ప్రపంచ సైకిల్ దినోత్సవం...!
- June 03, 2025
ఇటీవలి కాలంలో బైక్‌లు ఎక్కువై సైకిళ్ల వైపు ఎవరూ చూడడం లేదు. సైకిల్ అంటే పిల్లలు నడపాలని భావిస్తారు.ఈరోజు ప్రపంచ సైకిల్ దినోత్సవం. ఐక్యరాజ్యసమితి ప్రతి సంవత్సరం జూన్ 3వ తేదీన సైకిల్ దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించింది. ఈ రోజు సైకిల్ తొక్కడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి అవగాహన కల్పించడానికి జరుపుకుంటారు. నేడు ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్బంగా ప్రత్యేక కథనం...
చిన్నప్పుడు పడుతూ, లేస్తూ నేర్చుకున్న సైకిల్ ఎవరికి మాత్రం గుర్తుండదు. రెండు కాళ్లూ నేల విడిచి, పెడల్స్ మీద పెట్టి, కింద పడకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్లడం అనేది బాల్యంలో ప్రతిఒక్కరికీ మధురానుభూతి. పడినా.. దెబ్బలు తగిలినా లేచి, మళ్లీ సైకిల్ తొక్కడంలో నిమగమడం అనేది కొత్త విద్య ఏదో నేర్చుకుంటున్నామని పసిహృదయాలకు కుతూహలం. ఆధునికమైన బైకులు, కార్ల రాకతో సైకిళ్ల వాడకం పూర్తిగా తగ్గిపోయింది. ఈ సంవత్సరం సైకిల్ దినోత్సవం థీమ్ ”సైక్లింగ్ ద్వారా ఆరోగ్యం, సమానత్వం మరియు స్థిరత్వాన్ని ప్రోత్సహించడం”. పెట్రోల్ వాహనాల కన్నా సైకిల్ తొక్కడం వల్ల ఆరోగ్యప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని, స్త్రీ-పురుష తేడాలు లేకుండా అందరూ సమానంగా సైక్లింగ్‌లో భాగంగా కావాలని పిలుపునిచ్చింది. పర్యావరణహితంగా స్థిరమైన రవాణా వాహనం సైకిల్ అని నొక్కి చెబుతుంది.
ప్రస్తుతం పూర్ మ్యాన్స్ బైక్‌గా నిలిచిపోయింది. మనలో ఎవరైనా సైకిల్ తొక్కుతూ బయటకు వచ్చారంటే చూసినవాళ్లంతా ఎగతాళి చేస్తుంటారు. ఇదే వంకతో మనం సైకిల్ తొక్కడానికి నామోషీ అవుతుంటాం. ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా సైకిల్ తొక్కడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో చూద్దాం.
సైకిల్ తొక్కడం కేవలం ఒక వ్యాయామం కాదు. ఇది శరీరం, మనస్సు, మరియు పర్యావరణానికి ఒక సమగ్ర శ్రేయస్సును అందించే జీవనశైలి. రోజూ సైకిల్ తొక్కడం ద్వారా కలిగే ప్రయోజనాలు శారీరక ఆరోగ్యం నుండి మానసిక శాంతి వరకు, సామాజిక బాధ్యత నుండి ఆర్థిక ఆదా వరకు విస్తరిస్తాయి.ఇది శరీరంలోని అనేక కండరాలను సక్రియం చేస్తుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, రక్త ప్రసరణను పెంచుతుంది, మరియు ఊబకాయం, డయాబెటిస్, మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ఒక అధ్యయనం ప్రకారం, రోజూ కనీసం 30 నిమిషాల సైక్లింగ్ గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని 50% వరకు తగ్గిస్తుంది. అంతేకాక, సైకిల్ తొక్కడం కీళ్లపై ఒత్తిడిని తగ్గిస్తుంది, ఇది అన్ని వయసుల వారికి అనుకూలమైన వ్యాయామంగా చేస్తుంది. శరీరాన్ని ఫిట్‌గా ఉంచడంలో సైక్లింగ్ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. సైక్లింగ్ మీరు బరువు తగ్గడానికి, కండరాలను నిర్మించడానికి మరియు కొవ్వును కాల్చడానికి సహాయపడుతుంది. సైకిల్ తొక్కడం వల్ల కలిగే అనేక ఆరోగ్య ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం. వేగంగా వెళ్లకుండా గంటసేపు సైకిల్ తొక్కితే 300 కేలరీలు ఖర్చవుతాయని నిపుణులు చెబుతున్నారు.
మానసిక ఆరోగ్యాన్ని అందిస్తుంది. మనసుకు ఆహ్లాదాన్ని ఇచ్చే హార్మోన్లు ఎండార్ఫిన్‌లను ఉత్పత్తి చేయడంలో సైక్లింగ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎండార్ఫిన్లు మీకు మంచి అనుభూతిని కలిగిస్తాయి. దీని వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. సైకిల్ తొక్కేటప్పుడు మీ మనస్సు ఎల్లప్పుడూ మీ గమ్యస్థానంపైనే ఉంటుంది. కాబట్టి మీ దృష్టి పెరుగుతుంది. సైక్లింగ్ శరీర సమతుల్యతను పెంచడంలో, శరీరంతో సరైన సమన్వయానికి సహాయపడుతుంది. కాగా.. ఒకప్పుడు సైకిల్ ఉంటే సౌకారే అని చెప్పేవారు. అంతేకాదు కట్నంగా సైకిల్ ఇచ్చేవారట. కానీ ఇప్పుడు ఆ సైకిల్ ఆరోగ్యం కోసం వాడటం అలావటైంది.
పర్యావరణాన్ని కాపాడటానికి సైక్లింగ్ ఒక మంచి మార్గం. అందుకే సైక్లింగ్‌ను ప్రోత్సహించాలంటూ సభ్య దేశాలకు ఐక్యరాజ్య సమితి విజ్ఞప్తి చేస్తోంది. చాలా దేశాలు ఈ సూచనలు పాటిస్తున్నాయి. మన దేశంలో ఇప్పటికే అనేక నగరాల్లో ఈ తరహా సూచనలు పాటిస్తున్నారు. అయితే అన్ని రాష్ట్రాల్లోనూ రోడ్లపై సైక్లింగ్‌కు ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించాలి. తద్వారా సైకిళ్లను ప్రోత్సహించవచ్చు. ఉదాహరణకు కేరళలోని త్రివేండ్రం, బెంగళూరు, ముంబై, హైదరాబాద్‌లో సంజీవయ్య పార్కు, వరంగల్‌లో నిట్ వంటి కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక సైక్లింగ్ ట్రాక్స్ ఏర్పాటు చేశారు. ఇలాంటి ఏర్పాటు అన్ని నగరాల్లో, పట్టణాల్లో ఏర్పాటు చేయాలి. సైకిల్ యాత్రలను ప్రోత్సహించాలి.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- కల్తీ లిక్కర్ మాఫియా పై సీఎం చంద్రబాబు సీరియస్..
- రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి-2025 ప్రకటన..
- భారత్ లోనే తొలి డిజిటల్ ఎయిర్పోర్ట్ ప్రారంభం
- విదేశీ ఉద్యోగులకు హెచ్1బీ వీసా స్పాన్సర్ చేస్తాం: ఎన్విడియా CEO
- దుబాయ్‌లో తెలంగాణ వాసి మృతి
- పియూష్ గోయల్‌తో ఖతార్ కామర్స్ మినిస్టర్ భేటీ..!!
- ట్రంప్ గాజా శాంతి ప్రణాళిక..స్వాగతించిన సౌదీ క్యాబినెట్..!!
- Dh1కి 10 కిలోల అదనపు లగేజ్..ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్..!!
- ముబారక్ అల్-కబీర్ లో క్లీనప్ డ్రైవ్..!!
- బహ్రెయిన్-సౌదీ సంబంధాలు చారిత్రాత్మకం..!!