ఈ ప్ర‌భుత్వం మీది..అండ‌గా ఉంటాం: సీఎం రేవంత్

- February 28, 2026 , by Maagulf
ఈ ప్ర‌భుత్వం మీది..అండ‌గా ఉంటాం: సీఎం రేవంత్
  • మ‌దీనా బ‌స్సు ప్ర‌మాద బాధిత కుటుంబ స‌భ్యుల‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి భరోసా
  • బాధిత కుటుంబాల‌కు ప‌రిహారం చెక్కుల అందజేత‌

హైద‌రాబాద్: ఈ ప్ర‌భుత్వం మీది..ఎటువంటి ఆందోళ‌న చెందాల్సిన ప‌ని లేదు..మీకు అండ‌గా ఉంటామంటూ ముఖ్య‌మంత్రి ఏ.రేవంత్ రెడ్డి మ‌దీనా బ‌స్సు ప్ర‌మాద బాధిత కుటుంబాల‌కు భ‌రోసా ఇచ్చారు.రాష్ట్ర స‌చివాల‌యంలో శ‌నివారం ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి బాధిత కుటుంబ స‌భ్యుల‌తో మాట్లాడారు. మ‌దీనాలో ప్ర‌మాద ఘ‌ట‌న తెలుసుకున్న వెంట‌నే మంత్రి అజ‌హ‌రుద్దీన్ నేతృత్వంలోని ప్ర‌తినిధి బృందాన్ని మ‌దీనాకు పంపామ‌ని సీఎం గుర్తు చేశారు. చ‌నిపోయిన వారి కుటుంబ స‌భ్యుల‌కు త‌క్ష‌ణ‌మే పాస్‌పోర్టులు, వీసాలు ఇప్పించి మ‌దీనా పంపించామ‌న్నారు. అక్క‌డి భార‌త్ కాన్సులేట్‌, సౌదీ ప్ర‌భుత్వంతో చ‌ర్చించి మృతి చెందిన వారి అంత్య‌క్రియ‌లు జ‌న్నుతుల్ బ‌ఖీలో చేయించామ‌న్నారు. స‌హ‌జంగా దేశం బ‌య‌ట జ‌రిగే ప్ర‌మాదాల్లో మృతి చెందిన వారికి ప్ర‌భుత్వాలు ప‌రిహారం చెల్లించ‌వ‌ని.. కానీ తాము మాత్రం మాన‌వ‌తా దృక్ప‌థంతో స‌హాయం చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నామ‌న్నారు. ఇటీవ‌ల నాంప‌ల్లి అగ్నిప్ర‌మాదంలో మృతిచెందిన వారి కుటుంబాల‌కు ప‌రిహారం చెల్లించామ‌ని సీఎం తెలిపారు.ఈ చెక్కుల‌ను ఇళ్ల‌కు పంపించ‌వ‌చ్చ‌ని.. కానీ మీ అంద‌రితో క‌ల‌వాల‌ని...మీకు అండ‌గా ఉంటామ‌నే భ‌రోసా క‌ల్పించాల‌నే ఉద్దేశంతోనే స‌చివాల‌యానికి పిలిపించామ‌ని  సీఎం అన్నారు. అనంత‌రం ప్ర‌మాదంలో మృతిచెందిన 44 కుటుంబాల వారికి రూ.5 ల‌క్ష‌ల చొప్పున‌, తీవ్రంగా గాయ‌ప‌డిన వారి కుటుంబానికి రూ.3 ల‌క్ష‌ల చెక్కును ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అందజేశారు.

ముస్లిం సోద‌రుల‌తో త‌నకున్న‌ అనుబంధాన్ని ముఖ్య‌మంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఈ సంద‌ర్బంగా గుర్తు చేసుకున్నారు. తాను కొడంగ‌ల్‌ ఎమ్మెల్యేగా ఎన్నికైన 2009 సంవ‌త్స‌రం నుంచి నియోజ‌క‌వ‌ర్గంలోని అయిదు మండ‌లాల నుంచి ఒకొక్క‌రి చొప్పున ఏటా అయిదుగురిని త‌న సొంత ఖ‌ర్చుల‌తో హ‌జ్ యాత్ర‌కు పంపుతున్నాన‌ని సీఎం తెలిపారు. వారిని ఎంపిక చేసే బాధ్య‌త స్థానిక ముస్లిం మ‌త పెద్ద‌ల‌కే అప్ప‌జెప్పాన‌న్నారు. కార్య‌క్ర‌మంలో రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్, ముఖ్య‌మంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, నాంప‌ల్లి ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్‌, హ‌జ్ క‌మిటీ ఛైర్మ‌న్ ఖుస్రో పాషా, తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (TGMREIS)  వైస్ ఛైర్మ‌న్ ఫహీం ఖురేషి, రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మ‌న్ ఒబేదుల్లా కొత్వాల్, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com