గుంటూరు వెటరన్ పొలిటీషియన్-రాయపాటి
- June 07, 2025
తెలుగు నాట ఒకప్పుడు ఒక వెలుగు వెలిగి, తెరమరుగైన నాయకులు ఎందరో ఉన్నారు. అలాంటి కోవలోకే వస్తారు గుంటూరు జిల్లాకు చెందిన రాయపాటి సాంబశివరావు. కరుడుగట్టిన కాంగ్రెస్ కుటుంబానికి చెందిన ఆయన ఐదు పర్యాయాలు లోక్ సభకు, ఒక పర్యాయం రాజ్యసభకు ఎన్నికయ్యారు. అంతకంటే ముందు పొగాకు ఎగుమతి రంగంలో అగ్రశ్రేణి వ్యాపారవేత్తగా గుర్తింపు సాధించారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పోరాడారు. నేడు గుంటూరు వెటరన్ రాజకీయ నాయకుడు రాయపాటి సాంబశివరావు జన్మదినం సందర్భంగా ప్రత్యేక కథనం...
ఆరేస్సార్, రాయపాటిగా సుపరిచితులైన రాయపాటి సాంబశివరావు 1943, జూన్ 7న అవిభక్త గుంటూరు జిల్లా అమరావతి తాలూకా ఉంగుటూరు గ్రామంలో రాయపాటి రంగారావు, సీతారావమ్మ దంపతులకు జన్మించారు. అమరావతి, తాడికొండ, గుంటూరు మరియు హైదరాబాదులలో విద్యాభ్యాసాన్ని సాగించారు. హైదరాబాద్ న్యూ సైన్స్ కళాశాలలో బీఎస్సి పూర్తి చేసి వ్యాపార రంగంలోకి ప్రవేశించారు.
రాయపాటి పొగాకు బయ్యర్‌గా తన వ్యాపార ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఒక్కోమెట్టు ఎక్కుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖ పొగాకు ఎగుమతిదారుగా నిలిచారు. 90వ దశకం ఆరంభానికే తన ఆధ్వర్యంలో జయలక్ష్మి టుబాకో కంపెనీ టర్నోవర్ 100 కోట్ల వరకు తీసుకెళ్లారు. పొగాకు తర్వాత స్పిన్నింగ్ మిల్స్, కన్స్ట్రక్షన్, పవర్ ప్లాంట్స్, ఆటోమొబైల్ డీలర్షిప్ రంగాల్లోకి తమ వ్యాపారాలను విస్తరించారు. రాయపాటి రాజకీయాల్లోకి వెళ్లే నాటికి గుంటూరు జిల్లాలోనే అత్యధిక ట్యాక్స్ పెయిర్‌గా నిలిచారు. టొబాకో బోర్డు ఉపాధ్యక్షుడిగా వ్యాపారస్తుల కోటా నుంచి వరసగా రెండుసార్లు ఏకగ్రివంగా ఎన్నికయ్యారు.
రాయపాటి రాజకీయాల్లోకి రావడానికి ముఖ్యకారణం ఆయన మేనమామ విద్వాన్ గోగినేని కనకయ్య. గాంధేయవాదిగా ముద్రపడిన కనకయ్య గారు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం తన ఆస్తులను రాసిచ్చారు. తాడికొండ గ్రామ సర్పంచ్‌గా, సమితి అధ్యక్షుడిగా మరియు తాడికొండ కోపరేటివ్ రూరల్ బ్యాంక్ అధ్యక్షునిగా తాడికొండను బాగా అభివృద్ధి చేశారు. గుంటూరుకు దీటుగా తాడికొండలో హైస్కూల్ నుంచి డిగ్రీ కళాశాల వరకు స్థాపనలో కీలకంగా వ్యవహరించారు. పైగా నాగార్జున యూనివర్సిటీ, కోనేరు లక్ష్మయ్య ఇంజనీరింగ్ కాలేజీల స్థాపనలో సైతం కీలకమైన పాత్ర పోషించారు. రాష్ట్రంలో తోలి రెసిడెన్షియల్ ప్రభుత్వ జూనియర్ ఇంటర్ కాలేజీని తాడికొండలో స్థాపించడానికి వీరే కీలకం. విద్యాదాతగా వీరికి ప్రధాని ఇందిరాగాంధీ, రాష్ట్ర సిఎంలుగా పనిచేసిన సంజీవయ్య, సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, పివి, జలగం వెంగళరావు, చెన్నారెడ్డిలతో సన్నిహిత సంబంధాలు ఉండేవి.
మేనమామ స్పూర్తితో విద్యార్ధి దశలోనే కాంగ్రెస్ పార్టీకి దగ్గరైన రాయపాటి గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీలో పలు కీలకమైన పదవులు నిర్వహించారు. అంతేకాకుండా,ప్రముఖ కాంగ్రెస్ నేత ఆచార్య రంగా గుంటూరు ఎంపీగా పోటీ చేసిన సమయంలో అయన గెలుపు కోసం కృషి చేస్తూ వచ్చారు. మేనమామ ద్వారా ప్రధాని ఇందిరా గాంధీకి, ఆ తర్వాత రాజీవ్ గాంధీకి సన్నిహితుడైన సాంబశివరావు తన 39వ ఏట 1982లో రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. ఇదే సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కోశాధికారిగా పనిచేశారు. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి దొడ్డా బాలకోటి రెడ్డి, పెదకూరపాడు నుంచి కన్నా లక్ష్మీ నారాయణలు ఎమ్యెల్యేలుగా ఎన్నికవ్వడంలో కీలకమైన పాత్ర పోషించారు.
చెన్నారెడ్డి, జనార్దన రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డిలు సీఎంగా ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఫండ్స్ భారీగా ఇచ్చేవారు. 1991-94 వరకు ఆంధ్రప్రదేశ్ 20 సూత్రాల అమలు కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1995లో ఆచార్య రంగా ఆకస్మిక మరణం తర్వాత 1996 లోక్‌సభ ఎన్నికల్లో గుంటూరు నుంచి తొలిసారి ఎంపీగా పోటీ చేసి అప్పటి సిట్టింగ్ తెదేపా ఎంపీ లాల్ జాన్ బాషా మీద ఘనవిజయం సాధించారు. 1998లో వచ్చిన లోక్‌సభ ఎన్నికల్లో సైతం గుంటూరు నుంచి రెండోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే, 12 నెలలకే మళ్ళీ ఎన్నికలు రావడంతో 1999లో అదే స్థానం నుంచి పోటీ చేసి తెదేపా అభ్యర్థి ఎంపరాల వెంకటేశ్వరరావు చేతిలో ఓటమి పాలయ్యారు.
1999 నుంచి 2004 వరకు గుంటూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం మీద దృష్టిసారించి, అప్పటి విపక్షనేత వైయస్సార్ ఆమోదంతో 2004 అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్స్‌లో తనకు నచ్చిన వాళ్లనే నిలబెట్టి తాను మాత్రమే కాకుండా వాళ్ళని కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించుకున్నారు. మూడోసారి ఎంపీగా ఎన్నికైన నాటి రాయపాటికి ఢిల్లీలో పరపతి పెరిగిన మాట వాస్తవమే కానీ, మంత్రివర్గంలో చోటు మాత్రం దక్కలేదు. 2009 ఎన్నికల్లో నాలుగోసారి గుంటూరు నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. మాజీ కేంద్ర మంత్రి కొత్తా రఘురామయ్య తర్వాత అత్యధిక సార్లు ఎంపీగా ఎన్నికైన రికార్డును తన పేరిట నమోదు చేసుకున్నారు.
2009-14 వరకు సాంబశివరావు రాజకీయంగా అటు పార్టీలోనూ, జిల్లాలోను ఎదురీదారు. వైఎస్సార్ మరణం తర్వాత గుంటూరుకే చెందిన రోశయ్య సీఎంగా ఉన్న సమయంలో టీటీడీ ఛైర్మన్ పదవిని ఆశించినా భంగపాటు ఎదురైంది. అలాగే, తెలంగాణ ఉద్యమం పీక్ మూమెంట్లో ఉన్నప్పుడు సమైక్యాంధ్రకు మద్దతుగా రాయపాటి గట్టిగా నిలబడ్డారు. పార్టీ లైన్ అతిక్రమించి సమైక్యాంధ్రకు మద్దతుగా నిలిచినందుకు సోనియా గాంధీ దూరం పెడుతూ వచ్చారు. పైగా అదే సమయంలో మంత్రివర్గ విస్తరణ జరిగినప్పుడు తనకు క్యాబినెట్లో స్థానం కల్పించకపోవడం ఆయన్ని మనస్థాపానికి గురిచేసింది. తన అండతో ఎదిగిన కన్నా లక్ష్మీ నారాయణ సైతం రాజకీయంగా తమను జిల్లాలో లేకుండా చేయాలనే ప్రయత్నాలను హైకమాండ్ ఉపేక్షించడం వంటివి పార్టీకి దూరం జరగడానికి తోడ్పడ్డాయి.
2014 రాష్ట్ర విభజన జరిగిన సమయంలో దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాయపాటి చంద్రబాబు నాయుడు సమక్షంలో తెదేపాలో చేరారు. 2014 ఎన్నికల్లో తెదేపా అభ్యర్థిగా నరసరావుపేట నుంచి పోటీ చేసి ఐదోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. 2019లో అక్కడి నుంచే పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత అనారోగ్యం కారణంగా రాజకీయాలకు దూరం జరిగి విశ్రాంతి తీసుకుంటున్నారు.
గుంటూరు జిల్లా అభివృద్ధికి ఎంపీగా రాయపాటి ఎంతో కృషి చేశారు. కాంగ్రెస్ అగ్రనేతలతో ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా యూపీఏ - 1, 2 ప్రభుత్వ హయాంలో కొన్ని వందల కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చారు. రోడ్లు, పవర్ స్టేషన్స్ నిర్మాణం మరియు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ నిర్మాణం వంటి ఎన్నో ప్రజా ఉపయోగ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. ఎంపీ లాడ్స్ కింద జిల్లాలోని ప్రాథమిక స్కూల్స్ భవనాల మరమ్మత్తులు మరియు కల్వర్ట్స్ కట్టించారు. నడికుడి - శ్రీకాళహస్తి రైల్వే లైన్ నిర్మాణానికి కృషి చేశారు.
రాజకీయాలు, వ్యాపారాలతో పాటుగా సామాజిక సేవా కార్యక్రమాల్లో సైతం తనదైన ముద్రవేశారు. తన మేనమామ కనకయ్య గారి లాగే విద్యాభివృద్ధికి పాటుపడ్డారు. జెకెసి కళాశాల యాజమాన్యంతో కలిసి గుంటూరు జిల్లాలో ఇంజనీరింగ్, మెడికల్ మరియు ఫార్మసీ కాలేజీల ఏర్పాటులో కీలకమైన పాత్ర పోషించారు. ఇవే కాకుండా ఆంధ్ర సాంస్కృతిక సంఘం తరపున కళలను ప్రోత్సహించడానికి భారీగా నిధులు విరాళం ఇచ్చారు. ఇవే కాకుండా పేద విద్యార్థులకు ఉపకారవేతనాలు, తమ విద్యాసంస్థల్లో చదువుకునేందుకు అవకాశాలు కల్పించారు.
ఐదున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో స్వపక్ష, విపక్ష నేతలు సైతం జెంటిల్ మ్యాన్, అజాతశత్రువుగా రాయపాటిని వర్ణిస్తారు. తన దగ్గరకి వచ్చే వారికి కావాల్సిన సహాయాలు చేసిపెట్టడం తప్ప ఎదుటివారిని తొక్కేయాలనే కుచిత్రపు మనస్తత్వం లేని వ్యక్తి. రాజకీయాల నుంచి విరమించుకున్న తర్వాత తన సోదరుడి కుమార్తె శైలజ రాజకీయాల్లోకి వెళ్తానంటే ప్రోత్సహించారు. ప్రస్తుతం గుంటూరులోనే ఉంటూ సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు.
-- డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!