పొలిటికల్ ట్రబుల్ షూటర్-హరీశ్ రావు

- June 03, 2025 , by Maagulf
పొలిటికల్ ట్రబుల్ షూటర్-హరీశ్ రావు

హరీశ్ రావు... తెలంగాణ రాజకీయాల్లో కీలకమైన పాత్రను పోషిస్తున్న ముఖ్యనేత. తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని నడిపించడానికి కేసీఆర్ అండగా నిలుస్తూ రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఉద్యమ సమయంలో టీఆర్‌ఎస్‌ (బిఆర్‌ఎస్‌)ను సంస్థాగతంగా బలోపేతానికి కృషి చేస్తూ వచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాధన సాకారం నెరవేరడంలో హరీశ్ పాత్ర కీలకం. ఎన్నికల్లో నిలబడిన ప్రతిసారీ ప్రత్యర్థులకు డిపాజిట్లు గల్లంతయ్యాయి. అసెంబ్లీలో గొంతెత్తినప్పు డల్లా ప్రతిపక్షాలకు మాటలు కరవయ్యాయి. తన్నీరు హరీశ్ రావు... కేసీఆర్ మేనల్లుడి ముద్రతో రాజకీయాల్లో అడుగులేసినా, 'హరీశన్న' గానే ప్రజలకు దగ్గరయ్యారు. చిన్నప్పుడు హరీశ్ కన్న కలలు నిజమయ్యుంటే, ఇప్పుడు ప్రజలకు ఓ మంచి నేత దూరమయ్యేవాడే. నేడు భారాస ముఖ్యనేత, ఎన్నికల వ్యూహకర్త హరీశ్ రావు జన్మదినం సందర్భంగా ప్రత్యేక కథనం,,.

హరీశన్న అలియాస్ తన్నీరు హరీశ్ రావు 1972, జూన్ 3న ఉమ్మడి మెదక్ జిల్లా సిద్ధిపేట తాలూకా చింతమడక గ్రామంలో అమ్మమ్మ గారింట జన్మించారు. స్వస్థలం మాత్రం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని తోటపల్లి గ్రామం. ఆయన తల్లిదండ్రులు తన్నీరు సత్య నారాయణరావు, లక్ష్మీబాయమ్మలు. బాల్యం, ప్రాథమిక విద్యాభ్యసం చింతమడకలోనే సాగింది. ఆ తర్వాత కరీంనగర్ పట్టణంలోని వాణి నికేతన్ స్కూల్లో 10వ తరగతి వరకు చదువుకున్నారు. ఆ తర్వాత హైదరాబాద్ నగరంలోని మాసబ్ ట్యాంక్ ప్రభుత్వ పాలిటెక్నీక్ కళాశాలలో పాలిటెక్నీక్ డిప్లొమా పూర్తి చేశారు. ఆ తర్వాత ఇంజనీరింగ్ చదవాలనుకున్నప్పటికి అది నెరవేరలేదు. అనంతర కాలంలో కాకతీయ ఓపెన్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేశారు.

హరీశ్ హైదరాబాద్లో చదువుకుంటున్న సమయంలో మేనమామ కేసీఆర్ తెదేపా ఎమ్యెల్యేగా ఉండేవారు. మేనమామతోనే కలిసి ఎమ్యెల్యే కాలనీలో ఉంటున్న సమయంలోనే రాజకీయాలను దగ్గరగా గమనించేవారు. మేనమామకు అనఫీషియల్ వ్యక్తిగత రాజకీయ కార్యదర్శిగా వ్యవహరిస్తూ, రాజకీయ ఓనమాలు నేర్చుకున్నారు. పాలిటెక్నీక్ పూర్తి చేసి కంప్యూటర్ కోర్సులు నేర్చుకొని అమెరికా వెళ్లాలనే కల ఉన్న సమయంలోనే రాజకీయాల పట్ల ఆసక్తి పెంచుకున్నారు. కేసీఆర్ చంద్రబాబు మంత్రివర్గంలో రవాణా శాఖ మంత్రిగా ఎన్నికైన తర్వాత  ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్ధిపేట నియోజకవర్గ వ్యవహారాలను చూసుకుంటూ వచ్చారు.

1999 ఎన్నికల నాటికి సిద్ధిపేటలో తన స్థానాన్ని పదిలం చేసుకుంటూ వచ్చారు. 1999 అసెంబ్లీ ఎన్నికల్లో సిద్ధిపేట నుంచి నిలబడ్డ కేసీఆర్ తరపున అన్నీతానై ప్రచారం చేసి ఆయన విజయంలో కీలకమైన పాత్ర పోషించారు. 2001లో కేసీఆర్ తెదేపాకు రాజీనామా చేసి మలిదశ తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టిన సమయంలో ఆయన వెంటే ఉన్నారు. తెలంగాణ సిద్ధాంత కర్త జయశంకర్ గారితో జరిపిన చర్చల్లో హరీశ్ పాల్గొనేవారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సమితి(తెరాస) ఏర్పాటైన సమయంలో హరీశ్ అక్కడే ఉన్నారు.

తెరాస  ఏర్పడ్డ సమయంలో పార్టీ జెండా రూపకల్పన, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రచార వ్యవహారాలను పర్యవేక్షణ చేస్తున్న సమయంలోనే కేసీఆర్ వీరిని పార్టీ ప్రచార కార్యదర్శిగా నియమించారు. హరీశ్ తెరాసాను రాజకీయంగా అన్ని వర్గాలకు చేరువ చేసేందుకు కృషి చేశారు. 2004 అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ - తెరాస పొత్తు కోసం కేసీఆర్ ప్రతినిధిగా ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీతో చర్చించి పార్టీకి న్యాయమైన రీతిలో సీట్లను సాధించారు. ఎన్నికల్లో హరీశ్ పోటీ చేయకుండా పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం, కరీంనగర్ లోక్ సభ, సిద్ధిపేట అసెంబ్లీ నుంచి పోటీ చేసిన కేసీఆర్ ఎన్నికల వ్యవహారాలను చూశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ - తెరాస సంకీర్ణ కూటమి విజయం సాధించడం, కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం రావడంతో సిద్దపేట అసెంబ్లీకి రాజీనామా చేసి మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

సిద్ధిపేట నుంచి ఎన్నికవ్వడానికి ముందే వైఎస్సార్ మంత్రివర్గంలో యువజన సర్వీసులు, ప్రింటింగ్‌ స్టేషనరీ శాఖ మంత్రిగా హరీశ్ రావు  బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత వచ్చిన సిద్ధిపేట బై ఎలక్షన్స్‌లో ఎమ్యెల్యేగా ఎన్నికయ్యారు. తెలంగాణపై కాంగ్రెస్ నాన్చుడి ధోరణకి నిరసనగా 2006లో కేసీఆర్ తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయగా, రాష్ట్రంలో మంత్రులుగా ఉన్న ఈటెల రాజేందర్, హరీశ్ రావు మరియు లక్ష్మీ కాంతారావులు తమ మంత్రిపదవులకు, ఎమ్యెల్యే పదవులకు రాజీనామా చేశారు. 2006లో వచ్చిన బై ఎలక్షన్స్‌లో తనతో పాటు రాజీనామా చేసిన తెరాస ఎమ్యెల్యేలను గెలించే బాధ్యతను భుజాన వేసుకొని గెలిపించుకున్నారు. 2006 నుంచి అసెంబ్లీలో తెరాస శాససభాపక్షనేతగా వ్యవహరించారు. 2009లో మరోసారి సిద్ధిపేట నుంచి ఎన్నికయ్యారు.

2009 చివర్లో తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ ఉధృతంగా నిర్వహించడంతో హరీశ్ పార్టీ బాధ్యతలు చూసుకుంటూ తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమాన్ని విస్తరించారు. కేసీఆర్ చేపట్టిన ప్రత్యేక రాష్ట్ర సాధనలో యువతను, మేధావులను  భాగం చేయడానికి హరీశ్ చేసిన కృషి చాలా కీలకమైనది. తెలంగాణ ఉద్యమానికి సంఘీభావంగా 2010లో మళ్ళీ తెరాస ఎమ్యెల్యేలు రాజీనామా చేయగా, ఆ ఎన్నికల్లో మళ్ళీ వారందరిని గెలిపించుకున్నారు. 2011 నుంచి అసెంబ్లీ వేదికగా హరీశ్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడారు. తన సహచర సభ్యుడైన రాజేందర్ సైతం వీరికి అండగా బలంగా గళాన్ని విప్పేవారు. 2012-14 మధ్యలో తెలంగాణ ఉద్యమంలో సకల జనులు సమైక్యంగా ఉద్యమించడానికి తెరాసను వేదికగా నిర్మాణం చేయడంలో హరీశ్ పాత్ర కీలకం.

2014లో తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత జరిగిన ఎన్నికలో తెరాస పార్టీ విజయానికి కేసీఆర్, హరీశ్ రావు, ఈటెల రాజేందర్‌లు ఎంతో కృషి చేశారు. తెరాస ప్రభుత్వంలో నీటిపారుదల, శాసనసభ వ్యవహారాలు,మార్కెటింగ్, మైనింగ్ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన హరీశ్ పార్టీలో, ప్రభుత్వంలో నంబర్ టూగా రాణించారు. 2014-18 వరకు తెలంగాణాలో కొత్త ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, కాలువల నిర్మాణానికి పూనుకున్నారు. ఒకవైపు అసెంబ్లీ వ్యవహారాలను సజావుగా నడిపించడానికి ప్రతిపక్షాలతో సమన్వయం చేసుకుంటూ వచ్చారు. అయితే, ఇదే సమయంలో కేసీఆర్ కుమారుడు ఐటీ మినిష్టర్ కేటీఆర్ రాజకీయంగా ఎదగడం, హరీశ్ పట్ల అసంతృప్తి ఉన్న వారందరూ కేటీఆర్ వైపు వెళ్లడం వంటివి మొదటిసారిగా కేసీఆర్ తర్వాత పార్టీ, ప్రభుత్వ పగ్గాలు ఎవరు చేపట్టబోతున్నారు అనే చర్చ మొదలైంది.

2018లో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లగా ఆ ఎన్నికల ప్రచార బాధ్యతల్లో కేటీఆర్ ఇన్వాల్వ్ అవ్వడం, హరిశ్ రావుకు ప్రాధాన్యత తగ్గించడం వంటివి ఆయనకు, అనుచరులకు మింగుడు పడలేదు. కుమారుడు, అల్లుడు మధ్య జరిగిన కోల్డ్ వార్ వల్ల పార్టీకి ఎన్నికల్లో  నష్టం వాటిల్ల బోతుందని గ్రహించిన కేసీఆర్ తనే స్వయంగా ఒంటిచేత్తో ప్రచారం నిర్వహించి పార్టీని రెండో పర్యాయం అధికారంలోకి తీసుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన ఇద్దరి మధ్య పోటీ ఉండటంతో ఎవరిని మంత్రివర్గంలో చేర్చుకోకుండా పార్టీ వ్యవహారాలకే పరిమితం చేశారు. పార్టీలో కూడా కేటీఆర్ వర్గానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల హరీశ్ వర్గం చాలా ఇబ్బందిగా గడిపేది.

కేసీఆర్ సైతం తన కుమారుడికి పోటీగా ఉన్న బలమైన నేతలను అణిచివేయడానికి సిద్ధం అవ్వడం ఆ పార్టీ మద్దతుదారులను బాగా ఆవేదనకు గురిచేసింది. ఎవరు ఏమనుకున్నా కేసీఆర్ మాత్రం ఎటువంటి తప్పులు లేకుండానే ఈటెల రాజేందర్‌ను పార్టీ నుంచి బహిష్కరించారు. హరీశ్ రావుకు అత్యంత సన్నిహితుడైన ఈటెలను పంపించిన విధంగానే, ఆయన్ని పంపిస్తారని కేటీఆర్ వర్గం ప్రచారం చేయడం పార్టీలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

అయితే, హరీశ్ బలం తెలిసిన కేసీఆర్ 2019లో ఆర్థిక మంత్రిగా తన మంత్రివర్గంలోకి తీసుకోని పరిస్థితిని చల్లబరిచే ప్రయత్నాలు చేసినప్పటికి కేటీఆర్ కూడా మంత్రివర్గంలోకి రావడంతో కొద్దీ కాలం పాటు సర్దుమణిగింది. 2019-23 వరకు హరీశ్ ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఈ సమయంలోనే కేటీఆర్ ప్రభుత్వం, పార్టీలో నంబర్ టూగా అవతరించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో హరీశ్ రావును ఎన్నికల బాధ్యతల నుంచి పక్కన పెట్టి పెట్టినట్లు ఉంచి, కేటీఆర్‌కు పూర్తి బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఒకప్పుడు పార్టీకి ట్రబుల్ షూటర్‌గా, ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన హరీశ్‌ తన సొంతింట్లోనే ఒంటరి అయిపోయారు. ఎన్నికల్లో హరీశ్ పాత్ర లేకపోవడం, పార్టీ అభ్యర్థులకు అందాల్సిన సహాయ సహకారాలు అందకపోవడం వల్లే పార్టీ ఓటమి చెందిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు.

ఎన్నికల్లో ఓటమి పాలైన నాటి నుంచి పార్టీలో నాయకత్వ సంక్షోభం బాగా పెరిగింది. హరీశ్ రాజకీయంగా సైలెంట్ అవ్వడం, కేటీఆర్ అండ్ కో చేస్తున్న తప్పులు వల్ల ప్రజల్లో నమ్మకాన్ని క్రమక్రమంగా కోల్పోతున్నారు. కేసీఆర్ సైతం అనారోగ్యం కారణంగా పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం కూడా పార్టీ శ్రేణులు ఢీలా పడిపోయారు. అందుకు ఫలితమే 2024 లోక్‌సభ ఎన్నికలో ఒక్క సీటు సాధించలేక పోవడం జరిగింది. ఇలాగే కొనసాగితే పార్టీ తెలంగాణ రాజకీయాల్లో కనుమరుగయ్యే పరిస్థితులు దాపురిస్తాయని వార్తలు వస్తున్న తరుణంలో తనకు జరిగిన అవమానాలను పట్టించుకోకుండా పార్టీని మళ్ళీ బలోపేతం చేసేందుకు హరీశ్ రావు స్వచ్ఛందంగా కృషి చేస్తున్నారు. 

--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com