దానగుణశీలి-నవభారత్ పున్నయ్య

- June 21, 2025 , by Maagulf
దానగుణశీలి-నవభారత్ పున్నయ్య

తెలుగునాట నవభారత్ వ్యాపార సంస్థలు గురించి తెలియవారు ఉండరు.వ్యవసాయ ఉత్పత్తుల నుంచి థర్మల్ విద్యుత్ ప్లాంట్స్ నిర్వహణ వరకు వారి వ్యాపారాలు ఉన్నాయి.ఈ సంస్థ అభివృద్ధి కోసం వ్యవస్థాపక ఛైర్మన్ దేవినేని సుబ్బారావుతో పాటుగా సమిష్టిగా కృషి చేశారు నవభారత్ పున్నయ్య. సంస్థ పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్నారు.సంస్థలో పనిచేసే సిబ్బందిని తమ సొంతవారిగా చూసుకున్న ప్రేమమూర్తి ఆయన. వ్యాపారంతో సమానంగా సమాజ సేవ కూడా చేశారు.నేడు ప్రముఖ పారిశ్రామికవేత్త నవభారత్ పున్నయ్య మీద ప్రత్యేక కథనం

నవభారత్ పున్నయ్యగా దేశ పారిశ్రామిక వర్గాల్లో ప్రసిద్ధి గాంచిన పండా పున్నయ్య చౌదరి ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని ఒకప్పటి అవిభక్త గుంటూరు జిల్లాలో కీలకమైన ఒంగోలు ఫిర్కాలోని దొడ్డవరం గ్రామంలో 1910లో సామాన్య దిగువ మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించారు.చిన్న తనంలోనే తండ్రి ఆకస్మిక మరణంతో కుదేలైన పున్నయ్య కుటుంబాన్ని గ్రామస్తులు, చుట్టాలు చూసి జాలి పడ్డారే తప్పించి ఆదుకోవడానికి ముందుకు రాలేదు. పున్నయ్య తల్లి గారు ఆంధ్రా పారిశ్రామిక పితామహుడిగా ప్రసిద్ధి గాంచిన, ప్రముఖ పారిశ్రామిక వేత్త వెలగపూడి రామకృష్ణ సోదరి.కానీ ఆత్మభిమానం మెండుగా ఉన్న ఆమె తన సోదరుడి సహాయం కోసం ఆర్థించకుండా కాయ కష్టం చేసి కుటుంబాన్ని పోషించింది.

పున్నయ్య గుంటూరు లోని ప్రముఖ ఏసీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి ఎంప్లాయిమెంట్ డిపార్ట్మెంట్ ఉద్యోగిగా జీవితాన్ని ప్రారంభించినప్పటికీ తమ కుటుంబ పరిస్థితులు తెలుసుకున్న మేనమామ రామకృష్ణ గారు పున్నయ్యని ఉద్యోగం మాన్పించి ఉన్నత విద్య కోసం లండన్ పంపించారు.లండన్ లో ఉన్నత విద్యను పూర్తి చేసి రామకృష్ణ కెసిపి సంస్థలో ఉద్యోగిగా చేరారు.రామకృష్ణ స్థాపించిన ఉయ్యూరు షుగర్ ఫ్యాక్టరీ పరిపాలనా అధికారిగా సంస్థను సుమారు రెండు దశాబ్దాల పాటు దిగ్విజయంగా నడిపించి అందరి మన్ననలు అందుకున్నారు.అయితే రామకృష్ణ ఆకస్మిక మరణం తర్వాత కెసిపి నుండి బయటికి వచ్చి తనకున్న పరిచయాలతో బ్యాంక్ వారి ఆర్థిక సహకారంతో సొంతంగా ఏలూరు పట్టణంలో షుగర్ మిల్ ను ప్రారంభించి విజయవంతంగా నడిపించారు.

1972 లో తన స్నేహితులైన పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ప్రముఖ జమీందార్ అల్లూరి సర్వరాయ చౌదరి, కృష్ణా జిల్లాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త దేవినేని సుబ్బారావు గార్లతో కలిసి" నవభారత్ సంస్థ" ను స్థాపించి ఆ సంస్థ సారథిగా బాధ్యతలు చేపట్టి ఫెర్రో అలోయ్స్, ఎనర్జీ, మైనింగ్ మరియు ఇతరత్రా రంగాలకు వ్యాపారాన్ని విజయవంతంగా విస్తరించి నవభారత్ సంస్థకు అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తీసుకువచ్చారు. పున్నయ్య గారు కేవలం నవభారత్ సంస్థలకే పరిమితం కాకుండా పలు స్వతంత్ర వ్యాపార సంస్థలకు నాయకత్వం వహించడం జరిగింది.

పున్నయ్య వ్యాపార రంగంతో సామాజిక సేవా మరియు విద్యా రంగంలో సైతం తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. నవభారత్ ట్రస్ట్ ను స్థాపించి పలు ప్రదేశాల్లో హాస్పిటల్స్ నిర్మాణం మరియు ఇతరత్రా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టారు.విద్య యొక్క ప్రాముఖ్యత తెలిసిన వ్యక్తి కావడంతో తమ నవభారత్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పిల్లల కోసం నవభారత్ స్కూల్స్ స్థాపించి నాణ్యమైన ప్రాథమిక విద్యను అందించారు. కాలానికి తగ్గాటుగా దూర దృష్టితో ఆలోచించి నిర్ణయాలు తీసుకునే పున్నయ్య గారు విజ్ఞాన జ్యోతి ట్రస్ట్ ఏర్పాటులో కీలకమైన పాత్ర పోషించి ఆ సంస్థ కింద పలు ఉన్నత విద్యా సంస్థల ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు.నేడు హైదరాబాద్ లోని ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలగా ఉన్న విజ్ఞాన జ్యోతి సైతం పున్నయ్య ఆధ్వర్యంలో స్టాపించినదే.

ఆరున్నర దశాబ్దాల పాటు వ్యాపార రంగంలో మకుటం లేని మహారాజుగా ఎదిగారు. మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన్నప్పటికి తన కృషి, పట్టుదల, దీక్షా దక్షతలతో దేశంలోనే ప్రముఖ వ్యాపార వేత్తగా కీర్తి గడించిన పున్నయ్య చివరి వరకు చాలా సాధారణమైన జీవితాన్ని గడుపుతూ పారిశ్రామిక, విద్యా మరియు సేవా రంగాల్లో అసాధారణమైన విజయాలు సాధించి భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిగా నిలిచారు.అనారోగ్యం కారణంగా తన 92వ ఏట హైదరాబాద్ నగరంలో తుది శ్వాస విడిచారు.ఆయన జీవితం ప్రతి ఒక్క ఔత్సహిక యువ వ్యాపారవేత్తలకు స్ఫూర్తి దాయకం. 

--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com