గ్లామరస్ యాక్ట్రస్-రంభ

- June 05, 2025 , by Maagulf
గ్లామరస్ యాక్ట్రస్-రంభ

రంభ... వెండితెరపై అందం, అభినయం, తన గ్లామర్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన నటి. 90, 2000ల్లో తమిళం, తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ వంటి పలు భాషల్లో రంభ నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆమె తన ఎనర్జిటిక్ డాన్స్ మూమెంట్స్, ఆకట్టుకునే అభినయం, హాస్యానికి పెట్టింది పేరుగా నిలిచారు. ఈ రోజుల్లోనూ ఆమె పాత సినిమాలు టీవీల్లో ప్రసారమైనా అభిమానులు ఇప్పటికీ ఆసక్తిగా చూస్తుంటారు. నేడు సీనియర్ హీరోయిన్ రంభ జన్మదినం సందర్భంగా ప్రత్యేక కథనం...

రసికాగ్రేసరులకు కలల రాణిగా నిలిచిన రంభ అసలుపేరు యిడీ విజయలక్ష్మీ. 1976, జూన్ 5న విజయవాడలో జన్మించారు. చిన్నప్పుడే నటన పట్ల ఆసక్తిని పెంచుకొన్న స్కూల్లో చదివే రోజుల్లోనే నాటకాలు వేసేవారు. స్కూల్ ఫంక్షన్ లో వేసిన డ్రామాలో నటించిన రంభను చూసిన మలయాళీ దర్శకుడు హరిహరన్ తను తీయబోతున్న సర్గం చిత్రంలో అవకాశం ఇచ్చారు. అలా 15వ ఏట స్కూల్ చదువు పూర్తి కాకుండానే సినిమాల్లో నటించడం మొదలుపెట్టింది. 1992లో ఈవివి దర్శకత్వంలో వచ్చిన ‘ఆ ఒక్కటి అడక్కు’ ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. “మన ‘వేటగాడు’ శ్రీదేవి లేదూ… ముక్కు ఆపరేషన్ చేయించుకున్నాక మరీ నాజూగ్గా మారిందా… ఆమె కాసింత ఒళ్లు చేస్తే ఎట్టా ఉంటాదో, అట్టా ఉందీ పిల్ల” అన్నాడో ఆసామి రంభ నటించిన తొలి సినిమా ‘ఆ ఒక్కటి అడక్కు’ చూసి.

తెలుగులో టాప్ స్టార్స్ తో నటించి మురిపించిన రంభ తరువాత ఐటమ్స్ లోనూ వాటంగా నటించి హీటు పెంచింది. పవన్ కళ్యాణ్ తొలి సినిమా ‘అక్కడ అమ్మాయి – ఇక్కడ అబ్బాయి’లో “చలిగాలి ఝుమ్మంది…” అంటూ కుర్రకారును కిర్రెక్కించింది రంభ. చిరంజీవి ‘ఇద్దరు మిత్రులు’లో “హేయ్ రుక్కు రుక్కు…” పాటలో కిక్కు ఇచ్చింది రంభ అందం. మరోమారు చిరంజీవితోనే ‘మృగరాజు’లో “రామయ్య పాదాలెట్టి…” పాటలో రంభ చిందేసి కనువిందు చేసింది.

‘నాగ’లో “నాయుడోరి పిల్లా…” సాంగ్ లో జూ.యన్టీఆర్ తో కలసి రంభ చేసిన సందడిని ఎవరు మరువగలరు? ‘దేశముదురు’ అల్లు అర్జున్ ను చూసి “అట్టాంటోడే ఇట్టాంటోడే…” అంటూ కవ్వించింది. ఆపై మరోమారు జూనియర్ తోనే “నాచోరే నాచోరే…” అని ‘యమదొంగ’లో రంభ అందాలతో బంధాలు వేసింది. నటనతోనూ, నర్తనంలోనూ మెరుపులు మెరిపించిన రంభ ఉత్తరాదిన బెంగాలీ, భోజ్ పురిలోనూ నటించింది. బుల్లితెరపైనా కొన్ని షోస్ లో తళుక్కుమంది. 2010లో ఇంద్రకుమార్ ను పెళ్ళాడేసి, ముగ్గురు పిల్లల తల్లి అయిన రంభ మళ్ళీ తగిన పాత్ర లభిస్తే కెమెరా ముందుకు వస్తానంటోంది. మరి అదెప్పుడు జరుగుతుందో చూడాలి.

--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com