ప్రజా రాజకీయ దిగ్గజం-జాగర్లమూడి చంద్రమౌళి

- July 09, 2025 , by Maagulf
ప్రజా రాజకీయ దిగ్గజం-జాగర్లమూడి చంద్రమౌళి

తెలుగు నాట రాజకీయాల్లో నీతి, నిజాయితీలకు నిలువుటద్దంగా నిలిచిన నాయకుడు జాగర్లమూడి చంద్రమౌళి. తన సమకాలీన నేతల్లాగా, ఉన్నత పదవులు చేపట్టక పోయినప్పటికి వారి కంటే గొప్పగా ప్రజల్లో గౌరవింపబడ్డారు. జమీందారీ వ్యవస్థ నుంచి వచ్చి తన రాజకీయ జీవన పర్యంతం సామాన్య ప్రజానీకం, రైతాంగ సంక్షేమం కోసం పాటుపడ్డారు. రాష్ట్రంలో సహకార వ్యవస్థకు గట్టి పునాదులు వేసిన వారిలో చంద్రమౌళి ఒకరు. రాజకీయ ఫ్యాక్షనిస్టులను నిలువరించి, ప్రజా క్షేత్రాన వారితో ధైర్యంగా పోరాడారు. విద్యాసంస్థలు స్థాపించి, ఎందరికో విద్యాదానం చేసిన విద్యాదాతగా నిలిచారు. నేడు ప్రజా రాజకీయ దిగ్గజం జాగర్లమూడి చంద్రమౌళి మీద ప్రత్యేక కథనం...

జాగర్లమూడి చంద్రమౌళి, బాబు గారు అని పిలుచుకునే జాగర్లమూడి చంద్రమౌళి బాబు 1914, జూలై 3న ఉమ్మడి మద్రాస్ ప్రావిన్స్‌లోని అవిభక్త గుంటూరు జిల్లాకు చెందిన కారంచేడు గ్రామంలోని సంపన్న జమిందారీ వ్యవసాయదారులు మరియు రాజకీయ కుటుంబానికి చెందిన జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి, ఆదిలక్షమ్మ దంపతులకు జన్మించారు.బాల్యం, ప్రాథమిక విద్యాభ్యాసం కారంచేడులోనే సాగిన తర్వాత తండ్రి రాజకీయ కార్యకలాపాల నిమిత్తం మద్రాస్ నగరానికి మకాం మార్చడం జరిగింది. మద్రాస్ నగరంలోనే బీఏ మరియు లా డిగ్రీలను పూర్తి చేశారు. కొద్దికాలం పాటు గుంటూరులో ప్రాక్టీస్ చేశారు.

చంద్రమౌళి కుటుంబ నేపథ్యంలోకి వెళితే తాత (తల్లి గారి తండ్రి) యార్లగడ్డ రంగనాయకులు నాయుడు బహద్దూర్ 19వ శతాబ్దంలోనే షిప్పింగ్, ఐరన్ ఓర్ వ్యాపారాలు చేస్తూ బాగా ఆర్జించారు. కారంచేడు నుండి రేపల్లె వరకు సుమారు ఐదువేల ఎకరాలకు యజమానిగా ఉండేవారు. అంతేకాకుండా, నూజివీడు, ఉయ్యురు సంస్థానాల నుంచి కాటూరు, శాయపురం, కొమ్మూరు గ్రామాలను కొనుగోలు చేసి వాటికి అజమాయిషీదారుగా సైతం వ్యవహరించారు. ఆనాడు మద్రాస్ నగరంలో సంపన్న కుటుంబమైన గడ్డిపాటి వీరయ్య నాయుడు గారితో కలిసి పలు వ్యాపారాలు చేసేవారు. బ్రిటిష్ పాలకుల దగ్గర మంచి పలుకుబడి ఉండేది. ఆరోజుల్లోనే బ్రిటిష్ చక్రవర్తి పట్టాభిషేకానికి ఆహ్వానమందుకొని ఇంగ్లాండ్ వెళ్లి వచ్చారు. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించారు.

చంద్రమౌళి తండ్రి రావుబహద్దూర్ జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి గారు నిష్కలంక రాజకీయవేత్తగా,సంఘ సేవకునిగా, ధార్మికవేత్తగా, విద్యాదాతగా అవిభక్త గుంటూరు జిల్లా చరిత్రలో నిలిచిపోయారు. కారంచేడు జమీందారీ బాధ్యతలు నిర్వహిస్తూనే, జస్టిస్ పార్టీ తరపున రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించేవారు. 1920-36 వరకు మద్రాస్ శాసనసభకు వరసగా మూడు సార్లు ఎన్నికయ్యారు. 1927-37 వరకు అవిభక్త గుంటూరు జిల్లా బోర్డు అధ్యక్షుడిగా పనిచేశారు. వెంకటగిరి, బొబ్బిలి మరియు పానగల్ రాజాలతో సన్నిహిత మిత్రుడిగా ఉండేవారు. కులమత భేదాలకు అతీతంగా యుగకవి గుర్రం జాషువాను ప్రోత్సహించడమే కాకుండా, తన ముఖ్య ఆస్థాన కవిగా వారిని నియమించుకున్నారు.

తాత, తండ్రుల నేపథ్యాలకు భిన్నంగా చంద్రమౌళి రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. చదువుకునే రోజుల్లోనే వామపక్ష సోషలిస్టు భావజాలానికి ఆకర్షితుడైన ఆయన కాంగ్రెస్ సోషలిస్టు పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించేవారు. అదే సమయాన ఆచార్య రంగాతో ఏర్పడ్డ సన్నిహిత సంబంధాల కారణంగా రైతు, చేనేత ఉద్యమాల్లో పాలుపంచుకోవడం మొదలుపెట్టారు. రంగా నేతృత్వంలో నాటి అవిభక్త గుంటూరులో జరిగిన ప్రతి కార్యక్రమంలో చంద్రమౌళి పాల్గొనేవారు. ఈ క్రమంలోనే కమ్యూనిజం నుంచి రైతాంగ పక్షం వైపు నడిచారు. 1940ల్లోనే కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా ఉన్న ఆయన, దేశానికి స్వాతంత్య్రం వచ్చే వరకు రంగా, ప్రకాశం మరియు వెంకట్రావు వర్గాలకు సమాంతరంగా ఉండేవారు. దేశానికి వచ్చిన తర్వాత నుంచి గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ రాష్ట్ర కమిటీ మెంబర్ అయ్యారు.

1951లో కాంగ్రెస్ పార్టీకి రంగా, ప్రకాశం గార్లు రాజీనామా చేసినప్పటికి, వీరు మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. 1952-54 మధ్యలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించారు. 1955 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పెద్దలు, అభిమానులు కోరిక మేరకు
అమ్మనబ్రోలు నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్యెల్యేగా ఎన్నికయ్యారు. 1955-56 వరకు సీఎంగా ఉన్న బెజవాడ గోపాల్ రెడ్డి గారి హయంలో మంత్రులతో సమానంగా గౌరవాభిమానాలను అందుకున్నారు. సంజీవరెడ్డి సీఎం అయినా తర్వాత నుంచి కాంగ్రెస్ పార్టీలో కుట్రలు, కుతంత్రాలు ఎక్కువ కావడంతో పాటుగా స్వలాభమే పరమావధిగా ఉండటం వల్ల పార్టీకి రాజీనామా చేశారు.

1957లోనే క్రియాశీలక రాజకీయాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్న ఆయన్ను రంగా వారించి, నిర్ణయాన్ని విరమింపజేశారు. రంగా సైతం ప్రధాని నెహ్రూ పెత్తందారీ పోకడలకు పాల్పడటం, రైతాంగ వ్యతిరేకిగా మారడంతో ఆయన్ని విభేదించి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. 1959లో రాజగోపాలాచారి, మీనోమాసాని, రంగా మరియు కె.ఎం.మున్షిలు కలిసి స్వతంత్ర పార్టీని స్థాపించారు. రంగా గారి ప్రత్యేక  ఆహ్వానం మేరకు నెల్లూరు నుంచి బెజవాడ రామచంద్రారెడ్డి, గుంటూరు నుంచి చంద్రమౌళి గార్లు చేరారు. వీరితో పాటుగా రంగా ముఖ్య అనుచరులైన పాటూరి రాజగోపాల్ నాయుడు, గౌతు లచ్చన్న మొదలైన వారు సైతం ఆ పార్టీలో చేరారు.

1962లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి రాష్ట్ర రాజకీయాల్లో మరియు ప్రభుత్వంలో రెండో స్థానంలో వచ్చిన కాసు బ్రహ్మానందరెడ్డి మీద ఫిరంగిపురంలో పోటీ చేయడానికి ప్రతిపక్ష పార్టీలైన కమ్యూనిస్టులు, సోషలిస్టులు బయటపడుతూ ఉండేవారు. అందుకు ముఖ్య కారణంగా బ్రహ్మానందరెడ్డి అన్న వెంగళరెడ్డి పల్నాడు ప్రాంతాన్ని తన గుత్తాధిపత్యంలో ఉంచుకున్నారు. బ్రహ్మానందరెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో శక్తివంతుడైన నాయకుడిగా ఎదగడం వెనుక వెంగళ రెడ్డి పాత్ర మరువలేనిది. పల్నాడు సీమలో ముఖ్యంగా మాచర్ల, నరసరావుపేట, గురజాల మరియు పెదకూరపాడు నియోజకవర్గాల్లో వెంగళరెడ్డి అండ లేకుండా ఏ పార్టీ అభ్యర్థి గెలిచేవారు కాదు. పైగా 62 ఎన్నికల్లో తమ్ముడిని గెలిపించేందుకు అంగ, అర్థ బలాన్ని ఉపయోగించి ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నిస్తున్న దశలోనే అక్కడ పోటీ చేసేందుకు స్థానిక నాయకులు అందరు జంకుతున్న సమయంలో రంగా గారి అభ్యర్థన మేరకు ఫిరంగిపురం నుంచి చంద్రమౌళి బరిలోకి దిగారు.

కాసు కుటుంబానికి చంద్రమౌళి వ్యక్తిగతంగా సన్నిహితులు. కాసు సోదరులు ఆయన్ని బాబు గారు గౌరవంగా సంభోదించేవారు. ఎన్నికల్లో తమకు ప్రత్యర్థిగా బరిలోకి దిగుతున్నారని తెలిసి మొదట ఆశ్చర్యం వ్యక్తం చేసినప్పటికి, పోటీ రసవత్తరంగా మారుబోతుందని తెలిసి కాసు బ్రహ్మానందరెడ్డి ఇతర ప్రాంతాలకు వెళ్లి ప్రచారం చేయకుండా, నియోజకవర్గానికే పరిమితం అయ్యారు. కాసు సోదరులు ఇద్దరు తమ శక్తియుక్తులు ఒడ్డి పోరాడగా, చంద్రమౌళి గారు మాత్రం తన నియోజకవర్గానికే పరిమితం కాకుండా, గుంటూరు జిల్లాలోని ఇతర స్వతంత్ర పార్టీ అభ్యర్థులకు ప్రచారం చేశారు. చంద్రమౌళి గారికి బడుగు, బలహీన మరియు రైతాంగ వర్గాల నుంచి వస్తున్న అశేషమైన ఆదరణ పసిగట్టిన ఫిరంగిపురంలో పెత్తందారీ వర్గాలన్ని తమ మధ్య కులమతాలకు అతీతంగా ఏకమై చంద్రమౌళీని ఓడించడమే లక్ష్యంగా కాసు సోదరులకు సహాయం చేశారు.

ఎన్నో నిర్బంధ ప్రలోభాలు, రిగ్గింగులు వంటివి చోటుచేసుకొని హోరా హోరీగా జరిగిన ఆ ఎన్నికల్లో కాసు బ్రహ్మానందరెడ్డికి 27494 ఓట్లు రాగా, చంద్రమౌళి గారికి  26991 ఓట్లు వచ్చాయి. కేవలం 503 ఓట్లతో బ్రహ్మానందరెడ్డిపై చంద్రమౌళి ఓడారు. ఉమ్మడి రాష్ట్ర ఎన్నికల చరిత్రలో పల్నాటి యుద్దాన్ని తలపించిన ఈ పోరు గురించి కొన్ని దశబ్దాల పాటు అప్పటి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో కథలు కథలుగా చెప్పుకునేవారు. ఎన్నికల్లో తానూ గెలిచినా, నైతిక విజయం మాత్రం చంద్రమౌళి గారిదేనని బ్రహ్మానందరెడ్డి పలు మార్లు తన సన్నిహితుల వద్ద చెప్పేవారు. ఒకవేళ ఆ ఎన్నికల్లో బ్రహ్మానందరెడ్డి ఓడి ఉండుంటే 1964లో రాష్ట్రానికి సీఎం అయ్యేవారు కాదని,ఆయన  రాజకీయ జీవితం సైతం అంతటితోనే ముగిసేదాని రాజకీయ విశ్లేషకులు ఇప్పటికి అంటుంటారు.

 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన తర్వాత క్రియాశీలక రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలగాలని నిర్ణయించుకొని స్వతంత్ర పార్టీకి రాజీనామా కూడా ఇచ్చినా, జాతీయ నాయకులైన రాజగోపాలాచారి, ఆచార్య రంగా మరియు మసానీలు అంగికరించలేదు. రంగానే స్వయంగా గుంటూరు వచ్చి విజ్ఞప్తి చేయడం వల్ల రాజీనామా తిరిగి తీసుకున్నారు. 1959-74 వరకు స్వతంత్ర పార్టీలో క్రియాశీలకంగా ఉన్న ఆయన    అవిభక్త గుంటూరు జిల్లా స్వతంత్ర పార్టీ అధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్వతంత్ర పార్టీ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 1968లో రాజ్యసభకు ఎన్నికైన ఆయన 1974 వరకు కొనసాగారు.

1972లో వచ్చిన జైఆంధ్రా ఉద్యమంలో పాల్గొని, పార్టీలకు అతీతంగా గుంటూరు జిల్లాలో ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఉద్యమ సమయంలో అరెస్టులకు వెరవకుండా విజయవంతంగా నిర్వహించారు. 1974లో అనారోగ్యం కారణంగా స్వతంత్ర పార్టీ కార్యకలాపాల నుంచి స్వచ్ఛందంగా వైదొలిగారు. 1975-77 మధ్య ఎమెర్జెన్సీ ఉద్యమానికి వ్యతిరేకంగా పోరాడిన నాయకులకు, యువతకు పరోక్షంగా తన సంఘీభావాన్ని తెలిపారు. ఎమెర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో తమతో చేరమని ఆచార్య రంగా కోరినా సున్నితంగా వీరు తిరస్కరించారు. అదే సమయంలో జయప్రకాష్ నారాయణ్ ఏర్పాటు చేసిన జనతా పార్టీలో చేరమని గౌతు లచ్చన్న ఇతర ప్రతిపక్ష నేతలు కోరడంతో ఆ పార్టీలో చేరారు.

లచ్చన్న మాట కాదనలేక 1977 లోక్ సభ ఎన్నికల్లో బాపట్ల నుంచి పోటీ చేశారు. అయితే, అనారోగ్యం కారణంగా ప్రచారంలో ఎక్కువ సమయం కేటాయించలేకపోయారు. పైగా కరడుగట్టిన కాంగ్రెస్ ఉద్దండ నేత పాములపాటి అంకినీడు ప్రసాదరావు తనకు ప్రత్యర్థిగా ఉండటం మూలంగా మరియు రాష్ట్రంలో కాంగ్రెస్ హవా వల్ల 42 వేల ఓట్ల తేడాతో ఓటమి చెందారు. అయితే, 1978 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇందిరా కాంగ్రెస్ మరియు రెడ్డి కాంగ్రెస్ పార్టీలుగా చీలాయి. ఆ సమయంలో రెడ్డి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష బాధ్యతల్లో ఉన్న కాసు బ్రహ్మానందరెడ్డి తమ పార్టీ తరపు నుంచి పోటీ చేయమని ఆయనే స్వయంగా వచ్చిన కోరినా, లచ్చన్నకు ఇచ్చిన మాటకు కట్టుబడి జనతా పార్టీ తరపున ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్న మార్టూరు నుంచి రెండోసారి ఎమ్యెల్యేగా గెలిచారు.

1978-83 వరకు ఎమ్యెల్యేగా కొనసాగిన తర్వాత రాజకీయాల నుంచి శాశ్వతంగా విరమించుకున్నారు. 1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు పార్టీలో చేరమని ఆయన మరియు అప్పటికే పార్టీలో చేరిన చంద్రమౌళి గారి రాజకీయ సహచరులు కోరినా గట్టిగా   తిరస్కరించారు. అయితే, ఎన్టీఆర్ ప్రయత్నం విజయవంతం కావాలని శుభాకాంక్షలు పంపారు. అప్పటి నుండి చివరి శ్వాస వరకు రాజకీయలకు దూరంగా సామాజిక మరియు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణలో నిమగ్నమై పోయారు.

చంద్రమౌళి రాష్ట్ర సహకార ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించారు. రంగాతో రైతాంగ మరియు చేనేత ఉద్యమాల్లో పాల్గొన్న దశలోనే సహకార వ్యవస్థ ద్వారానే రైతులకు, చేనేతకు న్యాయం జరుగుతుందని నమ్మారు. 1946లో ఏర్పాటు చేసిన గుంటూరు సహకార మార్కెట్  సమితికి 1947 నుంచి 1972 వరకు దాదాపు పాతికేళ్ల పాటు అధ్యక్షుడిగా పనిచేసి సంస్థను లాభాల బాటలో పట్టించడమే కాకుండా సంస్థ నూతన భవనాలు నిర్మించారు. 1949లో ఏర్పడ్డ గుంటూరు అర్బన్ సహకార బ్యాంకు అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. 1964-74 వరకు బ్యాంకు ఛైర్మన్‌గా కొనసాగారు. ఇలా ఆ రెండిటిని విజయవంతంగా నడిపించారు.

చంద్రమౌళి రైతు పక్షపాతి. సోషలిస్టు భావజాలం పట్ల అంచంచలమైన విశ్వం ఉన్న వ్యక్తి కావడంతో రైతు ఉద్యమాలను విజయవంతం చేయడానికి సామాన్య కార్యకర్తగా అలుపెరుగకుండా శ్రమించారు. గుంటూరులో పొగాకు బోర్డు రప్పించేందుకు అప్పటి కేంద్ర మంత్రి కొత్తా రఘురామయ్య, ఆచార్య రంగా, నాగినేని వెంకయ్యలతో కలిసి కృషి చేశారు. పొగాకు ఉత్పత్తిదారుల సంఘానికి అధ్యక్షుడిగా ఉంటూనే పొగాకు రైతుల మద్దతు ధర ఇప్పించేందుకు కృషి చేశారు. ఎమ్యెల్యేగా, ఎంపీగా చట్టసభల్లో రైతాంగ ప్రయోజనాలే ధ్యేయంగా పనిచేశారు. నాగార్జునసాగర్ ఆయకట్టును నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి వరకు పొడిగించాలని ప్రభుత్వాలను కోరిన నాయకుల్లో ఆయన ముఖ్యులు. రైతాంగ సంక్షేమం కోసం పార్టీలకు అతీతంగా పనిచేశారు.

చంద్రమౌళి గొప్ప సామాజిక సేవావేత్త. గుంటూరులో పలు ధార్మిక మరియు సామాజిక సేవాయ కార్యక్రమాలకు భూరిగా విరాళాలు ఇచ్చే వారు. ఆనాడు గుంటూరులో ఉన్నత విద్యాసంస్థల కొరతను గ్రహించి 1967 చివర్లో నాగార్జున ఎడ్యుకేషనల్ సొసైటీని స్థాపించిన తర్వాత 1968 నుండి 1987 వరకు సొసైటీ అధ్యక్షుడిగా ఉన్నారు. తన హయాంలోనే  గుంటూరు నగరం నడిబొడ్డున 1968లో జెకెసి ఇంటర్ మరియు డిగ్రీ కళశాలను స్థాపించారు.అదే ఏడాది ఎస్.జి.వి.ఆర్ హైస్కూల్ స్థాపించారు. 1983లో రాజకీయాల నుంచి విరమించిన తర్వాత ఆర్.వి.ఆర్.ఆర్ డిగ్రీ కాలేజీ, 1985లో ఆర్.వి.ఆర్ అండ్ జె.సి ఇంజనీరింగ్ కళాశాలలను స్థాపించారు. అలాగే, 1976లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం స్థాపించడానికి భూరిగా విరాళాలు ఇచ్చారు. 1978 -87 వరకు ఆ యూనివర్సిటీ సెనేట్ సభ్యుడిగా కొనసాగారు. అలాగే, భారత్ సేవక్ సమాజ్, లెప్రసీ సొసైటీ, ప్రజా వైద్యశాలలకు గుప్త దానాలు చేశారు.

నాలుగున్నర దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో చంద్రమౌళి తన సమకాలీన నాయకుల్లా ఉన్నతమైన పదవులు అధిరోహించకపోయినా, పదవుల కోసం ఆరాటపడలేదు. 1955లో బెజవాడ గోపాల్ రెడ్డి మంత్రి పదవి తీసుకోమని ప్రోత్సహించినప్పటికి, తన వారుగా భావించే రైతులకు దూరమవ్వాల్సి వస్తుందని సున్నితంగా తిరస్కరించారు. 1970లో ఉమ్మడి ప్రకాశం జిల్లా ఏర్పాటుకు సంపూర్ణ మద్దతును తెలిపారు. రాజకీయాల్లో ప్రత్యర్థులుగా ఉన్నా, వ్యక్తిగతంగా మాత్రం వారందరితో సన్నిహితంగా మెలిగారు. బెజవాడ గోపాల్ రెడ్డి నుంచి ఎన్టీఆర్ వరకు అందరు సీఎంలు వారి మాటకు ఎంతో వీలువనిచ్చేవారు. రాజకీయ, సామాజిక సేవా రంగాల్లో విశేషమైన కృషి చేసిన చంద్రమౌళి తన 72వ ఏట గుంటూరులో కన్నుమూశారు. ఆయన మరణించి నాలుగున్నర దశాబ్దాలు కావొస్తున్నా, ఆయన నాటిన విద్యా సంస్థలు నేటికి విజయవంతంగా నిర్వహింపబడుతున్నాయి.  

--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com