మట్టితో కాసులు పండిస్తూన్న మురుగన్
- July 10, 2016
లోహ పాత్రలు వచ్చాక మట్టితో చేసేవాటికి గిరాకీ తగ్గిపోయింది. దేశంలో చాలాచోట్ల మట్టి పాత్రలు చేసేవారంతా క్రమంగా ఇతర వృత్తుల్లోకి వెళ్లిపోతున్నారు. కానీ తమిళనాడులోని తిరునెల్వేలి ప్రాంతానికి చెందిన మురుగన్ మాత్రం ఈ సంప్రదాయ వృత్తికి ఆధునికతను మేళవించి తన ఉత్పత్తుల్ని విదేశాలకూ ఎగుమతి చేస్తున్నాడు.
రునెల్వేలి నగరానికి చెందిన ఎస్.మురుగన్ ఎనిమిదో తరగతితో చదువు ఆపేశాడు. ఆపైన కుటుంబ సభ్యులతోపాటు ఇటుకలూ, ప్రమిదలూ, పూల కుండీల్ని తయారుచేసేవాడు. ఆదాయం అంతంత మాత్రమే అయినా పాతికేళ్లు వచ్చేవరకూ అదే పనిలో కొనసాగాడు. పదిహేనేళ్ల కిందట జర్మనీ నుంచి పాండిచ్చేరికి వచ్చిన ఓ వ్యక్తి చిన్నగా, అందంగా ఉండే నాణ్యమైన పూలకుండీల కోసం భారత్‌లో చాలాచోట్ల వెతికి చూశాడు. అప్పుడే ఆయనకి తిరునెల్వేలి గురించి తెలిసింది. ఆ ప్రాంతంలో మట్టి ఎర్రని రంగులో ఉంటుంది. దాంతో తయారుచేసే పాత్రలూ, కుండీలూ, ప్రమిదలూ ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. అలా మురుగన్ దగ్గరకు వచ్చి పూల కుండీలు చూశాడా జర్మన్ దేశస్తుడు. అవి నచ్చాయి. తనకు కావాల్సిన ఆకృతి, పరిమాణం చెప్పి వేల సంఖ్యలో కుండీలకు ఆర్డరు ఇచ్చాడు. దాంతో ఇటుకల తయారీని పక్కనపెట్టి ఆ కుండీల్ని తయారుచేసింది మురుగన్ కుటుంబం. అలా కొన్నేళ్లపాటు లక్షల సంఖ్యలో పూల కుండీల్ని ఐరోపా దేశాలకు ఎగుమతి చేశారు. తర్వాత కాలంలో చర్చిలో కొవ్వొత్తులు పెట్టడానికి ఉపయోగించే స్టాండుల్నీ తయారుచేసి ఐరోపాకు ఎగుమతి చేసేవాడు మురుగన్. పనిలో కొత్తదనంతోపాటు లాభమూ ఉండటంతో నాణ్యతలో రాజీ పడకుండా చూసుకునేవాడు.
గల్ఫ్ బాట మనదేశానికి వచ్చిన కొందరు అరబ్ వ్యాపారులు మురుగన్ పనితనం గురించి విన్నారు. అరబ్ దేశాల్లో సాంబ్రాణి ధూపం స్టాండులకు మంచి డిమాండు ఉంటుంది. ఆ స్టాండుల్ని చేయమని మురుగన్‌ని అడిగారు. లక్షల్లో వాటిని కొనుగోలు చేసేవారు. సాంబ్రాణి స్టాండులకీ, డిజైనర్ ప్రమిదలకీ మలేషియా, సింగపూర్‌లలోనూ డిమాండు ఉండటంతో ఆ దేశాలకూ ఎగుమతి ప్రారంభించాడు మురుగన్. పర్యావరణ హితమైన వస్తువులకు గిరాకీ ఏర్పడటంతో మట్టితో కొద్దికాలంగా పెరుగు కప్పులూ, టీ కప్పులూ, ఐస్ క్రీమ్ కప్పులూ చేయమని గల్ఫ్ దేశాల నుంచి మురుగన్‌కి ఆర్డర్లు వస్తున్నాయి. మురుగన్ గల్ఫ్ దేశాలకు చేసే ఎగుమతుల జాబితాలో అయిదేళ్ల కిందట బిర్యానీ కుండలూ చేరాయి. దమ్ బిర్యానీని వేడివేడిగా తింటేనే మజా! కానీ ఆ వేడికి లోహ పాత్రల్లో రసాయనాలు కరిగే ప్రమాదం ఉంది. పైగా బిర్యానీలో ఎక్కువగా వాడే నూనెనీ, నెయ్యినీ అవి కాస్తయినా పీల్చుకోలేవు. బిర్యానీని పార్శిల్ చేయాల్సి వస్తే మామూలుగా వాడే కవర్లలోని రసాయనాలూ కరిగి అందులో కలుస్తాయి. వీటికి పరిష్కారంగానే మట్టి పాత్రల్ని వాడుతున్నాయి అక్కడి హోటళ్లు. మొదట కోల్‌కతా నుంచి ఇలాంటి పాత్రల్ని కొనేవారు. కానీ అవంత నాణ్యంగా, ఆకర్షణీయంగా ఉండేవి కావు. అయిదేళ్ల కిందట దుబాయ్‌లోని స్టార్ హోటల్‌కు చెందిన షెఫ్ ఒకరు మురుగన్ గురించి తెలుసుకొని కొన్ని కొలతలు చెప్పి నమూనా కుండల్ని పంపమని అడిగారు. అతడు చెప్పినట్టే తయారుచేసి కొన్నింటిని పంపాడు మురుగన్. అవి నచ్చడంతో అప్పట్నుంచీ మురుగన్ దగ్గర కుండల్ని కొనడం మొదలుపెట్టాడు. తర్వాత గల్ఫ్ దేశాల్లోని తన వృత్తికి చెందిన స్నేహితులకూ చెప్పడంతో వారు కూడా ఆ పాత్రల్ని కొనడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఆ పాత్రల్ని దుబాయ్‌తోపాటు కువైట్, జోర్డాన్, ఖతార్‌లకీ ఎగుమతి చేస్తున్నాడు మురుగన్. అక్కడి హోటళ్లు ఈ కుండల్ని ప్రధానంగా బిర్యానీ పార్సిళ్ల కోసం ఉపయోగిస్తున్నాయి. వీటిలో బిర్యానీ పార్శిల్ చేసేటపుడు... కుండలో బిర్యానీని నింపి పైన ఒక రోటీని మూతగా పెట్టి దాన్ని పెట్టెలో ఉంచి పంపిస్తారు. దీన్ని మైక్రోవేవ్ ఓవెన్లో పెట్టి వేడిచేసుకోవచ్చు. కుండల్ని దాదాపు 950 డిగ్రీల సెంటీగ్రేడ్ వేడి ఉండే బట్టీల్లో కాల్చడంవల్ల ఓవెన్ వేడికి పాత్ర తట్టుకుంటుంది. అదే సమయంలో బిర్యానీ రుచిలోనూ ఎలాంటి మార్పూ రాదు. అందుకే వీటికంత డిమాండ్. ఈ పాత్ర లోపలా బయటా ఆయా కంపెనీల లోగోల్నీ, పేర్లనీ అచ్చువేస్తాడు మురుగన్.వేలల్లో ఎగుమతి ప్రస్తుతం నెలకు 10వేల వరకూ బిర్యానీ కుండల్ని గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేస్తున్నాడు మురుగన్. ఈయన దగ్గర 15 మంది పనిచేస్తుంటారు. మొదట్లో కుమ్మరి చక్రంపైనే ఇవన్నీ తయారుచేసేవాళ్లు. తర్వాత బిర్యానీ కుండలతోపాటు మిగతా వాటినీ పెద్ద మొత్తంలో తయారు చేయాల్సి రావడంతో యంత్రాల్ని కొన్నారు. ప్లాస్టిక్ వస్తువులు తయారుచేయడానికి ఉపయోగించే పోత నమూనాల్ని వీరు ఉపయోగిస్తున్నారు. మొదట్లో వాటితో పాత్రలు సరిగ్గా వచ్చేవి కాదు. తర్వాత నిపుణుల సహకారంతో నమూనాలకి కొన్ని మార్పులు చేశాడు మురుగన్. నమూనాతో చేసిన పాత్రల అచ్చులకు చేతులతో తుది మెరుగులు దిద్దుతారు. ఈ పాత్రల తయారీకి టన్నుల కొద్దీ మట్టిని తడిపి సిద్ధం చేయాలి. ఇది చాలా శ్రమతో కూడిన పని. అందుకని 'ప్లాస్టర్ ఆఫ్ పారిస్' మిశ్రమాన్ని కలపడానికి ఉపయోగించే యంత్రాల్ని కొన్నారు. వీటికీ తమ అవసరాలకు తగ్గట్టు కొన్ని మార్పులుచేశారు. ఇప్పుడు యంత్రాల సాయంతో రోజూ వెయ్యి వరకూ బిర్యానీ కుండలతోపాటు మిగతా వస్తువుల్నీ తయారుచేయగలుగుతున్నారు. మట్టితో కాసులు పండిస్తూ చుట్టుపక్కల ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నాడు మురుగన్.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







