మాస్టర్ పీస్ దర్శకుడు-మణిరత్నం
- June 02, 2025
మణిరత్నం..భారత సినిమాకు దక్కిన అత్యున్నత దర్శకులలో ఒకరు. ఆయన సినిమాలు ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ వేదికలపై పలు మార్లు ప్రదర్శించబడ్డాయి. పూర్తిగా డెప్త్ ఉన్న సబ్జెక్ట్ సినిమాలనే ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు మణి. దేశం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలను ఓ సాధారణ ప్రేమజంట ముందుంచుతాడు. వారి ప్రేమతోనే.. ఆ సమస్యను జయిస్తాడు. ఆ సమయంలో అన్ని రకాల ఎమోషన్స్ తో ఆడియన్స్ అటెన్షన్ ను క్యాచ్ చేస్తాడు మణిరత్నం. దాదాపు మూడు దశాబ్ధాలకు పైగా భారత చలన చిత్ర రంగంలో తనదైన ముద్ర వేసిన అద్భుతమైన దర్శకుడు.. మణిరత్నం. ఈరోజు మణి రత్నం పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక కథనం...
మణిరత్నం పూర్తిపేరు గోపాల రత్నం సుబ్రహ్మణ్యం. 1956, జూన్ 2వ తేదీన తమిళనాడులోని మదురై పట్టణంలో జన్మించారు. తండ్రి వీనస్ సుబ్రహ్మణ్యం పేరున్న డిస్ట్రిబ్యూటర్ మరియు పలు చిత్రాల నిర్మాణంలో పాలుపంచుకున్నారు. మేనమామ కృష్ణమూర్తి ప్రముఖ నిర్మాణ సంస్థ వినీష్ స్టూడియోస్ అధినేత. మణి సోదరులు వెంకటేశ్వరన్, శ్రీనివాసన్‌లు సైతం నిర్మాతలుగా రాణించారు. మణికి బాల్యం విద్యాభ్యాసం మొత్తం చెన్నైలోనే సాగింది. ఆ తర్వాత ముంబైలోని జమ్నాలాల్ బజాజ్ మేనేజ్మెంట్ ఇనిస్టిట్యూట్ నుంచి ఎంబీఏ పూర్తి చేసి కొంతకాలం చెన్నైలోని ప్రముఖ కంపెనీలో పనిచేశారు. ఈ సమయంలోనే కుటుంబ వృత్తయిన సినిమాల మీద మక్కువ పెరిగి తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.
మణి సినిమా నిర్మాణం కంటే దర్శకత్వం మీద మక్కువ పెరగడానికి భారతీరాజా ఒక కారణం. ఆయన తీసిన 16 ఏళ్ళ వయస్సు కథ, కథనం బాగా నచ్చడంతో దర్శకత్వం వైపు అడుగులేశారు. ఈ సమయంలోనే ఆయనకు పలువురు యువ టెక్నీషియన్లతో పరిచయం ఏర్పడి తన మొదటి సినిమా ఎలాంటి కథతో తీస్తే బాగుంటుందని చర్చలు జరుపుతూ చివరిగా ఒక కథ రాసుకొని వారికి వినిపించగా వారికి నచ్చింది. ఇక తన మేనమామ వీనస్ కృష్ణమూర్తి నిర్మించేందుకు ఒప్పుకున్నారు. అయితే, తమిళంలో కాకుండా తక్కువ బడ్జెట్‌తో కన్నడలో తీయడానికి నిర్ణయించుకున్నారు. ఆ సినిమానే పల్లవి అనుపల్లవి. ఈ చిత్రంతోనే బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ హీరో అయ్యారు. ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో మణి దర్శకుడిగా నిలదొక్కుకోవడానికి అవకాశం దక్కింది.
ఆ తర్వాత తమిళంలో తీసిన మౌనరాగం మూవీతో సూపర్ హిట్ అందుకున్నారు. చిన్న కథే అయినా.. తన టేకింగ్ ఎలా ఉంటుందో స్పష్టంగా ఆ సినిమా ద్వారా చూపించారు. ఈ సినిమాతో మణిరత్నం అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నారు. ఈ మూవీ ఆస్కార్ కు నామినేట్ కూడా అయ్యింది. మణిరత్నం తొలిసారి తెలుగులో తీసిన చిత్రం.. గీతాంజలి. నాగార్జున కేరీర్ లో మంచి బ్రేక్ ఇచ్చిన ఈ మూవీని.. కేవలం 60 రోజుల్లో కంప్లీట్ చేశారు. మ్యూజికల్ హిట్ గా నిలిచిన ఈ మూవీ.. అప్పటి యూత్ లో నాగార్జునకు క్రేజ్ తెచ్చిపెట్టింది. టెర్రరిజం ట్రయాలజీగా పేరొందిన చిత్రాలు.. మణిరత్నం ఖాతాలో చాలానే ఉన్నాయి. రోజా, బొంబాయి, దిల్ సే చిత్రాలు.. అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రశంసలు అందుకున్నాయి
రజినీకాంత్, మమ్ముట్టి ప్రధాన పాత్రలో మణి రత్నం తెరకెక్కించిన చిత్రం దళపతి భారీ హిట్ అందుకుంది. ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ ను వెండితెరపైకి తీసుకొచ్చిన దర్శకుడు మణిరత్నమే. తమిళ రాజకీయాల నేపథ్యంలో నిర్మించిన ఇద్దరు మూవీలో ఐశ్వర్య, మోహన్ లాల్, ప్రకాశ్ రాజ్, టబూ, మధుబాల వంటి భారీ తారాగణం కనిపిస్తారు. మణిరత్నం అంటేనే ఓ సినీ ఫ్యాక్టరీ. ఆయన ఎంతో మంది హీరోలను, నటులను, దర్శకులను తీర్చిదిద్దారు. ఆయన నుంచి ఎంతోమంది ప్రముఖులు వెలుగులోకొచ్చారు. ఆస్కార్ అందుకున్న ఏ.ఆర్.రెహ్మాన్‌ను కూడా పరిచయం చేసింది..మణిరత్నమే. ప్రస్తుతం మణి దర్శకత్వంలో కమల్ హాసన్, శింబు ప్రధాన పాత్రల్లో నటించిన తగ్ లైఫ్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.
--డి.వి.అరవింద్ ( మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- క్రాస్ బార్డర్ స్మగ్లింప్ పై స్పెషల్ ఫోకస్..సౌదీ అరేబియా
- ఒమన్ ఆదాయాలను పెంచుతున్న పర్యాటక రంగం..!!
- యూఏఈ లాటరీ: 7 మంది అదృష్టవంతులు..ఒక్కొక్కరికి Dh100,000..!!
- ECB వడ్డీ రేట్లను తగ్గించడంపై ఆశలు పెట్టుకున్న QNB..!!
- దుబాయ్ విమానాశ్రయంలో ఇన్ఫ్లుయెన్సర్ అబ్దు రోజిక్ అరెస్టు..!!
- సముద్ర పర్యావరణానికి నష్టం.. నలుగురి అరెస్టు..!!
- ప్రముఖ నటుడు కోట శ్రీనివాస రావు కన్ను మూత
- చిన్నారి హత్య కేసు: ఇరాన్లో ప్రజల ముందే ఉరిశిక్ష
- టీయూఐ విమానంలో వాష్ రూంలో దమ్ముకొట్టిన జంట…
- ఒమన్ నుంచి ఫుజైరాకు ఎమిరాటీలు ఎయిల్ లిఫ్ట్..!!