రాజకీయ కలైంజ్ఞర్-కరుణానిధి

- June 03, 2025 , by Maagulf
రాజకీయ కలైంజ్ఞర్-కరుణానిధి

కరుణానిధి... భారత దేశ రాజకీయాల్లో ఈ పేరుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ద్రవిడ రాజకీయాలను అవపోసన పట్టి, తమిళనాడు రాజకీయాల్లో ప్రబల శక్తిగా ఎదిగారు. అధికారంలో ఉన్నా, లేకున్నా రాజకీయాలను శాసించారు. ద్రావిడ వాదమే తన సర్వస్వంగా జీవించి, తమిళనాడు ప్రజలకు ఆరాధ్యనేతగా మారారు ముత్తువేల్ కరుణానిధి. నేడు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, కలైంజ్ఞర్ కరుణానిధి జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం...  

ముత్తువేల్ కరుణానిధి అసలు పేరు దక్షిణామూర్తి. 1924, జూన్ 3వ తేదీన అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీలోని తిరుక్కువలై (నాగపట్నం జిల్లా)లో తెలుగు మూలాలు ఉన్న నాయిబ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు ముత్తువేలర్, అంజుగం. కరుణానిధి పూర్వీకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలుకు ఆనుకుని ఉన్న చెర్వుకొమ్ముపాలెం గ్రామానికి చెందిన వారు. చదువుకునే రోజుల్లో డ్రామా, కవిత్వం, రచనపై ఆసక్తి కబరిచారు. జస్టిస్ పార్టీకి కీలక నేత అలగిరిస్వామి ప్రసంగాలతో ఉత్తేజితుడయ్యారు. 14వ ఏటనే సాంఘీక పోరాటలవైపు అడుగేశారు.

కరుణానిధి 1940వ దశకంలో తమిళనాడు వ్యాప్తంగా ‘హిందీ’ వ్యతిరేక ఉద్యమంలో, పాల్గొన్నారు. స్థానిక యువతలో స్ఫూర్తిని రగిల్చేందుకు సంస్థను స్థాపించిన కరుణానిధి.. ఆ సంస్థ సిబ్బంది కోసం చేతిరాతతో రూపొందించిన దినపత్రిక ‘మానవర్ నెసాన్’ నడిపారు. ‘తమిళ్ మానవర్ మాండ్రం’ అనే పేరుతో విద్యార్థి సంఘాన్ని స్థాపించారు. తదనంతర కాలంలో ఉధ్రుతంగా సాగిన ద్రవిడ ఉద్యమానికి ప్రేరణగా, ప్రతీకగా ‘తమిళ్ మానవర్ మాండ్రం’ పేరొందింది. తమిళ్ మానవర్ మాండ్రం సభ్యుల్లో స్ఫూర్తిని రగిలించడానికి, ఆవేశం పెంపొందించడానికి ప్రారంభించిన దినపత్రిక క్రమంగా ‘మురసొలి’గా.. ప్రస్తుతం తమిళనాడు ప్రతిపక్ష పార్టీ ద్రవిడ మున్నేట కజగం (డీఎంకే) అధికార దినపత్రికగా ఉంది.

ద్రావిడ ఉద్యమ పితామహుడు పెరియార్ రామస్వామి నాయకర్ ప్రతిపాదించిన ద్రవిడ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులైన కరుణానిధి, ఆయన గురువు అన్నాదురైలు జస్టిస్ పార్టీకి రాజీనామా చేసి, పెరియార్ స్థాపించిన ద్రవిడ కళగం సంస్థలో చేరారు. అన్నాదురై నాయకత్వంలో తమిళనాడు వ్యాప్తంగా కుల నిర్మూలన ఉద్యమాన్ని ఉదృతంగా నిర్వహించారు. సంస్థను నడిపేందుకు కరుణానిధి నాటకాలు, సినిమాలకు కథలు, పాటలు రాస్తూ ఆర్థికంగా అండగా నిలిచారు.

పెరియార్ నియంతృత్వ పోకడలను వ్యతిరేకిస్తూ అన్నాదురైతో కలిసి 1949 సంవత్సరంలో ద్రవిడ మున్నేట్ర కళగం(డీఎంకే) పార్టీని స్థాపించారు. డీఎంకే ఆవిర్భావం తర్వాత కరుణానిధి పార్టీ విస్తరణ బాధ్యతలను చేపట్టి తమిళనాడు వ్యాప్తంగా పార్టీకి పటిష్టమైన పూనాదులు నిర్మించారు. అన్నాదురై మరో ముఖ్య శిష్యుడైన తమిళ సినీ అగ్రకథానాయకుడు ఎంజీఆర్ నటించిన సినిమాల ద్వారా ద్రావిడ సిద్ధాంతాలను ప్రజలకు చేరువ చేయడంలో కరుణానిధి కీలకమైన పాత్ర పోషించారు.

1957 సంవత్సరంలో మొదటి సారిగా కులిత్తరై నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన కరుణానిధి,1962లో తంజావూర్ నియోజవర్గం నుంచి గెలిచి రాష్ట్ర అసెంబ్లీలో డీఎంకే ఉప నేతగా పనిచేశారు. 1967లో డీఎంకే అధికారంలో వచ్చినప్పుడు అన్నాదురై మంత్రివర్గంలో కరుణానిధి ప్రజా పనుల శాఖ మంత్రిగా పనిచేశారు. 1969లో అన్నాదురై ఆకస్మిక మరణంతో తమిళనాడు ముఖ్యమంత్రిగా, డీఎంకే అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.అప్పుడు ఆయన వయస్సు కేవలం 45 సంవత్సరాలు. 1971లో చెన్నైలోని సైదాపేట,1977,1980లో అన్నానగర్,1989,1991లో చెన్నై హార్బర్,1996, 2001, 2006లో చెపాక్, 2011లో తిరువారూర్, 2016లో చెపాక్ నియోజకవర్గాల్లో ఎమ్యెల్యేగా  గెలుపొందారు.1957 నుంచి 2016 వరకు ఓటమే లేకుండా తమిళనాడు అసెంబ్లీకి 13 సార్లు ఎన్నికయ్యారు. భారతదేశ చరిత్రలో అన్ని సార్లు ఎన్నికైన ఏకైక నాయకుడిగా కరుణ చరిత్ర సృష్టించారు.  
   

1969లో కరుణానిధి ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత నుంచి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి, తమిళనాడు ప్రజల్లో తిరుగులేని ప్రజా నేతగా ఎదిగారు. 1971లో డీఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత కరుణానిధి  రెండో సారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అయితే, పార్టీలో  ఎంజీఆర్ ను అడుగడుగునా అవమానాలకు గురిచేయడంతో ఆత్మభిమానం గల ఎంజీఆర్ పార్టీకి రాజీనామా చేసి తన రాజకీయ గురువైన అన్నాదురై పేరుమీద అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం(అన్నాడీఎంకే) పార్టీని 1972లో స్థాపించారు. కరుణానిధి అసమ్మతి నేతలు మొత్తం అన్నాడీఎంకేలో చేరారు.

కరుణానిధికి రాజకీయ గడ్డుకాలం ఎంజీఆర్ రూపంలో మొదలైంది. తమిళనాడులో అత్యధిక ప్రజాదరణ కలిగిన కథానాయకుడైన  ఎంజీఆర్ స్థాపించిన అన్నాడీఎంకేను ప్రజలు ఆదరించడమే కాకుండా 1977,1980,1985 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి పట్టం కట్టి వరుసగా ఎంజీఆర్ ను మూడు సార్లు సీఎం పీఠంలో కూర్చోబెట్టారు. 1987చివర్లో ఎంజీఆర్ మరణంతో కరుణానిధి రాజకీయంగా ఊపిరి పీల్చుకున్నారు. 1989ఎన్నికల్లో మూడోసారి ముఖ్యమంత్రిగా కరుణానిధి ఎన్నికయ్యారు. అయితే, శాసనసభ సమావేశంలో ప్రతిపక్ష నాయకురాలు జయలలితపై డీఎంకే ఎమ్యెల్యేలు భౌతిక దాడి చేయడంతో కరుణానిధి ప్రభ మహిళల్లో మసకబారింది.    

1991లో కరుణానిధి ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంతో వచ్చిన 1991 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే విజయం సాధించి జయలలిత సీఎం అయ్యారు. జయలలిత హయాంలో డీఎంకే పార్టీ నేతలపై జరిగిన అరెస్టులు, ఆదాయ పన్ను శాఖ దాడులు కరుణానిధిని వుక్కిరిబిక్కరి చేశాయి. 1996 వరకు కరుణానిధి రాజకీయ జీవితంలో చీకటి రోజులుగా మిగిలాయి. 1996లో నాలుగో సారి ముఖ్యమంత్రిగా ఎన్నికైన కరుణానిధి సైతం కక్షపూరిత రాజకీయాలకు పాల్పడ్డారు. 2001లో అధికారం కోల్పోయిన తర్వాత జయలలిత హయాంలో కరుణానిధిని అవమానకర రీతిలో అర్థరాత్రి అరెస్ట్ చేయించింది. 2006 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ఐదోసారి ముఖ్యమంత్రిగా కరుణానిధి ఎన్నికయ్యారు.

2006-11 వరకు సీఎంగా ఉన్నప్పటికి అనారోగ్యం వల్ల కుమారుడు స్థాలిన్ ప్రభుత్వ వ్యవహారాల్లో కీ రోల్ ప్లే చేస్తూ వచ్చారు. అయితే, అదే సమయంలో వరుస అవినీతి కుంభకోణాల వల్ల పార్టీ పట్ల ప్రజల్లో విముఖత ఏర్పడింది. కరుణానిధి కుటుంబ పాలన పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకున్న ప్రతిపక్షనేత జయలలిత 2011 అసెంబ్లీ ఎన్నికల్లో అవినీతి, కుటుంబ పాలన వంటి  విషయాలను పదేపదే ప్రస్తావిస్తూ డీఎంకే పార్టీ పట్ల ప్రజల్లో వ్యతిరేకతను పెంచారు. 2011 ఎన్నికల్లో డీఎంకే చరిత్రలో కనీవిని ఎరుగని  ఘోర పరాజయాన్ని చవిచూసింది.

2014 లోక్ సభ ఎన్నికల్లో కూడా ఒక్క సీటు గెలవలేక చతికిల పడింది. 2011లో ఎమ్యెల్యేగా ఎన్నికైనప్పటికి అసెంబ్లీకి రావడం బాగా తగ్గించేశారు. అయన స్థానంలో ఉపనేతగా ఉన్న స్థాలిన్ పార్టీ వ్యవహారాలతో పాటుగా, అసెంబ్లీలో పార్టీని నడిపించారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో సైతం డీఎంకే అధికారంలోకి రాకపోవడం అయన్ని తీవ్ర నిరాశకు గురిచేసింది. జయలలిత చేతిలో వరసగా రెండోసారి ఓటమి చెందడంతో కరుణానిధి మానసికంగా కుంగిపోయారు. దానికి తోడు అనారోగ్యం తీవ్రంగా ఇబ్బంది పెట్టడం కూడా ఆయన ఇంటికే పరిమితం అయ్యారు. ఆ అనారోగ్యం కారణంగానే 2018, ఆగస్టు 7వ తేదీన తన 94వ ఏట చెన్నైలో కన్నుమూశారు.

కరుణానిధి తమిళనాడు రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ జాతీయ స్థాయి రాజకీయాల్లో ముఖ్య భూమిక పోషించారు. 1977లో జనతా ప్రభుత్వం ఏర్పాటులో, 1989లో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటులో, 1996లో యునైటెడ్  ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటులో కీలకమైన పాత్ర పోషించారు. తమ రాజకీయ భావజాలానికి వ్యతిరేకమైన బిజెపితో సైతం చేతులు కలిపి 1999లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు కీలకంగా వ్యవహరించారు. ఆ తర్వాత 2004-14 వరకు యూపీఏ -1,2 ప్రభుత్వాల ఏర్పాటులో సైతం కీలకమైన పాత్ర పోషించారు. జాతీయ రాజకీయాల్లో తొలుత తన అల్లుడైన మురుసోలీ మారన్, ఆ తర్వాత కుమార్తె కనిమొళిల ద్వారా తమ మద్దతుతో ఎన్నికైన కేంద్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చి తమిళనాడు రాష్ట్ర ప్రయోజనాలను సాధించడంలో సఫలీకృతం అయ్యారు.

తమిళనాడు రాజకీయాల్లో కరుణానిధి ఒక ఉన్నత శిఖరమే కాదు... ఓ గొప్ప రచయిత కూడా. రాజకీయాల్లోకి రాకముందు తలైవా సినిమారంగంలో పనిచేశారు. అక్కడ ఎన్నోసినిమాలకు కథను అందించాడు. తమిళ సాహిత్యానికి కూడా కరుణానిధి యనలేని సేవలందించారు. కరుణ కలం నుంచి ఎన్నో కథలు, నవలలు, సినిమా కథలు, సంభాషణలు, నాటకాలు, పద్యాలు, పాటలు జాలువారాయి. ఇవన్నీ ఇప్పుడు కరుణానిధి జ్ఞాపకాలుగా మిగిలిపోనున్నాయి. తమిళ భాషపై అత్యున్నత పట్టున్న నేతగా కరుణానిధికి మంచి పేరుంది.

తమిళంలో కలైంజ్ఞర్ అంటే "వివిధ కళలపై పట్టున్న బహుముఖ మేధావి అని అర్థం. ఇది కరుణానిధికే తమిళ ప్రజలు పేటెంట్ హక్కులా ఎందుకు ఇచ్చారంటే.. తమిళ భాషలో ఆయన మేధావి, పదాలతో మాయచేయగల సత్తా ఉన్నవాడు. తమిళ సాహిత్యానికి కరుణానిధి అశేష సేవలందించారు. "కురులోవియం,తోల్కప్పియా పూంగా, పూంబుకర్‌తో పాటు ఎన్నో పద్యాలు, వ్యాసాలు, నవలలు రాశారు. ఇక పుస్తకాల విషయానికొస్తే సంగ తమిళ్, తిరుక్కురల్ ఉరై, పొన్నార్ శంకర్, రొమపూరి పాండియన్, తెన్‌పాండి సింగం, వెలికిలమై, నేన్‌జుక్కు నీది, ఇనియావై ఇరుబతు లాంటివి రాశారు. తను 100కు పైగా పద్యగద్య రూపంలో పుస్తకాలు రాశారు.

కరుణానిధి గొప్ప పరిపాలనా దక్షుడు. ఐదు సార్లు ముఖ్యమంత్రిగా తమిళనాడును పాలించిన  ఆయన పాలనలో అనేక సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. తమిళనాడు నాట విద్య, ఉద్యోగాల్లో 30 శాతం మహిళలకు రిజర్వేషన్, పేదరిక నిర్మూలన, తాగునీటి పథకాలు ప్రవేశపెట్టిన ఘనత కరుణకు మాత్రమే స్వంతమని డీఎంకే కార్యకర్తలు అంటారు. రుణమాఫీ, పౌష్టికాహార పథకం, చేనేతకు ఉచిత విద్యుత్ వంటి ఎన్నో పథకాలకు శ్రీకారం చుట్టారు.

కరుణానిధి వ్యకిగత జీవితానికి వస్తే, ఆయనకు ముగ్గురు భార్యలు. మొదటి భార్య పద్మావతి, రెండో భార్య దయాళు అమ్మాల్, చనిపోయే నాటికి మూడో భార్య రాజాత్తి అమ్మాల్‌తో నివసించేవారు.  కరుణ మొదటి భార్య పద్మావతి, తమ కొడుకైన ఎంకే ముత్తు చిన్నతనంలోనే యుక్తవయస్సులోనే కన్నుమూశారు. అలగిరి, స్టాలిన్, సెల్వీ, తమిళరుసు దయాళు అమ్మల్‌కు జన్మించారు. కుమార్తె కనిమొళి రాజాత్తి  అమ్మల్‌కు జన్మించారు. కరుణానిధి చిన్నకుమారుడైన స్టాలిన్ ప్రస్తుతం డీఎంకే పార్టీ అధ్యక్షుడిగా, తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు.  

కరుణ జీవితం ఎంజీఆర్, జయలలితల ప్రస్తావన లేకుండా ముగియదు. ఎంజీఆర్, కరుణలు ఇద్దరు అన్నాదురై అనుచరులుగా సినీ రంగంలో కొనసాగారు. అన్నా డీఎంకే పార్టీని స్థాపించిన సమయంలో కరుణ రాజకీయాలకు వెళ్లగా, ఎంజీఆర్ సినిమాల్లో సూపర్ స్టార్ అయ్యారు. 1967లో కాంగ్రెస్ పార్టీని ఓడించి డీఎంకే అధికారంలోకి రావడంలో కరుణ తెరవెనుక, ఎంజీఆర్ తెరమీద విస్తృతంగా విస్తృతంగా ప్రచారం చేశారు. అన్నా మరణం తర్వాత పార్టీ మొత్తం నెడుంజెళియన్, కరుణ వర్గాలుగా సమానంగా విడిపోగా, ఎంజీఆర్ మాత్రం తన  మిత్రుడైన కరుణ వైపు మొగ్గుచూపడంతో నెడుంజెళియన్ వర్గం సైతం కరుణకి మద్దతు  ఇచ్చింది. అలా కరుణానిధి ఎంజీఆర్ సహకారంతో సీఎం అయ్యారు. 1971 ఎన్నికల్లో సైతం కరుణానిధి నాయకత్వంలో డీఎంకే గెలుపు కోసం ఎంజీఆర్ కృషి చేశారు.

కరుణ రెండోసారి సీఎం అయ్యిన నాటి నుంచి ఎంజీఆర్ పాపులారిటీ మీద కన్నుకుట్టుంది. ఎంజీఆర్ స్థానాన్ని పార్టీలో తగ్గించేందుకు చర్యలు పూనుకోవడంతో, అందుకు నిరసనగా కరుణ నాయకత్వంపై ఎంజీఆర్ తిరుగుబాటు బావుట ఎగురవేయడం, పార్టీ నుంచి సస్పెండ్ కావడం వెంట వెంటనే జరిగిపోయాయి. డీఎంకే నుంచి బయటకు వచ్చిన కొద్దీ రోజులకే అఖిల భారత అన్నా డీఎంకే పార్టీని ఏర్పాటు చేశారు. ఎంజీఆర్ పాపులారిటీ సినిమాలకే పరిమితం అని కరుణ వేసిన తక్కువ అంచనా వేయడం రాజకీయంగా చేసిన అతిపెద్ద తప్పిదంగా సమకాలీన విశ్లేషకులు భావిస్తారు.

1977 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంజీఆర్ నాయకత్వంలో అన్నా డీఎంకే విజయం సాధించింది. ఎంజీఆర్ సీఎం అయ్యారు. సీఎం అయిన నాటి నుంచి పేదవాడి సంక్షేమమే పరమావధిగా ప్రభుత్వాన్ని నడిపిస్తూ 1977 నుంచి 1987 వరకు పదేళ్ల పాటు సీఎం అయ్యారు. ఈ క్రమంలోనే జరిగిన మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎంజీఆర్ చేతిలో కరుణ పరాజయం పాలయ్యారు. ఎంజీఆర్ మరణం తర్వాత అన్నా డీఎంకే లేకుండా చేయాలని చేసిన ప్రయత్నాలను జయలలిత అడ్డుకోవడంతో పాటుగా ఎంజీఆర్ రాజకీయ వైరాన్ని వారసత్వంగా అందుకుంది.

మూడు దశబ్దాల పాటు సాగిన ఆ వైరం జయలలితను రాజకీయంగా కబళించాలని చూసిన ప్రతిసారి కరుణ భంగపడ్డారు. జయ,కరుణలు 6 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పడగా, నాలుగు సార్లు జయ, రెండుసార్లు మాత్రమే కరుణానిధి విజయం సాధించారు. మొత్తం మీద ఎంజీఆర్, జయల చేతిలో కరుణ రాజకీయ పరాజితుగానే మిగిలారు. ఇంకో యాదృచ్చికమైన విషయం ఏంటంటే అన్నాదురై, ఎంజీఆర్ మరియు జయలలితాలు సిఎంలుగా మరణించగా, కరుణానిధి మాత్రం ప్రతిపక్షంలో ఉన్న సమయంలో మరణించారు.        

తమిళ రాజకీయాల్లో శక్తిమంతమైన నేతగా కరుణానిధికి సాటిలేరు. దాదాపు 7 దశాబ్దాల రాజకీయ జీవితంలో తాను నమ్మిన ద్రవిడ సిద్ధాంత భావజాలం పట్ల కరుణానిధి అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉండేవారు. ఆ భావజాలానికి ప్రతినిధిగా ఉన్న ఆయన్ని తమిళనాడు ప్రజలు తమ వాడిగా అక్కున చేర్చుకున్నారు. తమిళనాడు ప్రజల మద్దతు వల్లే జాతీయ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా నిలిచిపోయారు.  

  --డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com