గర్వాల్ రాజకీయ దిగ్గజం - హెచ్.ఎన్. బహుగుణ

- April 26, 2025 , by Maagulf
గర్వాల్ రాజకీయ దిగ్గజం - హెచ్.ఎన్. బహుగుణ

హేమవతి నందన్ బహుగుణ...భారతదేశ రాజకీయాల్లో నిర్వహణ దక్షుడిగా నిలిచిన నాయకుల్లో ఒకరు. హిమాలయాలకు దగ్గర ఉన్న గర్వాల్ సానువుల వద్ద ఉన్న కుగ్రామంలో జన్మించి తన స్వశక్తితో జాతీయ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని బహుగుణ ఏర్పరచుకున్నారు. యూపీ రాష్ట్రంలో వెనుకబడ్డ పర్వత ప్రాంతాల అభివృద్ధికి కృషి చేశారు. నేడు గర్వాల్ రాజకీయ దిగ్గజం హేమవతి నందన్ బహుగుణ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం...

హేమవతి నందన్ బహుగుణ అలియాస్ హెచ్.ఎన్. బహుగుణ 1919, ఏప్రిల్ 25న అవిభక్త యునైటెడ్ ప్రావిన్స్ ప్రాంతంలోని కుమావొన్ డివిజన్లోని బుగాని గ్రామంలో దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. తండ్రి రేవతి నందన్ బహుగుణ పౌరోహిత్యంతో పాటుగా వ్యవసాయం చేస్తూ వచ్చేవారు. చిన్నతనం నుంచే తెలివైన విద్యార్ధి కావడంతో ఉపకారవేతనాల ద్వారా హైస్కూల్ వరకు డెహ్రాడూన్  పట్టణంలో చదువుకున్నారు. పై చదువుల కోసం అలహాబాద్ నగరానికి తరలి వచ్చారు. అలహాబాద్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు.

బహుగుణ అలహాబాద్ యూనివర్సిటీ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటూనే స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా కొనసాగుతూ అలహాబాద్ నగరాన్ని తన రాజకీయ స్థావరంగా ఏర్పరచుకొని, ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో యువ రాజకీయ నేతగా ఎదుగుతూ వచ్చారు. ఇదే సమయంలో ఆయనకు కాంగ్రెస్ పార్టీకి చెందిన డాక్టర్ సంపూర్ణానంద్, కమలాపతి త్రిపాఠిలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. బహుగుణ యూపీ రాజకీయాల్లో పైకి రావడంలో వీరిద్దరూ తమవంతు పాత్ర పోషించారు.

1945-52 వరకు కాంగ్రెస్ అనుబంధ కార్మిక మరియు ఇతర సంఘాల్లో కీలకంగా పనిచేస్తూ వచ్చారు. 1952 ఎన్నికల్లో తొలిసారి యూపీ అసెంబ్లీకి ఎన్నికైన బహుగుణ 1971 వరకు పలు సార్లు ఎమ్యెల్యేగా ఎన్నికయ్యారు. డాక్టర్ సంపూర్ణానంద్ సీఎంగా ఉన్న సమయంలో పార్లమెంటరీ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1958-60 మధ్యలో కార్మిక శాఖ ఉప మంత్రిగా పనిచేశారు. చంద్రభాన్ గుప్త మంత్రివర్గంలో కార్మిక, ఆర్థిక మరియు రవాణా శాఖల క్యాబినెట్ మంత్రిగా పనిచేశారు.

యూపీ కాంగ్రెస్ పార్టీలో ఒక్కో మెట్టు ఎక్కుతూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. తన రాజకీయ గురువువైన చంద్రభాన్, కమలానంద త్రిపాఠిల సహకారంతో ఏ.ఐ.ఐ.సికి ఎన్నికయ్యారు. 1969లో కాంగ్రెస్ చీలిక ఏర్పడిన సమయంలో ప్రధాని ఇందిరా గాంధీ వైపు నిలిచిన బహుగుణ ఏ.ఐ.ఐ.సి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై 1971 వరకు కొనసాగారు. యూపీ రాజకీయాల్లో ఉన్న అనిశ్చితి మూలంగా జాతీయ రాజకీయాల వైపు దృష్టి సారించారు. 1971 సార్వత్రిక ఎన్నికల్లో ఇందిరా నేతృత్వంలోని కాంగ్రెస్ తరపున అలహాబాద్ నుంచి పోటీ చేసి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు.

1971-73 మధ్యలో ఇందిరా మంత్రివర్గంలో కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రిగా పనిచేశారు. 1973లో అప్పటి యూపీ సీఎం కమలాపతి త్రిపాఠి చేసిన ఘోర తప్పిదం కారణంగా కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలో పడిన సమయంలో ఆయన స్థానే బహుగుణ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి 8వ సీఎంగా ఎన్నికయ్యారు. 1973-75 వరకు సీఎంగా ఉన్న ఆయన తన సమర్థతతో 1974 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చారు. యూపీలో తిరుగులేని నేతగా ఎదుగుతున్న సమయంలో సంజయ్ గాంధీతో వచ్చిన విభేదాల కారణంగా తన సీఎం పదవికి రాజీనామా చేసి సాధారాణ కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు.

1975-77 వరకు రాజకీయాలకు దూరంగా తన స్వగ్రామానికే పరిమితం అయ్యారు. 1977లో ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత ఇందిరా గాంధీతో విభేదించి జగ్జీవన్ రామ్, నందిని సత్పతిలతో కలిసి ప్రజాస్వామ్య కాంగ్రెస్ పార్టీ పేరుతో కాంగ్రెస్ పార్టీని చీల్చి జనతా పార్టీతో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో పోటీచేయగా బహుగుణ లక్నో నుంచి ఎన్నికయ్యారు. 1977-79 చివరి వరకు మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్ గార్ల  మంత్రివర్గాల్లో పెట్రోలియం & కెమికల్స్, ఎరువులు మరియు ఆర్థిక శాఖల మంత్రిగా పనిచేశారు. 1979లో చరణ్ సింగ్ ప్రభుత్వం పడిపోయిన తర్వాత తిరిగి ఇందిరా నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీలో చేరారు.

1980 ఎన్నికల్లో గర్వాల్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున మూడోసారి ఎన్నికయ్యారు. 1982లో రాజీవ్ గాంధీతో వచ్చిన భేదాభిప్రాయాల కారణంగా ఆ పార్టీకి, తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. 1982లో వచ్చిన ఉపఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నాలుగోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత చరణ్ సింగ్ నేతృత్వంలోని లోక్ దళ్ పార్టీలో చేరారు. 1984 ఎన్నికల్లో అలహాబాద్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్  అభ్యర్థిగా పోటీ చేసిన అమితాబ్ బచ్చన్ చేతిలో ఓటమి పాలైయ్యారు. ఆ తర్వాత చరణ్ సింగ్ గారితో విభేదించి లోక్ దళ్ (బహుగుణ) పార్టీని స్థాపించారు.1988 జరిగిన ఉపఎన్నికల్లో అలహాబాద్ నుంచి తిరిగి పోటీ చేసి వి.పి.సింగ్ చేతిలో ఓటమి చెందారు.

బహుగుణ ఐదున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగారు. ఏ పదవిలో ఉన్న తన స్వస్థలమైన గర్వాల్ ప్రాంత అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేశారు. 1988 ఉప ఎన్నికల్లో ఓటమి ఆయన్ని మానసికంగా కృంగ  దీయడమే కాకుండా గుండె పోటుకు గురయ్యారు. చికిత్స కోసం అమెరికా వెళ్లి అక్కడ బైపాస్ సర్జరీ జరిగిన తర్వాత కోమాలోకి వెళ్లి తన 69వ ఏట 1989, మార్చి 17న అమెరికాలోనే కన్నుమూశారు.  

--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com