హైదరాబాద్ లో రెచ్చిపోతున్న రాజస్థాన్ దొంగలు
- June 13, 2025
హైదరాబాద్: ప్రస్తుతం హైదరాబాద్ మహానగరం ఆన్‌లైన్ మోసాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. ఆధునిక టెక్నాలజీని ఆయుధంగా మార్చుకుని, అమాయకులను ఉరిలో పడేస్తున్న మోసగాళ్లు కొత్త కొత్త పద్ధతులు ఆవిష్కరిస్తున్నారు. ఆధార్ దుర్వినియోగం పేరుతో కోట్లాది రూపాయలను కొల్లగొడుతున్నారు.ఇటీవలే విశ్రాంత శాస్త్రవేత్తను రూ.1.34 కోట్లు మోసగాళ్లు దోచుకున్న సంగతి గుర్తు చేసుకోవచ్చు.
విదేశాలకు అక్రమంగా తరలిస్తున్నారన్న కారణంతో, డిజిటల్ అరెస్ట్ పేరుతో ఇంట్లోనే బంధించి మోసాలకు పాల్పడుతున్నారు. వాట్సాప్ కాల్స్ ద్వారా సుప్రీంకోర్టు న్యాయమూర్తి విచారణ చేస్తున్నట్లు చూపించి మానసికంగా బాధిస్తున్నారు.
హైదరాబాద్ నగరంలోనే కాదు దేశవ్యాప్తంగా ఇలాంటి ముఠాలు ఉన్నాయి. ఈ ముఠాలు ఎక్కువగా రాజస్థాన్‌లోని భరత్‌పూర్, డీగ్, నూహ్, మెహత్ జిల్లాల్లో పలు గ్రామాలు సైబర్ మాయగాళ్లకు అడ్డాగా మారాయి. పాఠశాల స్థాయిలోనే చదువు ఆపేసిన, పదో తరగతి తప్పిన వారంతా మోసాలను ఉపాధిగా ఎంచుకుంటున్నారు. వారు సాంకేతిక పరిజ్ఞానం, మొబైల్ యాప్‌ల వినియోగం, ఇంటర్నెట్ కాల్స్, కృత్రిమ మేథ సహాయంతో మార్ఫింగ్ వీడియోలు, వాయిస్ కాల్స్‌తో ఏ విధంగా మోసం చేయాలనే అంశాలపై తర్ఫీదు పొందుతారు.
జాబితా ఆధారంగా రోజుకు 20 నుంచి 30 మందికి వాట్సాప్ వీడియో కాల్స్ చేసి అటువైపు నుంచి స్పందన కోసం ఎదురు చూస్తారు. ఆయా శాఖలు, అధికారుల పేర్లు ప్రయోగించి భయపెడతారు. తమ ఖాతాల్లో జమ చేసిన నగదు లావాదేవీలను పరిశీలించి తిరిగి ఇస్తామంటూ చెబుతుండటంతో వారి వలలో చిక్కి ఎంతోమంది మోసపోతున్నారు. వివిధ వెబ్సైట్లల నుంచి ఏజెంట్ల సాయంతో వివిధ వర్గాలకు చెందిన వారి డేటా కొనుగోలు చేస్తున్నారు.
ఎక్కువగా మోసపోతున్నవారు ఎవరంటే?
ఇలా రూ.కోట్లు నష్టపోయిన వారిలో న్యాయమూర్తులు, వైద్య నిపుణులు, ప్రజా ప్రతినిధులు, పోలీసులు, ఉన్నత విద్యావంతులే ఎక్కువగా ఉంటున్నారు.
సైబర్ క్రైమ్ విభాగం సూచనలు
హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్ ప్రసాదరావు మాట్లాడుతూ–గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌కు స్పందించొద్దని నగర సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్ ప్రసాదరావు సూచించారు. అటునుంచి రికార్డు చేసిన వీడియో కాల్‌ను మార్ఫింగ్ చేసి బెదిరించి డబ్బులు గుంజుతారని గ్రహించాలన్నారు. ప్లస్(+)తో మొదలయ్యే కాల్ వస్తే పట్టించుకోవద్దని తెలిపారు. అనుమానాస్పదంగా అనిపించినా, మోసపోయినట్లు గ్రహించినా 1930కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
మిత్రుడి వాయిస్‌ను ఉపయోగించి మోసం
ఇటీవల ఒక కానిస్టేబుల్‌కి వచ్చిన ఫోన్ కాల్‌లో మిత్రుడి వాయిస్‌తో మాట్లాడించారు. లండన్ నుంచి హైదరాబాద్ వస్తుండగా దిల్లీ ఎయిర్‌పోర్టులో ఆదాయ పన్ను శాఖ అధికారులకు క్లియరెన్స్, ట్యాక్స్ చెల్లించాలంటూ రూ.2.05 లక్షలు వారి ఖాతాల్లోకి మళ్లించుకున్నారు.
జాగ్రత్తలు తప్పనిసరి
ఈ మోసాల బారిన పడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటించాలి. ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేస్తే వెంటనే గమనించి స్పందించకూడదు.
తాజా వార్తలు
- తెలంగాణ లో మహిళా పెట్రోల్ బంకులు
- ఇద్దరు ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ సెల్స్ అరెస్ట్: ఖతార్
- 166 మిస్సైల్స్, డ్రోన్లను ధ్వంసం చేశాం: బహ్రెయిన్
- కువైట్ పై దాడులకు తెగబడ్డ ఇరాన్..!!
- కువైట్‌లో సైనికుల మృతి పట్ల ఒమన్ సంతాపం..!!
- దౌత్యాధికారులకు ఇఫ్తార్ విందు ఇచ్చిన సౌదీ అరేబియా..!!
- డిస్టెన్స్ లెర్నింగ్ మార్చి 6 వరకు పొడిగించిన యూఏఈ..!!
- 1,000 కి పైగా ఇరానియన్ దాడులు: యూఏఈ
- అమెరికా కాన్సులేట్ పై డ్రోన్ అటాక్ పై దుబాయ్ క్లారిటీ..!!
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లు.. కేంద్ర మంత్రి సమీక్ష









