన దియా ఔర్ తుఫాన్ చిత్రం తర్వాత ఆయన సినిమాల నుంచి రిటైర్మెంట్ తీసుకొని విశ్రాంత జీవనం గడుపుతున్నారు. తెలుగు, హిందీ భాషల్లో 80 చిత్రాలకు పైగానే డైరెక్ట్ చేసిన ఆ మేటి దర్శకుడు..దాదాపు గా అప్పటి అగ్రహీరోలందరినీ డైరెక్ట్ చేసి రికార్డు క్రియేట్ చేశారు.80వ దశకంలో భారతదేశం మొత్తం మీద అత్యధిక పారితోషికం అందుకున్న దర్శకులు బాపయ్య గారు. మల్టీస్టారర్ సినిమాలలో అత్యధిక శాతం విజయవంతం చేసిన ఖ్యాతి కూడా బాపయ్య గారిదే.

‘డైరెక్టర్ ఈజ్ ద కెప్టెన్’ అనేది సినిమా వెలుగు చూసిన రోజుల నుంచీ ఉన్న నానుడి. అందువల్ల సినిమా దర్శకునికి ఎంతో క్రమశిక్షణ అవసరం అని పలువురు భావించేవారు. అలాంటివారు తాము దర్శకత్వం చేస్తున్న సమయంలో క్రమశిక్షణతో మెలగడగమే కాదు, కృషి, దీక్ష, పట్టుదలకు చిహ్నంగా ‘యూనిఫామ్’ కూడా ధరించేవారు. అలా కనిపించిన వారిలో కె.విశ్వనాథ్, కె.బాపయ్య ఉన్నారు. విశ్వనాథ్ కళాత్మక చిత్రాలతో సాగిపోతే, బాపయ్య కమర్షియల్ మూవీస్ తో కనికట్టు చేశారు.ఇంట గెలిచి రచ్చ గెలిచిన ఘనుడు బాపయ్య.

మన దేశంలోనే కాక మధ్య, తూర్పు దేశాలలో కూడా బాపయ్య గారి పేరు సుపరిచితం. అ కాలపు ప్రముఖ పాకిస్తానీ నటి బాబ్రా షరీఫ్ బాపయ్య సినిమా విడుదల అయ్యిందంటే చాలు ఎలానో ఆ సినిమా క్యాసెట్ సంపాదించి చూసి, ఫోన్ చేసి బాపయ్య గారిని అభినందించేవారు. ఉత్తరాదిన ప్రముఖ కథానాయిక శ్రీదేవికి ఎంత ప్రాధాన్యత ఉండేదో, దర్శకుడిగా బాపయ్య గారికి కూడా అంతే ప్రాధాన్యత ఉండేది ఇటు దక్షిణాదినా, అటు ఉత్తరాదినా రికార్డుల మీద రికార్డులు సృష్టించిన ఏకైక దర్శకుడిగా నిలిచిపోయారు.

--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com