రాయలసీమ రాజకీయవేత్త-టీజీ
- May 16, 2025
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రాయలసీమ నుంచి ప్రాతినిధ్యం వహించిన ముఖ్యల్లో టి.జి.వెంకటేష్ ఒకరు. పారిశ్రామికవేత్తగా జీవిత ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన తర్వాత కాలంలో రాజకీయాల్లోకి అడుగుపెట్టి రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాయలసీమ ప్రాంత ప్రజల అవసరాల కోసం ఉద్యమించిన తొలినేతగా టీజీ నిలిచారు. మర్రి చెన్నారెడ్డి నుంచి ఇప్పటి చంద్రబాబు వరకు అందరితో అత్యంత సన్నిహిత సంబంధాలు నెరిపారు. నేడు సీనియర్ పొలిటీషియన్ టీ.జీ .వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కథనం...
టీ.జీ .వెంకటేష్ పూర్తిపేరు తుంబళం గుత్తి వెంకటేష్. 1950,మే 16న ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని అవిభక్త చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణంలో ఆర్యవైశ్య కుటుంబానికి చెందిన టి.జి.గోపాల్ శెట్టి, గౌరమ్మ దంపతులకు జన్మించారు. అయితే, వీరి స్వస్థలం మాత్రం కర్నూలు జిల్లా ఆదోని పట్టణం. వెంకటేష్ బాల్యం, విద్యాభ్యాసం మొత్తం అదోనిలోనే సాగింది. ఆదోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీకామ్ పూర్తి చేసిన తర్వాత లా చదివేందుకు బెంగళూరు వెళ్లి కర్ణాటక యూనివర్సిటీలో చేరారు. అయితే మొదటి సంవత్సరం తర్వాత కొన్ని కుటుంబ పరిస్థితులు కారణంగా వదిలేశారు.
టీజీ కుటుంబం తోలి నుంచి ఆదోని పట్టణంలో వ్యాపారం నిర్వహించేవారు. తండ్రికి వ్యాపారంలో చేదోడు వాదోడుగా ఉంటూ వచ్చిన వెంకటేష్, తర్వాత సొంతంగా వ్యాపారం చేస్తూ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోని పత్తికొండ ప్రాంతంలో శ్రీ రాలయసీమ్ ఆల్కలీస్& అలైడ్ కెమికల్స్ అనే కాస్టిక్ సోడా ఫ్యాక్టరీని ప్రారంభించారు. అది సక్సెస్ అవ్వడంతో తర్వాత కెమికల్స్, పవర్ ప్లాంట్స్, ఫార్మా, రియల్ ఎస్టేట్, హాస్పిటల్స్, హోటల్స్ మరియు విద్యాసంస్థలు స్థాపించారు. రాయలసీమ ప్రాంతంలో అత్యంత విజయవంతమైన వ్యాపారవేత్తగా వెంకటేష్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుర్తింపు సాధించారు. వీరి పరిశ్రమల దాదాపు కొన్ని వేల మందికి ఉపాధి కల్పించారు.
వ్యాపారాల్లో బిజీగా ఉంటూనే రాజకీయ నాయకులతో తోలి నుంచి సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. కాంగ్రెస్ నేపథ్యం కలిగిన కుటుంబం కావడం వల్ల కర్నూలు జిల్లాకు మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డికి మద్దతుదారుగా వీరి కుటుంబం ఉండేది. కోట్ల ద్వారానే రాష్ట్ర స్థాయి నాయకులతో పరిచయాలు ఏర్పడ్డాయి. మాజీ సీఎంలు మర్రి చెన్నారెడ్డి, అంజయ్య, నేదురుమల్లి జనార్దన రెడ్డి కర్నూలు వచ్చిన సమయంలో వీరింటికి వచ్చేవారు. ఎన్టీఆర్ తెదేపా స్థాపించిన తర్వాత ఆయనతోను వెంకటేష్ గారు సన్నిహిత పరిచయాలు పెంచుకున్నారు.
ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబుతో సైతం అదే సాన్నిహిత్యాన్ని కొనసాగిస్తూ వచ్చారు. 1999లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరి కర్నూలు శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత 2004లో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2005లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2009లో కర్నూలు నుంచి రెండోసారి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. 2013-14 మధ్యలో కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో మైనర్ ఇరిగేషన్ మంత్రిగా పనిచేశారు.
2009-14 వరకు టీజీ కాంగ్రెస్ పార్టీలో ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చేందిన దిగ్గజ నేత కొణిజేటి రోశయ్య తర్వాత అత్యంత ప్రజాదరణ కలిగిన రాష్ట్ర నాయకుడిగా ఎదిగారు. ఇదే సమయంలో తెలంగాణ ఉద్యమం ఉదృతంగా సాగుతున్న దశలోనే రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరగకుండా చూడాలని కోరుతూ రాయలసీమ జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసి సీమ ప్రాంత ప్రజల హక్కుల కోసం పోరాటం చేశారు. అయితే, రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ 2014లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు చంద్రబాబు సమక్షంలో తిరిగి తెదేపాలో చేరి కర్నూలు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
2016లో తెదేపా నుంచి రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. 2019లో తెదేపా ఓటమి తర్వాత కొన్ని అనివార్య పరిస్థితుల్లో వెంకటేష్ గారు భాజపాలో చేరారు. వెంకటేష్ భాజపాలో చేరినప్పటికి ఆయన కుమారుడు టిజి భరత్ మాత్రం తెదేపాలోనే కొనసాగుతూ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కర్నూలు నుంచి పోటీ చేసి ఎమ్యెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం చంద్రబాబు మంత్రి వర్గంలో పరిశ్రమలు & వాణిజ్య శాఖల మంత్రిగా పనిచేస్తున్నారు.
రాజకీయాలు పక్కన బెడితే సామాజిక సేవా రంగంలో వెంకటేష్ క్రియాశీలకంగా ఉన్నారు. వ్యాపార, రాజకీయ రంగంలో ఎంత బిజీగా ఉన్నప్పటికి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. టిజి ఫౌండేషన్ కింద యువతకు ఉపాధి కల్పన, ఉచిత వైద్య శిబిరాలు మరియు పేద విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తూనే ఉన్నారు.
అడుగుపెట్టిన ప్రతి రంగంలో తనదైన ముద్ర వేసిన టిజి, ప్రస్తుతం క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయినప్పటికి సమకాలీన రాజకీయాల మీద తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెబుతారు. రాబోయే రోజుల్లో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఇరాన్ దాడుల అనంతరం కతార్లో ఇండియన్ ఎంబసీ హెచ్చరిక
- ఎయిర్ ఇండియా మిడిల్ ఈస్ట్ విమానాలను నిలిపివేత
- నివాసితులను అప్రమత్తంగా ఉండాలని కోరిన దుబాయ్ సెక్యూరిటీ సర్వీస్
- కతార్ పై మిసైల్ దాడిని తీవ్రంగా ఖండించిన GCC ప్రధాన కార్యదర్శి
- బహ్రెయిన్ వైమానిక పరిధిని తాత్కాలికంగా నిలిపివేత
- కువైట్ తాత్కాలికంగా వైమానిక పరిధి మూసివేత
- శ్రీవారి లడ్డూ ప్రసాదం కొనుగోలుకు నూతన సదుపాయం
- ఆర్టీసీ సిబ్బందిపై దాడులకు పాల్పడితే చట్టపరమైన చర్యలు: ఎండీ వీసీ సజ్జనర్
- భారత్కి క్రూడాయిల్ విషయంలో ఇబ్బంది లేదు: హర్దీప్ సింగ్
- చెన్నై పోలీసుల అదుపులో హీరో శ్రీరామ్..