జనం మెచ్చిన ఉప'యోగి'...!

- June 05, 2025 , by Maagulf
జనం మెచ్చిన ఉప\'యోగి\'...!

యోగి ఆదిత్యనాథ్ పేరు తెలియని భారతీయుడు ఉండరు. యుక్త వయస్సులోనే ఐహిక సుఖాలను త్యజించి కాషాయాన్ని కట్టి గోరఖనాథుడి సన్నిధికి చేరారు. సాధువుగా మారినప్పటికి తన చుట్టూ జరుగుతున్న అక్రమాలను చూస్తూ ఊరుకోలేక రాజకీయాల్లోకి వచ్చారు. గోరఖపూర్ ప్రాంతంలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలను రూపుమాపారు. హిందూ సమాజాన్ని పట్టి పీడిస్తున్న రుగ్మతలపై పోరాతూ ఉన్న ఆయన్ని ఉత్తరప్రదేశ్ సీఎం చేసింది. సీఎం పీఠాన్ని ఎక్కిన నాటి నుంచి ప్రజలకు సుపరిపాలన అందిస్తూ ప్రజలకు ఆరాధ్యనీయుడిగా మారారు. నేడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జన్మదినం సందర్భంగా ప్రత్యేక కథనం...

యోగి ఆదిత్యనాథ్ అసలు పేరు అజయ్ సింగ్ బిష్ట్. 1972, జూన్ 5న ఇప్పటి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పౌరీ గర్వాల్ జిల్లా పాంచుర్‌ గ్రామంలో మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఆనంద్ సింగ్ బిష్ట్, సావిత్రి దేవి దంపతులకు జన్మించారు. కోటద్వార్ పట్టణంలో ఉన్న ప్రభుత్వ కళాశాలలో బీఎస్సి పూర్తి చేసి రిషికేష్ ప్రభుత్వ పీజీ కాలేజీలో ఎమ్యెస్సి మొదటి సంవత్సరం తర్వాత వదిలేశారు.

యోగి విద్యార్ధి దశలోనే ఆరెస్సెస్ సానుభూతిపరుడిగా ఉండేవారు. కాలేజీ రోజుల్లో సంఘ్ విద్యార్ధి విభాగమైన ఎబివిపిలో క్రియాశీలక సభ్యుడిగా  కొనసాగారు. అదే సమయంలో రామజన్మభూమి ఉద్యమంలో భాగంగా ప్రజలను సంఘటితం చేసేందుకు ఉత్తరాది రాష్ట్రాల్లో పర్యటిస్తున్న గోరఖపూర్ ఆలయ పీఠాధిపతి మహంత్ అవైద్యనాథ్ రిషికేష్ వచ్చిన సమయంలో వారిని మొదటిసారి యోగి కలుసుకోవడం జరిగింది. అప్పటి నుండి క్రమంగా గోరఖపూర్ వెళ్తూ ఆయన్ని కలవడం విధిగా పెట్టుకున్నారు. అలా, గోరఖపూర్ మఠం సంప్రదాయాల పట్ల అనురక్తి పెంచుకున్నారు. అవైధ్యనాథ్ సైతం తన తర్వాత మఠాన్ని నడిపించగల సమర్థత యువ అజయ్ లోనే ఉన్నాయని భావించారు.

అవైద్యనాథ్ అభ్యర్థన, సమాజ సేవకు తన జీవితాన్ని అంకితం చేయాలని భావించడం వల్ల 1993 చివర్లో ఇంట్లో ఎవరికి చెప్పకుండా గోరఖపూర్ చేరుకొని మఠంలో చేరారు. 1994లో గోరఖపూర్ మఠం యువ సన్యాసిగా మారిన ఆయన తన పేరును యోగి ఆదిత్యనాథుగా మార్చుకొని మఠం ఉత్తరాధికారిగా బాధ్యతలు చేపట్టారు. నాథ్ సంప్రదాయాన్ని ప్రవచించిన గోరఖనాథుడి కొలువైన గోరఖపూర్ ప్రాంత ప్రజానీకానికి మఠమే చెప్పే మాటలే వేదం. మహంత్ దిగ్విజయ్‌‌నాథ్ కాలం నాటి నుంచి హిందూ పరిరక్షణ బాధ్యతలను మఠం చేపట్టింది. అందులో భాగంగానే రామజన్మ భూమి ఉద్యమంలో దిగ్విజయ్‌నాథ్, అవైద్యనాథ్ లు క్రియాశీలకంగా పాల్గొన్నారు. అలాగే, రాజకీయాల్లో సైతం దేశానికి స్వాతంత్య్రం రాకముందు నుంచే ఈ మఠాధిపతులు క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు.  

దిగ్విజయ్ నాథ్ 1967లో గోరఖపూర్ నుంచి పార్లమెంటుకు ఎన్నిక్కవగా, అవైద్యనాథ్ 1970,1989,1991,1996లలో నాలుగుసార్లు గోరఖపూర్ ఎంపీగా, మణిరామ్ నుంచి ఎమ్యెల్యేగా ఎన్నికయ్యారు. అవైద్యనాథ్ హయంలోనే జనసంఘ్, హిందూ మహాసభలకు మద్దతుగా నిలిచారు. ఆ తర్వాత స్వతంత్రంగా రాజకీయాల్లో కొనసాగారు. 80వ దశకంలో భాజపా రామజన్మభూమి ఉద్యమానికి మద్దతుగా నిలవడంతో అవైద్యనాథ్ ఆ పార్టీలో చేరి 1989 ఎన్నికల్లో గోరఖపూర్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. అవైధ్యనాథ్ అనారోగ్యం వల్ల 1998 నుంచి యోగి ఆదిత్యనాథ్ ఎంపీగా ఎన్నికయ్యారు. 19998,19999,2004,2009,2014లలో వరసగా ఐదుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు.

యోగి రాజకీయాల్లో వచ్చే నాటికి గోరఖపూర్ మాఫియా కబంద హస్తాల్లో ఉండేది. ఎంపీగా ఆయన మాఫియాను ఎదుర్కోవడానికి సమాజ సేవను ఎంచుకున్నారు. గోరఖపూర్ మఠాధిపతులు ఎవరు తలపెట్టిన రీతిలో విద్య, వైద్య సదుపాయాలు మరియు ఉపాధి కల్పన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించారు. అంతేకాకుండా జనతా దర్బార్లు నిర్వహిస్తూ ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ వారికి అండగా నిలుస్తూ వచ్చారు. యోగి ప్రాబల్యం పెరిగే కొద్దీ మాఫియా క్రమంగా గోరఖపూర్ ప్రాంతంలో అంతర్దానం అవుతూ వచ్చింది.

ఇదే సమయంలో హిందూ వాహిని యువసేన సంస్థను స్థాపించి తూర్పు యూపీలో హిందువులపై అకృత్యాలు చేసే వారిపై దాడులు చేసి కఠినంగా శిక్షిస్తూ ఆ ప్రాంతానికి యోగిజీ కాస్త యోగి మహారాజ్ అయ్యారు. తన సంస్థ కార్యకలాపాల వల్ల భాజపాకు రాజకీయంగా ఇబ్బంది పడినప్పటికి, యోగి తన పంథాను మార్చుకోలేదు సరికదా, రాష్ట్రవ్యాప్తంగా సంస్థను విస్తరించారు. యువవాహిని తరపున అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టి గెలిపించారు. ఈ సంస్థ ద్వారా గోరఖపూర్ ప్రాంతంలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగారు.

2012లో యూపీ బాధ్యతలు చేపట్టిన అమిత్ షా, తూర్పు యూపీ ప్రాంతంలో పర్యటిస్తున్న సమయంలో యోగి తన యువ వాహిని సభ్యులను అంగరక్షకులుగా ఉంచారు. ఈ ఒక్క చర్యతో యోగి పట్ల షాకు సుముఖత మొదలైంది. పైగా 2014 సార్వత్రిక ఎన్నికల్లో తూర్పు యూపీ లేదా పూర్వాంచల్ ప్రచారాన్ని, అభ్యర్థుల ఎంపికలో యోగిని భాగస్వామ్యం చేశారు. భాజపాకు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆ ఎన్నికల్లో పూర్వాంచల్ మొత్తం పార్టీ అభ్యర్థులు గెలవడంలో యోగి కీలకమైన పాత్ర పోషించారు. యూపీ భాజపాను బలోపేతానికి షాకు అన్ని విధాలా సహకరించి 2017 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా గెలుపులో భాగం అయ్యారు. యూపీ సీఎంగా ఎవరు ఉండాలనే సందిగ్ద పరిస్థితి ఏర్పడినప్పుడు మోడీ - షా యోగివైపే మొగ్గు చూపారు.

2017-22 మధ్యలో యూపీ సీఎంగా యోగి తీసుకొచ్చిన మార్పులు, చేర్పులు వల్ల ఆ రాష్ట్ర ముఖచిత్రమే మారిపోయింది. అభివృద్ధి అనే పదానికి ఆమడ దూరంలో బ్రతుకుతున్న కొన్ని వేల గ్రామాలకు విద్యుత్, రోడ్లు మరియు నిరుపేదలకు పక్కా ఇళ్ళు, రేషన్ ఇలా అన్ని విధాలా వారు కోరుకున్న వాటికి మించి ఎక్కువ చేశారు. సంక్షేమాన్ని బ్యాలన్స్ చేస్తూనే రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిని పరుగులు పెట్టించారు. ఒకప్పుడు నొయిడాకే పరిమితమైన పరిశ్రమలను రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో పెట్టేందుకు ప్రభుత్వం తరపున అన్ని విధాలా సహాయ సహకారాలు అందించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను నెలకొల్పేందుకు దశాబ్దాలుగా ఉన్న యూపీ మాఫియా డాన్స్ మరియు నేరగాళ్ళను ఎన్‌కౌంటర్ లేదా అరెస్ట్ చేసి జీవిత ఖైదు పడేలా చేసి ప్రజల్లో మంచిపేరు తెచ్చుకున్నారు.

యోగి మొదటి టర్మ్‌లో జరిగిన సంస్కరణలు, శాంతిభద్రతల పరిరక్షణ వంటివి ప్రాతిపదికన తీసుకున్న యూపీ ప్రజలు 2022లో కూడా యోగి నాయకత్వంలోని భాజపాకు పట్టం కట్టారు. 2022 నుంచి రాష్ట్రంలో హిందువుల పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ద తీసుకున్న యోగి పాలనా వ్యవహారాల్లో కొంత డీవియేట్ అవ్వడం మూలాన ప్రజల్లో కొంత అసహనం ఏర్పడింది. దానికితోడు సీఎం సీటు మీద కన్నేసిన పార్టీలోని ఇతర సీనియర్ నాయకులు డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య నాయకత్వంలో తిరుగుబాటుతో కూడిన సహాయ నిరాకరణ చేయడం మొదలుపెట్టారు. అలాగే, దళితులపై హత్యాచారాలు పెరగడంతో వారు క్రమంగా పార్టీకి దూరం అయ్యారు. ఇలా పలు సంఘటనలు వల్ల 2024 లోక్ సభ ఎన్నికల్లో పార్టీ ఎంపీ స్థానాలు 66 నుంచి 36కి పడిపోయి,కేంద్రంలో మైనారిటీ ప్రభుత్వం ఏర్పడటానికి కారణమైంది.

యోగి తన గురువు అవైధ్యనాథ్ 2014లో మరణించిన తర్వాత గోరఖపూర్ మఠాధిపతిగా, గోరఖనాథ్ ఆలయ మహంతుగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఇప్పటి దాక నిష్ఠతో ఆ కార్యక్రమాలు నిర్వహించిన తర్వాతనే పాలనా వ్యవహారాలు మొదలుపెడతారు. 2027 ఎన్నికల్లో తిరిగి యూపీలో భాజపాను మూడోసారి గెలిపించడం ద్వారా నరేంద్రమోడీ తర్వాత భాజపాను నడిపించే బాధ్యతను చేపట్టాలని చూస్తున్నారని రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.  

--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి) 

 

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com