రాజకీయ ప్రభావశీలి-ఎస్.ఆర్.బొమ్మై
- June 06, 2025
భారతదేశ రాజకీయాల్లో ఎస్.ఆర్.బొమ్మై రాజకీయ ప్రస్థానం చాలా కీలకమైనది. స్వాతంత్య్ర పోరాటంలో, కర్ణాటక ఏకీకరణ ఉద్యమాల్లో పాల్గొన్నప్పటికి రాజకీయాలవైపు మర్లకుండా వకీలు అయ్యారు. రాయిస్టుగా మానవతావాదాన్ని నమ్మే బొమ్మై తన గురువైన నిజలింగప్ప మార్గదర్శనంలో రాజకీయాల్లోకి కాంగ్రెస్ వ్యతిరేక వాదిగా చివరిశ్వాస వరకు కొనసాగారు. రాష్ట్ర ప్రభుత్వాలను అకారణంగా కూల్చే ఆర్టికల్ 356 అధికరణ దుర్వినియోగాన్ని నిలువరించేందుకు ఆయన చేసిన కృషి మరువలేనిది. కర్ణాటక సీఎంగా, కేంద్ర మానవ వనురుల శాఖ మంత్రిగా అందించిన సేవలు ఎల్లప్పుడూ కొనియాడదగ్గవి. నేడు రాజకీయ దిగ్గజం ఎస్.ఆర్.బొమ్మై జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం..
ఎస్.ఆర్.బొమ్మైగా సుపరిచితులైన సోమప్ప రాయప్ప బొమ్మై 1924, జూన్ 6న ఒకప్పటి బొంబాయి ప్రావిన్సులో ఉన్న అవిభక్త ధార్వాడ్ జిల్లా శిగ్గాన్ తాలూకా కారదాగి గ్రామంలో సదర్ లింగాయత్ సముదాయానికి చెందిన వ్యవసాయ కుటుంబంలో రాయప్ప బొమ్మై దంపతులకు జన్మించారు. ధార్వాడ్ పట్టణంలో ఉన్న ప్రభుత్వ కళాశాలలో బీఏ పూర్తిచేసిన తర్వాత మైసూర్ యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పూర్తిచేశారు. దాదాపు రెండు దశబ్దాల పాటు న్యాయవాదిగా పనిచేశారు.
బొమ్మై విద్యార్ధి దశలోనే స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు. అదే సమయంలో మానవతావాది ఎం.ఎన్.రాయ్ స్థాపించిన రాడికల్ డెమొక్రటిక్ పార్టీలో చేరారు. 1940-48 వరకు ఆ పార్టీలో క్రియాశీలక సభ్యుడిగా పనిచేశారు. రాయ్ ఆ పార్టీని రద్దు చేసిన తర్వాత సోషలిస్టు పార్టీకి మద్దతుదారుగా ఉండేవారు. ప్రముఖ సోషలిస్టు నేత బాపు నాథ్ పాయ్‌తో సన్నిహితంగా ఉండేవారు. సోషలిస్టు నేత లోహియా నాయకత్వంలో గోవా విముక్తి పోరాటంలో పాల్గొన్నారు. ఆ తర్వాత బొంబాయి రాష్ట్రంలో ఉన్న కర్ణాటక ప్రాంతాలను మైసూర్ కలపాలని కోరుతూ జరిగిన ఏకీకరణ ఉద్యమంలో సైతం క్రియాశీలకంగా పాల్గొన్నారు.
ఒకవైపు న్యాయవాదిగా రాణిస్తూనే ధార్వాడ్ కేంద్రంగా జరిగిన ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటూ వచ్చారు. బొమ్మై ఆదరణ చూసిన నాటి కాంగ్రెస్ నేతలు తమ పార్టీలో చేరమని కోరినా నిర్ద్వందంగా తిరస్కరించారు. 1967 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కుంద్గోల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికయ్యారు. అప్పటి కర్ణాటక సీఎంగా నిజలింగప్ప బొమ్మైను బాగా అభిమానించేవారు. 1969లో కాంగ్రెస్ పార్టీ చీలిన సమయంలో నిజలింగప్ప అధ్యక్షుడిగా పాత కాంగ్రెస్ పార్టీ తరపున నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 1972 ఎన్నికల్లో ఆ పార్టీ తరపున పోటీ ఓటమి చెందారు. 1972లో కర్ణాటక శాసనమండలికి ఎన్నికైన 1972-78 వరకు మండలి సభ్యుడిగా కొనసాగారు. 1975లో ప్రధాని ఇందిరా విధించిన ఎమెర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడి జైలుకు వెళ్లారు.
1977లో జనతా పార్టీ ఏర్పడిన తర్వాత ఆ పార్టీలో చేరిన బొమ్మై 1977-79 వరకు అసెంబ్లీలో ప్రతిపక్షనేతగా కొనసాగారు. 1981 నుంచి 83 వరకు కర్ణాటక జనత పార్టీ శాఖ అధ్యక్షుడిగా కొనసాగారు. 1977-83 వరకు జనతాపార్టీని రాష్ట్రంలో బలోపేతం చేయడానికి రామకృష్ణ హెగ్డే, జె.హెచ్.పటేల్, వీరు, దేవెగౌడ చాలా కృషి చేశారు. ఈ నలుగురు నేతలు అప్పటి దేవరాజ్ ఆర్స్, గుండూరావు ప్రభుత్వాలపై రాజీలేని పోరాటాలు చేసి ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం జనతా పార్టీనే నమ్మకాన్ని కలిగించారు. అలాగే, అప్పటి జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడైన చంద్రశేఖర్ చేపట్టిన భారత్ పాదయాత్ర సమయంలో కర్ణాటకలో ఎక్కువగా పర్యటించి ప్రజల్లో జనతా పార్టీ పట్ల విశ్వాసాన్ని కలిగించారు. అవన్నీ తోడై 1983 అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటకలో జనతాపార్టీ అధికారంలోకి వచ్చింది. హుబ్లీ గ్రామీణం నుంచి మూడోసారి ఎమ్యెల్యేగా ఎన్నికైన బొమ్మై రామకృష్ణ హెగ్డే మంత్రివర్గంలో పరిశ్రమలు, వాణిజ్య మంత్రిగా పనిచేశారు.
1985లో వచ్చిన మధ్యంతర అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగోసారి ఎమ్యెల్యేగా ఎన్నికైన తర్వాత హెగ్డే మంత్రివర్గంలో రెవెన్యూ, ఫైనాన్స్, కార్మిక, ఇరిగేషన్ మరియు ప్రణాళిక శాఖల మంత్రిగా 1988 వరకు బొమ్మై పనిచేశారు. 1988లో టెలిఫోన్ టాంపరింగ్ కారణంగా తన సీఎం పదవికి రాజీనామా చేయడంతో బొమ్మై సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఇదే సమయంలో జనతాపార్టీ, లోకదళ్ పార్టీలు విలీనం అయ్యి జనతాదళ్ పార్టీగా మారిన సమయంలో విలీనం పట్ల వ్యతిరేకత కొంతమంది జనతా పార్టీలోని సభ్యులు ప్రభుత్వానికి తమ మద్దతు ఉప సంహరించుకుంటాం అని నేరుగా గవర్నర్ వెంకట సుబ్బయ్యకు లేఖ రాశారు. కాంగ్రెస్ వాది అయిన గవర్నర్ ప్రభుత్వానికి మద్దతు లేదని ఏకపక్షంగా తీర్మానించుకుని ఆర్టికల్ 365 అధికరణ కింద ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయడం జరిగింది.
గవర్నర్ సుబ్బయ్య సిఫారసును ప్రమాణికంగా తీసుకోని ప్రభుత్వాన్ని రద్దు చేయమని అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ కోరడంతో, అందుకు సమ్మతించిన అప్పటి రాష్ట్రపతి వెంకట్రామన్ కర్ణాటకలో రాష్ట్రపతి పాలన విధించారు. తన మెజారిటీని నిరూపించుకునేందుకు అవకాశం ఇవ్వకుండా రాష్ట్రపతి పాలన విధించడాన్ని నిరసిస్తూ బొమ్మై సుప్రీం కోర్టులో గవర్నర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ కేసు వేయగా, ఆ కేసును సుమోటోగా తీసుకున్న సుప్రీం కోర్టు రాజ్యాంగ నిపుణులు, శాసనసభ వ్యవహారాల నిపుణులతో చర్చింది 1994లో తీర్పును వెల్లడించారు. బలమైన కారణాలు లేకుండా తమకు వ్యతిరేకంగా ప్రభుత్వాలను పడగొట్టి చిటికి మాటికి రాష్ట్రపతి పాలనలు విధించడం ఆర్టికల్ 356 అధికారణాన్ని దుర్వినియోగం చేయడమేనని ఆ తీర్పు సారాంశం.
"ఎస్.ఆర్.బొమ్మై వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా" గా ఈ కేసు భారతదేశ రాజకీయాలను కీలకమైన మలుపు తిప్పింది. ఈ తీర్పు వచ్చిన తర్వాత ఆర్టికల్ 356 అధికరణ దుర్వినియోగం చాలా వరకు తగ్గింది. ఈ కేసు గెలిచినందుకు వ్యక్తిగతంగా బొమ్మై సంతోషంగా ఉన్నప్పటికి, రాజకీయంగా చాలా నష్టపోయారు. విపి సింగ్ దిగిపోయిన తర్వాత బొమ్మైని ప్రధాని చేయాలని జనతాదళ్ అగ్రనేతలు ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికి అవి ఫలించలేదు. సింగ్ తర్వాత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన చంద్రశేఖర్ నాయకత్వం వహించిన సమాజవాదీ జనతా పార్టీలో కొద్దీ కాలం గడిపిన బొమ్మై తిరిగి జనతాదళ్ పార్టీలో చేరారు. 1992లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1993-96 వరకు జనతాదళ్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. 1996లో ఏర్పడ్డ యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడక 1996-98 వరకు దేవెగౌడ, గుజ్రాల్ ప్రభుత్వాల్లో కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రిగా పనిచేశారు.
1997లో లాలూ ప్రసాద్ యాదవ్ జనతాదళ్ పార్టీని చీల్చడంతో కుదేలైన ఆ పార్టీ 1998 చివరి నాటికి జనతాదళ్(యునైటెడ్), జనతాదళ్(సెక్యులర్) పార్టీలుగా చీలాయి. బొమ్మై జనతాదళ్(యునైటెడ్)లోనే కొనసాగుతూ వచ్చారు. 2000లో ఆ పార్టీ నుంచి విడిపోయి అఖిల భారత ప్రగతిశీల జనతాదళ్ పార్టీని మాజీ సీఎం రామకృష్ణ హెగ్డేతో కలిసి ఏర్పాటు చేశారు. అయితే, కొద్దీ కాలంలోనే నితీశ్ కుమార్ నాయకత్వంలో ఉన్న సమతా పార్టీలో కలిపారు. సమతా పార్టీ కూడా 2005లో జనతాదళ్(యునైటెడ్)లో విలీనం చేయడం జరిగింది. జనతాదళ్ చీలికలు సమయంలోనే బొమ్మై క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకున్నారు.
బొమ్మై రాజకీయ జీవితంలో "ఎస్.ఆర్.బొమ్మై వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా" కేసు ఒక మైలురాయిగా నిలిచింది. ఈ కేసు ఇప్పటికి పలు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు మధ్య తలెత్తే వివాదాల పరిష్కారానికి మరియు వాటి అనుబంధ కేసులకు దిక్సూచిగా నిలుస్తుంది. జీవితాంతం కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాల్లోనే కొనసాగిన బొమ్మై కుమారుడు బసవరాజ్ బొమ్మై కూడా అదే పంథాలో సాగుతూ కర్ణాటక సీఎం అయ్యారు. దాదాపు మూడున్నర దశాబ్దాల పాటు రాజకీయాల్లో కొనసాగిన ఎస్.ఆర్.బొమ్మై 2007, అక్టోబర్ 10న తన 84వ ఏట అనారోగ్యంతో కన్నుమూశారు.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్‌టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్