జేఎన్.1 వేరియంట్ కరోనా లక్షణాలు
- May 20, 2025
న్యూ ఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ కేసులు మళ్లీ స్వల్పంగా పుంజుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నెల 19 నాటికి దేశవ్యాప్తంగా 257 యాక్టివ్ కోవిడ్ కేసులు నమోదైనట్లు అధికారిక గణాంకాలు తెలుపుతున్నాయి. ఈ పరిణామంతో అప్రమత్తమైన ఆరోగ్య శాఖ అధికారులు, వ్యాధి వ్యాప్తి తీరుతెన్నులపై నిశితంగా దృష్టి సారించారు.ఇప్పటికే హాంకాంగ్, సింగపూర్ వంటి దేశాల్లో కోవిడ్ కేసులు పెరుగుతుండటం గమనార్హం.
ప్రస్తుతం మన దేశంలో కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. అయితే, హాంకాంగ్, సింగపూర్‌లలో కోవిడ్ విజృంభణకు ఎల్ఎఫ్.7, ఎన్‌బీ.1.8 అనే కరోనా వేరియంట్లు కారణమని నిపుణులు తేల్చారు. ఈ రెండు వేరియంట్లు కూడా జేఎన్.1 అనే మరో కొత్త వేరియంట్ నుంచి ఉద్భవించినవే కావడం గమనార్హం.
జేఎన్.1 వేరియంట్ అంటే ఏమిటి?
ఒమిక్రాన్ బీఏ.2.86 వేరియంట్ నుంచి జేఎన్.1 వేరియంట్ పుట్టుకొచ్చింది. దీన్ని తొలిసారిగా 2023 ఆగస్టు నెలలో గుర్తించారు. గతంలో వచ్చిన వేరియంట్లతో పోలిస్తే, ఒకటి రెండు అదనపు జన్యు ఉత్పరివర్తనాల (మ్యూటేషన్లు) కారణంగా ఈ వేరియంట్‌కు వేగంగా వ్యాపించే సామర్థ్యం ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల, ఇది శరీరంలోని రోగనిరోధక శక్తిని సులభంగా ఛేదించి ఇన్‌ఫెక్షన్ కలుగజేస్తుంది. “బీఏ.2.86 వేరియంట్‌తో పోల్చినప్పుడు జేఎన్.1లో ఒక మ్యూటేషన్ అదనంగా ఉంది. ఈ మార్పు, వేరియంట్‌లోని స్పైక్ ప్రొటీన్‌లలో స్వల్ప మార్పులకు కారణమవుతుంది. ఫలితంగా ఇది రోగనిరోధక శక్తి కంచెను దాటుకుని ఇన్ఫెక్ట్ చేయగలుగుతోంది” అని యేల్ యూనివర్సిటీ పరిశోధకులు వివరించారు.
జేఎన్.1 వేరియంట్ సోకిన వారికి ఉండే లక్షణాలు:
జేఎన్.1 వేరియంట్ సోకిన వారిలో సాధారణంగా పొడి దగ్గు, రుచి కోల్పోవడం, తలనొప్పి, ముక్కు దిబ్బడ, తీవ్రమైన అలసట, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అంతేకాకుండా, ఈ వేరియంట్ బారిన పడిన కొందరిలో డయేరియా (విరేచనాలు) కూడా ఎక్కువగా కనిపిస్తోందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.
అయితే, ప్రస్తుతం భారత్‌లో పరిస్థితి నిలకడగానే ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. నిన్న డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్ఎస్) నేతృత్వంలో కోవిడ్ పరిస్థితిని సమీక్షించేందుకు ఉన్నతస్థాయి అత్యవసర సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వెల్లడైన వివరాల ప్రకారం,నమోదవుతున్న కేసుల్లో వ్యాధి లక్షణాలు చాలా వరకు ఓ మోస్తరుగానే ఉన్నాయని, బాధితులు ఆసుపత్రిలో చేరాల్సినంత తీవ్రత లేదని విశ్వసనీయ వర్గాలు తెలియజేశాయి. అయినప్పటికీ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కోవిడ్ నిబంధనలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!