ప్రపంచ పర్యావరణ దినోత్సవం

- June 05, 2025 , by Maagulf
ప్రపంచ పర్యావరణ దినోత్సవం

పర్యావరణ దినోత్సవం అంటే ప్రకృతి పరిరక్షణ కోసం చేపట్టాల్సిన చర్యల గురించి చర్చించడానికి ఒక రోజును ప్రత్యేకంగా నిర్దేశించి ప్రపంచ దేశాలన్ని ఒక్క చోట చేరుతాయి. ఈ సందర్భంగా ప్రకృతికి హాని చేసే చర్యల గురించి, వాటి కారణంగా జరుగుతున్న నష్ట నివారణ చర్యలు గురించి చర్చలు జరుపుతారు. ప్రతి ఏడాది జూన్ 5వ తేదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటాం. మానవునికి ప్రకృతికి అవినాభావ సంబంధముంది. ఈ సందర్భంగా ప్రకృతికి మానవునికి గల సంబంధం, పర్యావరణ పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యల గురించి తెలుసుకుందాం.

ప్రకృతికి మానవుడికి అవినాభావ సంబంధముంది. అది ఎంత దగ్గర సంబంధమంటే మనిషి ప్రకృతిలో పుడతాడు. ప్రకృతిలో ఆడుతూ పాడుతూ పెరుగుతాడు. ప్రకృతిని ఉపయోగించుకుంటూ ఎదుగుతాడు. చివరకు తన స్వార్థం కోసం ప్రకృతిని నాశనం చేయడానికి కూడా సిద్ధపడతాడు. పర్యావరణం అనేది మన చుట్టూ ఉన్న సహజ వాతావరణం. ఇందులో గాలి, నీరు, భూమి, వృక్షజాతులు, జంతుజాలం, మానవులు భాగమై ఉన్నాయి. పర్యావరణం మన జీవనానికి ఆధారం. ప్రతి జీవికి అవసరమైన వనరులను అందిస్తుంది.

భూమిపై ఉన్న అన్ని ప్రాణులకు జీవనాధారం చెట్లే. చాలా సంవత్సరాల నుంచి చెట్లు గొడ్డలి వేటుకు, రంపపు కోతకు నేల కూలుతున్నాయి. అవసరానికి సరిపడా చెట్లను పెంచలేకపోతున్నాం. దాంతో పర్యావరణంలో అనేక మార్పులొచ్చాయి. ఆ మార్పులు ఇప్పుడు మనిషి మనుగడకే ముప్పు తీసుకొచ్చాయి.

ఈ వినాశానికి అడ్డుకట్ట వేయడానికే ప్రపంచ దేశాలు ఒక వేదిక మీదకు వచ్చి ఒక్కో సంవత్సరం ఒక్కో దేశంలో మానవ వినాశనానికి గురైన పర్యావరణాన్ని కాపాడడానికి చేపట్టాల్సిన చర్యల గురించి చర్చించాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ కోసం ప్రత్యేకించి ఒక రోజు ఏర్పాటు చేస్తే మంచిదన్న ఉద్దేశ్యంతో జూన్ 5వ తేదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకోవాలని ప్రపంచ దేశాలు నిర్ణయించాయి.

1972లో ఐక్యరాజ్య సమితి నిర్వహించిన పర్యావరణ పరిరక్షణ సదస్సు లో వాతావరణ మార్పులను గమనిస్తూ తగు చర్యలు చేపట్టాల్సిన అవసరముందని గుర్తించారు. స్వీడన్ వేదికగా జూన్ 5వ తేదీ ప్రపంచ పర్యావరణ దినంగా జరపాలని తొలిసారి ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. 1973 నుంచి జూన్‌ 5న ప్రతియేటా ప్రపంచ పర్యావరణ దినం ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. ఐరాస ఎన్విరాన్‌మెంట్‌ ప్రోగ్రాం ఏటా ఏదో ఒక అంశంతో పర్యావరణంపై ప్రజల్లో అవగాహన పెంచే ప్రయత్నాలు చేస్తూ వస్తోంది. ఈ ఏడాది కొరియాలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ సమావేశం జరుగనుంది.

ప్రతి సంవత్సరం జూన్ 5 రాగానే ప్రపంచం మొత్తం పర్యావరణం గురించి మాట్లాడుకుంటుంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం అనగానే ప్రకృతి ప్రేమికులకు మనసులో ఏదో తెలియని ఆనందం కలుగుతుంది. నిత్యం ప్రకృతితో మమేకమై ఉండే ప్రతి ఒక్కరికీ ఈ రోజు పండుగలానే ఉంటుంది. ఒక్కసారిగా బాల్య స్మృతులు గుర్తుకు వస్తాయి. చిన్నప్పుడు స్కూల్లో మొక్కలు నాటడం, ప్రతిరోజూ నాటిన మొక్కలకు నీళ్లు పోయడం, తిరిగి స్కూల్ విడిచి పెట్టి వెళ్లే సమయంలో మొక్కలను విడిచి పెట్టలేక బాధ పడటం ఇవన్నీ మర్చిపోలేని మధుర స్మృతులు. అలాంటి మంచి కార్యక్రమాల్లో పాల్గొని, ఓ మంచి పని చేసిన ఫీల్ పొందుతాం. ఆ ఫీల్ మనలో ఎప్పటికీ ఉంటుంది. అందుకే ఈ రోజు మొక్కలను నాటుదాం.. పర్యావరణాన్ని కాపాడుదాం అనే ప్రతిఙ్ఞ చేసి.. దానికి కట్టుబడి ఉందాం. .

ప్రతి సంవత్సరం ప్రపంచ పర్యావరణాన్ని ఒక ప్రత్యేక ఇతివృత్తంతో జరుపుకుంటారు. ఈసారి థీమ్ ప్లాస్టిక్ కాలుష్యాన్ని జయిద్దాం అని నిర్ణయించారు. ప్లాస్టిక్‌ వ్యర్థాలతో జీవరాశికి కలిగే హానిపై అవగాహన కల్పిస్తున్నారు. వెబ్‌సైట్‌లో ఇవ్వబడిన సమాచారం ప్రకారం, ప్లాస్టిక్ కాలుష్యం భూమిపై ప్రాణాంతక ప్రభావాలకు దారితీస్తుంది, వాతావరణ మార్పుల సంక్షోభం, ప్రకృతి, భూమి, జీవవైవిధ్యం కోల్పోవడం, కాలుష్యం, వ్యర్థాల సంక్షోభం వంటివి. ప్రపంచవ్యాప్తంగా, ప్రతి సంవత్సరం 11 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు జల పర్యావరణ వ్యవస్థల్లోకి ప్రవేశిస్తున్నాయని అంచనా వేశారు.

వ్యవసాయ ఉత్పత్తులలో ప్లాస్టిక్ వాడకం వల్ల మురుగునీరు, పల్లపు ప్రాంతాల నుంచి మైక్రోప్లాస్టిక్‌లు నేలలో పేరుకుపోతాయి. ప్లాస్టిక్ కాలుష్యం వార్షిక సామాజిక, పర్యావరణ వ్యయం US$300 బిలియన్ల నుంచి US$600 బిలియన్ల మధ్య ఉంటుంది. ఈ సంవత్సరం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని దేశాలు సముద్ర పర్యావరణంతో సహా ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయడానికి ప్రపంచ ఒప్పందాన్ని సాధించే దిశగా పురోగతి సాధిస్తున్న సమయంలో జరుపుకుంటున్నారు.

పర్యావరణ దినోత్సవం రోజున ప్రపంచ దేశాలన్నీ ఓ చోట సమావేశమై భూమికి కలుగుతున్న రకరకాల కాలుష్యాలను తగ్గించడానికి చేపట్టాల్సిన చర్యల గురించి చర్చలు జరిపి నష్ట నివారణకు చేయవలసిన కార్యక్రమాల పట్ల తీర్మానాలు చేస్తాయి. భూతాపాన్ని తగ్గించే అవగాహన కార్యక్రమాలు జరుపుతాయి. జూన్ 5 పర్యావరణ దినోత్సవం సందర్భంగా పాఠశాలల్లో విద్యార్థులకు ఈ రోజు యొక్క  ప్రాధాన్యాన్ని ఉపాధ్యాయులు వివరిస్తారు. విద్యార్ధులచేత మొక్కలు నటించడం, ప్లాస్టిక్ రహిత సమాజ ఆవశ్యకతను వివరించడం చేస్తారు. ప్రతి సంవత్సరం పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రపంచ దేశాలు సమావేశాలు చర్చలు జరిపి, తీర్మానాలు చేసి చేతులు దులుపుకుంటున్నాయి. ఆ తీర్మానాలు ఆచారంలో పెట్టడంలో అందరూ విఫలం అవుతున్నారు.

నానాటికి పెరుగుతున్న జనాభా కారణంగా పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా సిమెంట్ రోడ్లు, తారు రోడ్లతో మట్టి అన్నదే కనుమరుగై పోయింది. భూమిలోకి వర్షపు నీరు ఇంకే అవకాశమే లేకుండా పోయింది. పెరిగిన జనాభాకు అనుగుణంగా ఇళ్లు నిర్మించడం కోసం చెట్లన్నీ నరికేస్తున్నారు. చివరకు పంట పొలాలు కూడా ఇళ్ల స్థలాలుగా మారిపోతుంటే భూతాపం పెరగక ఏమవుతుంది? ఎండలు పెరిగిపోతున్నాయి, వేడి పెరుగుతోంది అంటున్నారే కానీ దానికి కారణం ఎవరు? మనం కాదా! పదిమంది నివసించే ప్రదేశంలో 100 మందికి పైగా ఉంటున్నారు. భూగర్భ జలాలన్నీ తోడేస్తున్నారు. అందుకే భూతాపం పెరిగిపోతోంది.

భూమికి అత్యంత హాని చేస్తుంది మానవుడే! విచక్షణా రహితంగా చెట్లను నరికేయడంతో వాతావరణం దెబ్బతిని అనేక అనర్థాలకు దారి తీస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో అడవులను పరిరక్షించడానికి కఠిన చట్టాలు చేసి అమలు చేయాలి. అడవులు తగ్గిపోవడంతో వాతావరణంలో వేడి పెరగడం, గాలిలో ఆక్సిజన్ తగ్గడం, అతివృష్టి, అనావృష్టి లాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రతిఒక్కరూ కొన్ని మొక్కలను నాటి, వాటిని సంరక్షించడం అనేది ఒక సామాజిక బాధ్యతగా భావించాలి. జీవరాశుల మనుగడ చెట్లపైన ఆధారపడి ఉంది అనే విషయాన్ని మర్చిపోకూడదు.

పంచ భూతాల్ని కాలుష్యమయం చేస్తే... ఆ మసి అంటుకునేది మనకే. నాశనం అయ్యేది మన జీవితాలే. ప్రళయ బాధితులం అయ్యేది మనమే. నిల్చున్న కొమ్మనే నరుక్కుంటున్నాం. ఇకనైనా ప్రకృతిని కాపాడే దిశగా అడుగులు వేయాలి. మన చుట్టుపక్కల వాతావరణాన్ని కాపాడుకోవాలని గుర్తుచేస్తోంది ప్రపంచ పర్యావరణ దినోత్సవం. మన భూమిని పచ్చగా, ఆరోగ్యంగా ఉంచుతామని ప్రమాణం చేద్దాం...ఆ దైవం ఈ భూమిని మనకు గిఫ్టుగా ఇచ్చింది. అడవులను కాపాడాల్సిన బాధ్యత మనపై ఉంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మన బాధ్యతల్ని నెరవేర్చుదాం.

--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com