మాగంటి గోపినాథ్ పార్థివదేహానికి కేసీఆర్ నివాళి..

- June 08, 2025 , by Maagulf
మాగంటి గోపినాథ్ పార్థివదేహానికి కేసీఆర్ నివాళి..

హైదరాబాద్: తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, టాలీవుడ్ నిర్మాత మాగంటి గోపినాథ్ ఆదివారం ఉదయం 5.45 గంటలకు తుది శ్వాస విడిచారు. ఈ నెల 5న గుండెపోటు తో ఏఐజీ ఆస్పత్రి లో చేరిన ఆయన చికిత్స పొందుతూ క‌న్నుమూసారు. ఆరోగ్యం విష‌మించడంతో ఆయ‌న మృతి చెందినట్టు వైద్యులు అధికారికంగా ప్ర‌క‌టించారు.గోపీనాథ్‌ కు భార్య సునీత, కుమారుడు వాత్సల్యనాథ్, కుమార్తెలు అక్షర నాగ, దిశిర ఉన్నారు.కాగా,గంభీరమైన వ్యక్తిత్వంతో కనిపించే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కంటతడి పెట్టుకున్నారు. గులాబీ పార్టీకి చెందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, సహచర శాసనసభ్యుడు మాగంటి గోపినాథ్ అకాల మృతిపట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. మాగంటి పార్థివదేహానికి నివాళి అర్పించిన ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. మాగంటి గోపినాథ్ మృతివార్త తెలియగానే ఎర్రవల్లి ఫాంహౌస్ నుంచి మాదాపూర్‌లోని నివాసానికి చేరుకున్న కేసీఆర్(KCR) గోపినాథ్‌ను అలా చూసి ఏడుపు ఆపుకోలేకపోయారు. కన్నీరు పెట్టుకొని మాగంటి కుమారుడిని దగ్గరకు తీసుకొని ఓదార్చారు. కేసీఆర్ వెంట హరీష్ రావు, కేటీఆర్ సహా పలువురు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఉన్నారు.

రాజకీయ నాయకుడిగా
అంతకు ముందు మాగంటి గోపీనాథ్ మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ కేసీఆర్ సంతాపం ప్రకటించారు. మాగంటి గోపీనాథ్ మరణం పార్టీకి తీరని లోటని అన్నారు. ఆయన మరణానికి చింతిస్తూ తన సంతాపాన్ని ప్రకటించారు. ఎంతో కష్టపడి రాజకీయాల్లో అంచలంచెలుగా ఎదిగిన మాగంటి గోపీనాథ్ ఎంతో సౌమ్యుడుగా ప్రజానేతగా పేరు సంపాదించారని తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యే గా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ హైదరాబాద్ నగర సీనియర్ రాజకీయ నాయకుడిగా మాగంటి తనదైన స్థానాన్ని సంపాదించుకున్నారని కేసీఆర్ స్మరించుకున్నారు.

ప్రగాఢ సానుభూతి
తనను కాపాడేందుకు వైద్యులు చేసిన కృషి, పార్టీ తరఫున చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మాగంటి గోపీనాథ్, కుటుంబ సభ్యులు, మిత్రులు, అభిమానులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.కాగా,2014 నుంచి వరుసగా మూడుసార్లు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా విజయం సాధించించన గోపినాథ్ అకాల మరణం పట్ల నియోజకవర్గ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం రేవంత్, ఏపీ సీఎం చంద్రబాబు సహా పలువురు సహచర ఎమ్మెల్యేలు, మంత్రులు విచారం వ్యక్తం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com