అమర్నాథ్ యాత్ర నేడే ప్రారంభం..
- July 03, 2025
అమర్నాథ్: జమ్మూకశ్మీర్‌లో 36 రోజుల పాటు జరిగే పవిత్ర అమర్నాథ్ యాత్ర ఘనంగా ప్రారంభమైంది. దేశం నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య మంచులింగాన్ని దర్శించుకునేందుకు బయలుదేరారు.ఈ సందర్భంగా ప్రభుత్వం, భారత సైన్యం కల్పించిన సౌకర్యాలు, భద్రతపై యాత్రికులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.గతంతో పోలిస్తే ఈ ఏడాది ఏర్పాట్లు చాలా అద్భుతంగా ఉన్నాయని భక్తులు ప్రశంసిస్తున్నారు.ముఖ్యంగా, భారత సైన్యం తమకు పూర్తి భద్రతా భరోసా కల్పిస్తోందని, వారి అండతోనే తాము నిర్భయంగా యాత్ర చేయగలుగుతున్నామని పలువురు యాత్రికులు తెలిపారు.ఒకప్పుడు ఉగ్రదాడుల భయంతో తక్కువ మంది వచ్చేవారని, కానీ ఇప్పుడు ప్రభుత్వం కల్పించిన భద్రతతో పెద్ద సంఖ్యలో యాత్రకు వస్తున్నామని ఆనందం వ్యక్తం చేశారు.
తొలి బృందాల పయనం..
బల్తాల్, పహల్గామ్ బేస్ క్యాంపుల నుంచి గురువారం ఉదయం యాత్రికుల తొలి బృందాలు బయలుదేరాయి. 5,246 మంది భక్తులతో కూడిన రెండో బృందం జమ్మూలోని భగవతి నగర్ యాత్రి నివాస్ నుంచి ప్రత్యేక భద్రతా కాన్వాయ్‌ల నడుమ కశ్మీర్ లోయకు బయలుదేరింది. అంతకుముందు, జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా బుధవారం యాత్రను అధికారికంగా ప్రారంభించారు. ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో ఈసారి అధికారులు కనీవినీ ఎరుగని రీతిలో భద్రతా చర్యలు చేపట్టారు. భారత సైన్యం, పారామిలటరీ బలగాలతో పాటు అదనంగా 180 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు బలగాలను (CAPF) మోహరించారు.
యాత్రికులు తప్పనిసరిగా భద్రతా కాన్వాయ్‌లలోనే ప్రయాణించాలని, ఒంటరిగా వెళ్లవద్దని అధికారులు కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. సముద్ర మట్టానికి 3,888 మీటర్ల ఎత్తులో ఉన్న పవిత్ర గుహకు భక్తులు పహల్గామ్ లేదా బల్తాల్ మార్గాల గుండా చేరుకోవచ్చు.అయితే, ఈ ఏడాది భద్రతా కారణాల దృష్ట్యా హెలికాప్టర్ సేవలను నిలిపివేశారు.ఈ యాత్ర శ్రావణ పౌర్ణమి (రక్షా బంధన్) రోజైన ఆగస్టు 9న ముగియనుంది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







