మ్యూజిక్ మేస్ట్రో-ఇళయరాజా
- June 02, 2025
సంప్రదాయ వాద్య పరికరాలతో వినసొంపైన సంగీతం సమకూర్చగలిగే నేర్పరి. సప్తస్వరాలను మనసులకు ముడిపెట్టగలిగే గానగాంధర్వుడు. కోయిల పాటను మించిన కమ్మని స్వరం ఆయన సొంతం. అందుకే ఆయన రాగాలకు కరగని మనసుండదు... కదలని గుండె ఉండదు. అందరూ గౌరవంగా సంగీత మేస్ట్రో అని పిలుచుకుంటారు.ఆయనే ఇళయరాజా. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కథనం..
ఇళయరాజా అసలు పేరు జ్ఞానదేశికన్. 1943, జూన్ 2న తమిళనాడులోని తెన్ని జిల్లా పన్నైపురంలో జన్మించారు. తండ్రి రామస్వామి, తల్లి చిన్నత్తాయమ్మాళ్. రాజా తండ్రి రామస్వామి కేరళలోని తేయాకు తోటల్లో సూపర్‌వైజర్‌గా పనిచేసేవారు. అతనిపై టీ ఎస్టేట్ అధికారి ఆంగ్లేయ దొర. అతని ప్రోద్బలంతో రామసామి క్రైస్తవ మతం స్వీకరించారు. అప్పుడు జ్ఞానదేశికన్ పేరును డేనియల్ రాజయ్య (రాజా)గా మార్చాడు. రాజా తన మేనమామ ఇంటివద్ద ఉంటూ చదువుకొసాగించారు.
కుటుంబ ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడం వల్ల చదువుకు స్వస్తి చెప్పి కూలీ పనిచేశారు. మదురైలో వైగై నది మీద ఆనకట్ట నిర్మాణం జరిగినప్పుడు, ఆ కట్ట నిర్మాణం కోసం రాళ్లెత్తిన కూలీలలో రాజా ఒకరు. అప్పుడే వ్యవసాయ కూలీలు పాడుకొనే ఏలపాటలు, కార్మికులు పాడుకొనే జానపద గీతాలు రాజాకు కంఠోపాఠమయ్యాయి. రాజయ్య పాడడం గమనించిన ఓ ఇంజనీర్ అతన్ని తన వద్ద నౌకరుగా నియమించుకొని వారానికి 7 రూపాయల జీతం ఇచ్చేవాడు. ఈ రోజు కోట్లకు పడగెత్తినా తన మొదటి సంపాదన ఇచ్చిన ఆనందం మరచిపోలేనిదని అంటుంటారు. తర్వాత కమ్యూనిస్టు పార్టీ ప్రచార కార్యక్రమాల్లో ప్రజలను ఉత్తేజపరచేలా రాజా పాటలు పాడేవారు.
ఇళయరాజాకు 'దీపం' అనే తమిళ చిత్రానికి సంగీత దర్శకత్వం నిర్వహించే అవకాశం వచ్చినా దాని నిర్మాణం ఆగిపోయింది. జెమినీ సంస్థ చిత్రానికి సంగీతం అందించే అవకాశం అందినట్లే అంది దక్కకుండా పోయింది. 1976లో పంజు అరుణాచలం అనే నిర్మాత గ్రామీణ నేపథ్యంలో 'అణ్ణక్కిళి' సినిమా నిర్మిస్తూ ఇళయరాజాకు తొలి అవకాశం ఇచ్చారు. శివకుమార్, సుజాత నటించిన ఆ సినిమాకు ఇళయరాజా అందించిన సంగీతం వినూత్నంగా, విభిన్నంగానూ ఉండటం వల్ల సంగీతాభిమానులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. అందులో ఎస్.జానకి ఆలపించిన 'మచ్చానై పార్తింగళా మలైవాళ తోప్పుక్కుళ్ళే' (తెలుగులో 'మావయ్య వస్తాడంటా మనసిచ్చి పోతాడంటా'− రామచిలక సినిమాలో) పాటకు ప్రేక్షకులు లేచి నిలబడి డ్యాన్స్ చేసేవారు.
పియానో, గిటార్ వంటి పాశ్చాత్య వాద్య పరికరాలమీద హంసధ్వని, రీతి గౌళ, మోహన వంటి కర్ణాటక సంప్రదాయ రాగాలను మేళవించి స్వరపరచడం వల్ల సంగీత ప్రియులకు ఏదో కొత్తదనం గోచరించి, క్రమంగా రాజాకు అభిమానులై పోయారు. 'నిళల్గళ్', 'ఆరిళిరిందు అరువత్తువరై', 'నేట్రికన్', 'మూదుపాణి', 'నింజతై కిలాత్తే' వంటి సినిమాల్లోని పాటలు సూపర్ హిట్లుగా నిలవడం వల్ల రాజా పేరు తమిళనాట మారుమోగిపోయింది. భారతీరాజా−ఇళయరాజా కాంబినేషన్లో ఎంతో అద్భుతమైన పాటలు వచ్చాయి.
1977లో వచ్చిన 'భద్రకాళి' సినిమాతో తెలుగు చిత్రరంగ ప్రవేశం చేశారు. అందులో జేసుదాస్, సుశీల ఆలపించిన 'చిన్నిచిన్ని కన్నయ్యా' పాట తెలుగు ప్రేక్షకులను అలరించింది. తర్వాత వచ్చిన 'వయసు పిలిచింది' సినిమాలోని అన్ని పాటలూ యువతరానికి కొత్త సంగీత టానిక్‌ను ఎక్కించి మత్తులోకి నెట్టేశాయి. హిందీలో విజయవంతమైన 'డాన్' సినిమాను మేకప్ ఆర్టిస్టు పీతాంబరం తెలుగులో 'యుగంధర్' పేరుతో నిర్మిస్తే, ఇళయరాజా తనదైన శైలిలో సంగీతం అందించి ఆ సినిమాను సూపర్ హిట్ చేశారు. 'ఎర్రగులాబీలు', 'అజేయుడు', 'పంచభూతాలు', 'కాళరాత్రి' సినిమాలలోని పాటలకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.
1981లో వచ్చిన 'సీతాకోకచిలక' సినిమా పాటలు సంగీత అభిమానులను ఇళయరాజా మత్తులోకి దించేశాయి. 'వసంతకోకిల', 'అమరగీతం', 'మధురగీతం', టిక్ టిక్ టిక్', 'పూలపల్లకి', 'కొత్త జీవితాలు' సినిమాలలో పాటలు మారుమ్రోగిపోయాయి. సరికొత్త బాణీలు, వైవిధ్యభరిత సంగీతం యువతరాన్ని గంగవెర్రులెత్తించింది. 'శివ', 'సాగరసంగమం', 'అభిలాష', 'రాజకుమార్', 'మంత్రిగారి వియ్యంకుడు', 'సంకీర్తన' వంటి సినిమాలలోని పాటల సంగతి చెప్పాల్సిన పనేలేదు.
1984లో దర్శకుడు వంశీతో ఇళయరాజాకు పరిచయమైంది. 'సితార' ఆయనకు రెండవచిత్రం. రీరికార్డింగ్ కాకుండా డబుల్ పాజిటివ్ వేసి చూపిస్తే శ్రేయోభిలాషులు పెదవి విరిచారు. వంశీ నిరాశ చెందారు. ఇళయరాజా దానికి రీ రికార్డింగ్ చేసి విడుదలచేస్తే ఆ సినిమా సంచలనాన్ని సృష్టించింది. వంశీ సినిమాలు 'లేడీస్ టైలర్', 'అన్వేషణ', 'ప్రేమించు−పెళ్లాడు', 'మహర్షి', 'చెట్టుకింద ప్లీడర్', 'ఏప్రిల్ 1 విడుదల', 'శ్రీ కనక మహాలక్ష్మి డ్యాన్స్ ట్రౌపే' అన్నీ సంగీతపరంగా సూపర్ హిట్లే. 'ఛాలెంజ్', 'మాంగల్యబంధం', 'గీతాంజలి', 'శ్రీషిర్డీ సాయిబాబా మహాత్మ్యం', 'జ్వాల', 'రాక్షసుడు', 'ఒక రాధ ఇద్దరుకృష్ణులు' పెద్ద హిట్ సినిమాలు. ఆర్జీవీ తోలి చిత్రం 'శివ' సినిమాకు ఇళయరాజా వినూత్నమైన సంగీతాన్ని అందించారు.
సినిమా విజయవంతం కాదని తనకు అనిపించిన సందర్భాల్లో, ఇళయరాజా నిర్మాతల్ని రీ రికార్డింగ్ వంటి పనులకు ఎక్కువగా ఖర్చు పెట్టనిచ్చేవారు కాదు. 1988 తర్వాత విడుదలైన సినిమాలలో ఇళయరాజా సంగీత పోకడలు కొత్త పుంతలు తొక్కాయి. తమిళనాడులో సినిమా విడుదల రోజున హీరోలతో సమానంగా ఇళయరాజా కటౌట్లు వెలిసేవి. మ్యూజిక్ షాపులు ఇళయరాజా పాటలు కొనేవాళ్లతో నిండిపోయేవి. భారతీరాజా తొలిచిత్రం 'పదునారు వయదినిలే' (పదహారేళ్ళ వయసు)లో ఉత్తమ గాయనిగా ఎస్. జానకికి జాతీయ పురస్కారం లభించింది ఇళయరాజా సంగీత దర్శకత్వంలోనే. అలాగే గాయని చిత్రకు తొలి జాతీయ పురస్కారాన్ని తెచ్చి పెట్టిన 'సింధుభైరవి' చిత్రానికి సంగీతం సమకూర్చిందీ ఆయనే.
చిత్రగాన కల్పవృక్షానికి ఫలపుష్పభరితమైన కొమ్మలెన్నో! అందులో ఇళయరాజా ఒక చిటారుకొమ్మ. "సహజమైన సంప్రదాయ వాద్యపరికరాలతో సంగీతం సమకూర్చితే అందులో మనకు ఆత్మ కనిపిస్తుంది. యంత్రాలతో సంగీతం అంటే ఎప్పుడూ యాంత్రికంగానే ఉంటుంది. యాదృచ్ఛికంగా వచ్చేదే సంగీతం. దానికో సమయం అంటూ ఉండదు. అప్పుడే పుట్టిన పసిపాపలా ఉండేదే సంగీతమంటే. వినగానే కొత్తగా ఉండాలి.. వినే శ్రోతకి కొత్త అనుభూతిని పంచాలి" అనేది ఇళయరాజా నమ్మిన సిద్ధాంతం.
తన మూడున్నర దశాబ్దాల వృత్తి జీవితంలో వివిధ భాషలలో దాదాపు 5 వేల పాటలకు, వేయి సినిమాలకు రాజా సంగీత దర్శకత్వం వహించారు. మనసుకు నచ్చని పని ఇళయరాజా ఎప్పుడూ చేయలేదు. హింసా నేపథ్యంతో ఒక కథను కమలహాసన్ వినిపిస్తే రాజా ఆ సినిమాకు సంగీతం చేయలేనని చెప్పారు. తనను ఒప్పించలేని కథకు రాజా సంగీతం ఇవ్వలేదు. కోయిల పాటను మించిన కమ్మని స్వరం ఆయన సొంతం. అందుకే ఆయన రాగాలకు కరగని మనసుండదు.. కదలని గుండె ఉండదు. అందరూ గౌరవంగా సంగీత మాస్ట్రో అని పిలుచుకుంటారు.
2005లో ఆసియా ఖండం నుంచి అఖండ వాద్యబృందంతో లండన్‌లోని 'రాయల్ ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రా'తో సింఫనీ నిర్వహించిన తొలి సంగీత దర్శకుడు ఇళయరాజా. ‘తిరు వానగం’ పేరుతో నిర్వహించిన ఈ సింఫనీ బాగా పేరు తెచ్చింది. ఈ కార్యక్రమంలో ఐదుసార్లు గ్రామీ పురస్కారం అందుకున్న సౌండ్ ఇంజనీర్ రిచర్డ్ కింగ్, ఆస్కార్ పురస్కార గ్రహీత స్టీఫెన్ షెనార్ట్ రాజా వాద్యబృందంలో సభ్యులు. పంచముఖి’ పేరుతో కొత్తరాగాన్ని సృశించిన ఘనత కూడా ఇళయరాజాదే.
ఇళయరాజా సంగీతం అందించిన సాగరసంగమం (తెలుగు), సింధుభైరవి (తమిళం), రుద్రవీణ (తెలుగు), కేరళవర్మ పళస్సిరాజా (మళయాళం) చిత్రాలు జాతీయస్థాయి అవార్డులు తెచ్చాయి. సీతాకోకచిలక, రుద్రవీణ, జగదేకవీరుడు-అతిలోక సుందరి, శ్రీరామరాజ్యం సినిమాలకు ఉత్తమ సంగీత దర్శకుడిగా... ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది బహుమతి అందుకున్నారు. ఆరుసార్లు తమిళ చిత్ర ఉత్తమ సంగీత దర్శకుడిగా ఇళయరాజాకు అవార్డులు లభించాయి. కేరళ ప్రభుత్వ నుంచి మూడు అత్యున్నత పురస్కారాలు, రెండు ఫిలింఫేర్ బహుమతులు కూడా ఇళయరాజా పుచ్చుకున్నారు. 1988లో దివంగత ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి 'ఇసైజ్ఞాని' (సంగీత జ్ఞాని)అనే బిరుదుతో ఇళయరాజాను సత్కరించారు. అంతేకాకుకుండా తమిళనాడు ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘'కళైమామణి’' బిరుదుతో రాజాను సత్కరించింది.
2003లో ప్రఖ్యాత న్యూస్ ఛానల్ బీబీసీ నిర్వహించిన 'వరల్డ్ టాప్ 10 మోస్ట్ పాపులర్ సాంగ్స్ అఫ్ ఆల్ టైం' జాబితాలో... 1991లో మణిరత్నం దర్శకత్వంలో "దళపతి" సినిమాలోని రాజా సమకూర్చిన "అరె చిలకమ్మా" పాటకు 4వ స్థానం దక్కింది. 155 దేశాలలో ఈ సర్వే చేయడం విశేషం. 2013లో 49% మంది ఇళయరాజాను భారతదేశ ఉత్తమ సంగీత దర్శకుడిగా ప్రజలు ఎన్నుకున్నారు.
2010లో రాజాను భారత ప్రభుత్వం 'పద్మ భూషణ్' బిరుదుతో సత్కరించింది. 2018 లో భారత అత్యున్నత పురస్కారం 'పద్మ విభూషణ్' లభించింది. ఇళయరాజా ఇద్దరు కుమారులు కార్తీక్ రాజా, యవన్ శంకర్ రాజా, కుమార్తె భవతారణి అయన వారసత్వాన్ని కొనసాగిస్తూ సంగీత దర్శకులుగా మారారు. ఏది ఏమైనా భారతీయ సినీ సంగీతంలో ఆయనో లెజండ్. ఇప్పటికి తన దరిచేరే సినిమాలకు సరికొత్తగా మ్యూజిక్ ఇస్తూ దర్శకనిర్మాతలు తనపై ఉంచిన నమ్మకాన్ని వొమ్ము కానీయకుండా చూస్తున్నారు.
--డి.వి.అరవింద్ ( మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- క్రాస్ బార్డర్ స్మగ్లింప్ పై స్పెషల్ ఫోకస్..సౌదీ అరేబియా
- ఒమన్ ఆదాయాలను పెంచుతున్న పర్యాటక రంగం..!!
- యూఏఈ లాటరీ: 7 మంది అదృష్టవంతులు..ఒక్కొక్కరికి Dh100,000..!!
- ECB వడ్డీ రేట్లను తగ్గించడంపై ఆశలు పెట్టుకున్న QNB..!!
- దుబాయ్ విమానాశ్రయంలో ఇన్ఫ్లుయెన్సర్ అబ్దు రోజిక్ అరెస్టు..!!
- సముద్ర పర్యావరణానికి నష్టం.. నలుగురి అరెస్టు..!!
- ప్రముఖ నటుడు కోట శ్రీనివాస రావు కన్ను మూత
- చిన్నారి హత్య కేసు: ఇరాన్లో ప్రజల ముందే ఉరిశిక్ష
- టీయూఐ విమానంలో వాష్ రూంలో దమ్ముకొట్టిన జంట…
- ఒమన్ నుంచి ఫుజైరాకు ఎమిరాటీలు ఎయిల్ లిఫ్ట్..!!