వామపక్ష రాజకీయ భీష్ముడు ఇ.ఎం.ఎస్.నంబూద్రిపాద్

- June 13, 2025 , by Maagulf
వామపక్ష రాజకీయ భీష్ముడు ఇ.ఎం.ఎస్.నంబూద్రిపాద్

ప్రపంచంలోనే మొదటిసారిగా, కేరళలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన మార్క్సిస్టు ప్రభుత్వానికి నాయకత్వం వహించడం ద్వారా, భారతదేశపు మొట్టమొదటి కమ్యూనిస్టు ముఖ్యమంత్రిగా నంబూద్రిపాద్ చరిత్ర సృష్టించారు. ముఖ్యమంత్రిగా ఆయన చేసిన మొదటి ప్రకటన.. సోషలిజం తీసుకురావడానికి తన ప్రభుత్వం ప్రయత్నించగలదని స్పష్టం చేయడం కాదు. దానికి బదులు సామాన్య ప్రజానీకం ఎదుర్కొంటున్న కష్ట నష్టాలను తగ్గించడానికి తన ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమంలో కీలక పాత్ర పోషించడమే కాదు ఆయన భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) వ్యవస్థాపక నాయకుల్లో ఒకరు. నేడు వామపక్ష రాజకీయ భీష్ముడు ఇ.ఎం.ఎస్.నంబూద్రిపాద్ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం...

ఇ.ఎం.ఎస్‌గా ప్రసిద్ధులైన ఏలాంకుళం మనక్కళ్ శంకరన్ నంబూద్రిపాద్ 1909, జూన్ 13న సనాతన సంప్రదాయ భూస్వామ్య బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పురిగిన ఇ.ఎం.ఎస్. తన సొంత వర్గ తిరోగమన విధానాలపై పోరాడటం ద్వారా ప్రజాహిత జీవనంలోకి అడుగుపెట్టారు. బాల్యంలో ప్రాచీన పవిత్ర గ్రంథాలను అధ్యయనం చేశారు. యువకుడిగా ఉన్నప్పుడే ఆయన కులంపై సాంఘిక సంస్కరణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. 1931లో కాలేజీని వదిలి స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు. కేరళలో కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ స్థాపకుల్లో ఒకరుగా వున్నారు.

1934లో ఆయన కాంగ్రెస్ పార్టీ సోషలిస్టు పార్టీ అఖిల భారత ఉమ్మడి కార్యదర్శి అయ్యారు. ఇదే కాలంలో E.M.S. కాంగ్రెస్ పార్టీకి, కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా మార్క్సిజంతో పరిచయం చేశారు.1936లో కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థాపక బృందాన్ని ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల్లో ఆయన ఒకరు.నంబూద్రిపాద్ కేరళలో ఒక శక్తివంతమైన కమ్యూనిస్ట్ ఉద్యమం అభివృద్ధికి పునాదులు వేశారు. ఇందుకు ఆయన ఎంచుకున్న పోరాట మార్గాలు రెండు. ఒకటి సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటం.రెండోది భూస్వామ్య వ్యతిరేక పోరాటం. ఈ రెందు పోరాటాలకు ఆయన ప్రాతినిధ్యం వహించారు. కేరళను ఏకీకృత భాషా రాష్ట్రంగా కేరళ ఏర్పర్చడానికి దారి తీసిన ఐక్య కేరళ యొక్క ముఖ్య ప్రతిపాదకులలో ఆయన ఒకరు.

నంబూద్రిపాద్ మొట్టమొదట 1939లో మద్రాసు ప్రొవిన్షియల్ శాసనసభకు ఎన్నికయ్యారు. రెక్కలున్న కమ్యునిస్ట్ పార్టీని మరింత విస్తృత పరచడానికి ఆయన తన వాటగా వచ్చిన ఆస్తిని పార్టీకి విరాళంగా ఇచ్చాడు. అతను 1939-42 మరియు 1948-50 మధ్య కీలకమైన కాలంలో పార్టీ నిర్మాణానికి అజ్ఞాతంలోకి వెళ్ళారు. ఆయన 1941 లో భారత కమ్యూనిస్టు పార్టీ సెంట్రల్ కమిటీకి ఎన్నికయ్యారు. డిసెంబరు, 1950 లో సిపిఐ పొలిట్ బ్యూరో సభ్యుడిగా, సెక్రటేరియట్ సభ్యునిగా పనిచేశారు. 1957 లో కేరళ రాష్ట్రం ఏర్పడిన తరువాత జరిగిన మొదటి ఎన్నికలలో కమ్యూనిస్ట్ పార్టీ మెజారిటీ సాధించడంతో E.M.S. నంబూద్రిపాద్ భారతదేశంలో మొట్టమొదటి కమ్యూనిస్ట్ ముఖ్యమంత్రిగా రికార్డులకెక్కారు.

1957లో కేరళ సీఎంగా ఎన్నికైన తర్వాత సంపన్న భూస్వామ్య పెత్తందారీ విధానాన్ని అంతం చేయడంలో అగ్రభాగంలో నిలిచారు. అక్షరాస్యత, స్త్రీ పురుష వివక్ష లేకుండా చూడటం, ప్రజారోగ్యం, సమగ్ర భూ సంస్కరణలు ఆయన మొదటి ప్రభుత్వ ఘన విజయంగా చెప్పాలి. ఆ రోజుల్లోనే ఇ.ఎం.ఎస్. కేరళలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ప్రైవేట్ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించారు. ఇది సహించలేని నాటి కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం 1959లో ఆయన నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాన్ని అమానవీయంగా రద్దు చేసింది.


E.M.S. 1964 లో సిపిఐ (ఎం) ను స్థాపించిన తరువాత ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ నుండి అందులో చేరారు. 1964 లో జరిగిన అఖిల భారత మహాసభలో పార్టీలో కేంద్ర కమిటీ మరియు పార్టీ పొలిట్ బ్యూరోకు ఎన్నికయ్యారు. ఆయన మరణం వరకు ఈ పదవిలో కొనసాగారు. భూసంస్కరణల చట్టాన్ని అమలు చేయాలని, ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను నిరసిస్తూ భారీ పోరాటాన్ని నిర్వహించిన ఆయన తిరిగి 1967లో కేరళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1977 లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు) కేంద్ర కమిటీ జనరల్ సెక్రటరీగా నంబూద్రిపాద్ ఎన్నికయ్యారు. అన్ని వామపక్ష, ప్రజాస్వామ్య, లౌకిక శక్తులను సమీకరించడంలో ఆయన నాయకత్వం అమూల్యమైనది. ఇ.ఎం.ఎస్ 1978 నుంచి 1980ల చివరి వరకు ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించిన కాలంలో పార్టీ అనేక ఒత్తిడులను, సంక్షోభాలను ఎదుర్కొంది. 1980ల చివరిలో ఆయన విశ్రాంత జీవితం మొదలైంది.

అయితే, ఆయన ఖాళీగా ఉండకుండా కుల, మత, రాజకీయాలకు అతీతంగా ఎదగాల్సిందిగా తన రచనల ద్వారా కేరళీయులకు పిలుపునిచ్చారు. సమగ్ర వికేంద్రీకరణ కార్యక్రమమైన ప్రజా ప్రణాళికా విధానాన్ని రూపొందించడం ప్రారంభించారు. ఆయన రచనలు 150 సంపుటాలుగా వెలువడ్డాయి. భారతీయ కమ్యూనిస్టు విధానాల ఆచరణకు తోడ్పడిన నవీన ప్రయోగాలను సిద్ధాంతీకరించడానికి ఇ.ఎం.ఎస్. విముఖత చూపడం విమర్శలకు లోనైంది. సిద్ధాంతం కన్నా ఆచరణకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన నేతగా నిలిచారు.

E.M.S. ఒక తెలివైన మార్క్సిస్ట్ సిద్ధాంతకర్త. భారతీయ సమాజంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మార్క్సిజం - లెనినిజం అన్వయించడంతోపాటు భారతీయ విప్లవం యొక్క వ్యూహానికి అనుగుణంగా సాగించాల్సిన, సాగించిన కృషిని ఆయన రచించారు. భూమి సంబంధాలు, కేరళ,సమాజం మరియు రాజకీయాలు , మార్క్సిస్టు తత్వశాస్త్రం, సాహిత్యం మరియు చరిత్రలపై ఆయన వ్రాసిన రచనలతో ఆయన్ను దేశంలొనే గాక ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన కమ్యూనిస్ట్ ఆలోచనాపరులలో ఒకరిగా గుర్తించబడ్డాయి.

సాంప్రదాయ భూస్వామి కుటుంబం నుండి వచ్చి కమ్యూనిస్ట్ నాయకుడిగా మారిన  నంబూద్రిపాద్ ఒక అరుదైన ఉదాహరణ, భూస్వామి కుటుంబంలో పుట్టినా శ్రామిక వర్గ లక్ష్యాలకు అంకితమై శ్రామిక విప్లవ ఉద్యమంలో అగ్ర నాయకుడిగా ఎదిగారు. ఆయన నిరాడంబర జీవితం ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. ఆయన మరణించేదాక పార్టీకి ఏరోజుకారోజు మార్గనిర్దేశం చేస్తూనే ఉన్నారు. నంబూద్రిపాద్  మార్చి 19, 1998న తన 89 సంవత్సరాల వయస్సులో మరణించారు. 

--డి.వి అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com