ఎన్నారై టిడిపి చొరవతో ఒమాన్ నుండి ఏపీకి చేరుకున్న యువకులు

- May 13, 2025 , by Maagulf
ఎన్నారై టిడిపి చొరవతో ఒమాన్ నుండి ఏపీకి చేరుకున్న యువకులు

మస్కట్: ఒమన్ నుండి సురక్షితంగా ఇంటికి చేరుకున్న 9 మంది శ్రీకాకుళం యువకులు.2025 ఫిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం నుండి పని కోసం ఒమన్‌కు వచ్చిన తొమ్మిది మంది యువకులు, కంపెనీ హామీ ఇచ్చిన ఉద్యోగం తమకు లభించకపోవడంతో నిరాశ చెందారు. కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా, కంపెనీ వారిని పోర్టులోని మరొక విభాగంలో పనిచేయమని కోరింది. 

వారిలో ఎక్కువ మంది యువకులు వెల్డింగ్ నిపుణులు, క్లీనింగ్ విభాగంలో పనిచేయడానికి ఇష్టపడలేదు. భారతదేశానికి తిరిగి రావాలనుకుంటున్నట్లు కంపెనీ అధికారులకు చెప్పారు. దేశానికి తిరిగి రావడంలో వారు సమస్యలను ఎదుర్కొన్నందున, వారు ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్నారై టీడీపీ సెల్ ను సంప్రదించగా ఎన్నారై టీడీపీ సెల్ కోఆర్డినేటర్ చప్పిడి రాజ శేఖర్ గారు కేంద్ర పౌర విమానయాన మంత్రి కె. రామ్ మోహన్ నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లారు మరియు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వారు వెంటనే స్పందించి, మస్కట్ లోని భారత రాయబార కార్యాలయానికి లేఖ రాశారు మరియు వారు తగిన చర్యలు తీసుకొనేలా ప్రయత్నాలు చేశారు. 

ఎన్నారై టిడిపి సెల్ కో-ఆర్డినేటర్ చప్పిడి రాజశేఖర్ జోక్యంతో, ఈ విషయాన్ని ఎన్నారై టీడీపీ సభ్యులు మస్కట్ లో మీడియాలో పనిచేస్తున్న మడకశిర రాజేష్, రెడ్రౌతు శ్రీనివాసరావు మరియు సోషల్ వర్కర్ నాగరాజు దృష్టికి తీసుకువెళ్ళి, ఆ 9 మంది కార్మికులను ఒమన్ రాజధాని నగరం మస్కట్‌లోని ఒక ఫ్లాట్‌లో ఉంచారు.ఈ ముగ్గురు ఎన్నారై టీడీపీ సెల్ మరియు ఆంధ్రప్రదేశ్ లోని అధికారులతో పాటు వారిని ఒమాన్ పంపించిన ఏజెంట్ తో సమన్వయం చేసుకుని, యువకులను స్వదేశానికి పంపించడానికి ఒమన్ కంపెనీ అధికారులతో చర్చలు జరిపారు. ఈ విషయంలో ఏజెంట్ కూడా సానుకూలంగా స్పందించి వారి యొక్క పూర్తి సహకారాన్ని అందించడం జరిగింది. చివరికి మే 5న ఆ కంపెనీ అధికారులతో జరిపిన చర్చలు ఫలించడంతో శ్రీకాకుళం నుండి వచ్చిన 9 మంది యువకులు భారతదేశానికి తిరిగి వచ్చారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com