సెల్ఫీరాజా రివ్యూ
- July 15, 2016
చిత్రం: సెల్ఫీరాజా తారాగణం: అల్లరి నరేష్.. కామ్న రణవత్.. సాక్షిచౌదరి.. సప్తగిరి.. రవిబాబు.. పృథ్వీ.. తాగుబోతు రమేష్.. సుదర్శన్ తదితరులు ఛాయాగ్రహణం: ఎస్.లోకనాథన్ సంగీతం: సాయికార్తీక్ కళ: చిన్నా కూర్పు: ఎం.ఆర్.వర్మ స్క్రీన్‌ప్లే: శ్రీధర్ సీపాన సంభాషణలు: డైమండ్ రత్నం . నిర్మాణం: చలసాని రామబ్రహ్మం చౌదరి దర్శకత్వం: జిఈశ్వర్‌రెడ్డి విడుదల: 15-06-2016
స్టార్ కథానాయకులు తెరపై సీరియస్‌గా చేసే సన్నివేశాల్నే అల్లరి నరేష్ సినిమాల్లో స్పూఫ్‌లుగా తెరకెక్కిస్తుంటారు. అమాయకత్వంతో కనిపించే నరేష్ ఆ స్పూఫ్‌ల్లో చాలా బాగా ఒదిగిపోతుంటారు. దీంతో తెరపై బోలెడంత అల్లరి. కాకపోతే ఎప్పుడూ అల్లరి నరేష్ ఇవే చేస్తున్నారేంటి? అని ప్రేక్షకులు ఆ మధ్య కాస్త రొటీన్‌గా ఫీలయ్యారు. దాంతో నరేష్ ట్రాక్ మార్చారు. స్పూఫ్‌లకి దూరంగా ఉంటూ కొన్ని సినిమాలు చేశారు. కానీ అవేవీ సరైన ఫలితాల్ని ఇవ్వలేదు. దీంతో మళ్లీ ఆయన పాత రూట్లోకి వచ్చి.. స్పూఫ్‌లపైనే దృష్టి పెట్టి చేసిన సినిమానే సెల్ఫీరాజా. మరి ఈ సినిమాతో అల్లరి నరేష్ తనదైన ట్రాక్‌లో నవ్వించారా? లేదో? అనేది తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
కథేంటంటే?: రాజా (అల్లరి నరేష్) మంచి మనసున్నోడు. కాకపోతే కొంచెం నోటి దురుసు ఎక్కువ. తాను సమస్యల నుంచి తప్పించుకోవడానికి నోటికి ఏదనిపిస్తే అది మాట్లాడేస్తుంటాడు. దాంతో పాటు సెల్ఫీలంటే పిచ్చి. రాజా సెల్ఫీ పిచ్చితో చుట్టుపక్కల వాళ్లు సమస్యల్లో ఇరుక్కుంటుంటారు. ఆ రెండు లక్షణాలే పోలీసు కమిషనర్ కూతురు శ్వేతతో పరిచయం కావడానికి కారణమవుతుంది. అదే సమయంలో అతని మంచి మనసును చూసి శ్వేత ప్రేమిస్తుంది. ఇద్దరూ పెళ్లి చేసుకొంటారు.
ఇంతలో ఓ చిన్న సమస్య ఎదురవుతుంది. అది కూడా రాజా నోటి దురుసు వల్లే. ఆ సమస్యతో ఇద్దరి మధ్య అపార్థాలు చోటు చేసుకొని దూరమవుతారు. దీంతో రాజా చచ్చిపోవాలనుకొంటాడు. కానీ అది సాధ్యం కాదు. తనని చంపేయాలని స్వయంగా మామ్స్ (రవిబాబు)తో కాంట్రాక్ట్ మాట్లాడుకొంటాడు. తనకొచ్చిన కాంట్రాక్ట్‌ని పూర్తి చేసేందుకు భీమ్స్ (అల్లరి నరేష్)తో కలిసి మామ్స్ రంగంలోకి దిగుతాడు.
మరి మామ్స్, భీమ్స్ రాజాని చంపేశారా లేదా? పోలికల్లో ఒకలాగే ఉన్న భీమ్స్‌కి.. రాజాకి మధ్య సంబంధం ఏంటి? విడిపోయిన రాజా దంపతులు మళ్లీ ఎలా కలిశారు? తదితర విషయాలు తెరపైనే చూడాలి.
ఎలా ఉందంటే?: తెలుగు తెరపై అరిగిపోయిన కన్‌ఫ్యూజన్ కామెడీ ఫార్ములా కథతో తెరకెక్కిన చిత్రమిది. కథలోగానీ.. కథనంలోగానీ కొత్తదనమేమీ ఉండదు. లాజిక్‌లుగట్రా ఏమీ ఆలోచించకుండా సిల్లీ సన్నివేశాలతో దర్శకుడు చిత్రాన్ని నడిపాడు. కాకపోతే ఎప్పట్లాగే మళ్లీ నరేష్ ఈ సినిమాలో స్పూఫ్‌లతో సందడి చేయడంతో ప్రేక్షకులకి కాస్త ఉపశమనం లభిస్తుంది.
ట్రెండీగా ఉంటుందని సెల్ఫీని కథలోకి లాగినట్టు అనిపిస్తుంది. కథ ఆరంభంలో మాత్రమే సెల్ఫీ సందడి. మిగతా ఎక్కడా కథానాయకుడి సెల్ఫీ పిచ్చి ప్రస్తావన రాదు. ఒక హీరో.. ఒక హీరోయిన్.. ఒక విలన్‌కి మాత్రమే సంబంధించిన కథలోకి పలువురు ప్రవేశించడం. వారిలో ఒకరి కోసం మరొకరు వెంటపడటం.. ఆ ప్రహసనంలో వినోదం పండడమే కన్‌ఫ్యూజన్ కామెడీ కథల ప్రత్యేకత.
తొలి సగభాగం సెల్ఫీ రాజా ప్రేమ.. పెళ్లి చుట్టూ సాగుతుంది. మలి భాగం కథలోకి రాజా పోలికలతో ఉన్న భీమ్స్‌ని ప్రవేశపెట్టడంతో కథ మలుపు తిరుగుతుంది. రాజా కోసం అప్పటికే లోకల్ విలన్ గ్యాంగ్ ఒకటి వెంటపడుతుంటుంది. అదే సమయంలో రాజాని చంపేయాలని వచ్చిన భీమ్స్‌ని చూసి లోకల్ విలన్ గ్యాంగ్ అతనే రాజా అని భావించి వెంట పడుతుంది. దీంతో కథలో కావల్సినంత గందరగోళం చోటు చేసుకుంటుంది.
పోకిరి.. ఖుషీ.. వూపిరి.. సర్దార్ గబ్బర్‌సింగ్.. సరైనోడు 'అమ్మేయండి బాస్' అనే ప్రకటన.. ఇలా బోలెడన్ని విషయాల్ని స్పూఫ్‌లుగా తీర్చిదిద్దారు. గతంలోనూ 'సుడిగాడు' సినిమాతో స్పూఫ్‌ల్ని ఓ స్థాయిలో పిండేశాడు నరేష్. దానికి కొనసాగింపు అన్నట్టు ఇందులో లేటెస్ట్ సినిమాల్ని వాడేశారంతే. ఆ సన్నివేశాలు వచ్చినప్పుడు అక్కడక్కడ కొన్ని నవ్వులు పండడం మినహా సినిమాలో చెప్పుకోదగ్గ విషయమేమీ లేదు. ఈ సినిమాను చూసినప్పుడు విజయం దక్కాలంటే స్పూఫ్‌లమీదే ఆధారపడాలని నరేష్ నిర్ణయించుకొన్నాడేమో అనిపిస్తుంది. తొలి సగ భాగం సరదాగా సాగినా.. రెండో సగభాగం మాత్రం ప్రహసనంలా అనిపిస్తుంది. కథని మరింత రక్తి కట్టించేలా తెరకెక్కించే అవకాశం ఉన్నా దర్శకుడు ఆ దిశగా దృష్టి పెట్టలేదనిపిస్తుంది.
ఎవరెలా?: సినిమాకి నరేష్.. పృథ్వీల అల్లరే హైలెట్. ఎస్సై అంకుశం పాత్రలో పృథ్వీ నవ్వులు పండించాడు. చెప్పను బ్రదర్, వూర మాస్.. అంటూ ఆయన చేసిన సందడి ఆకట్టుకుంటుంది. నరేష్ కామెడీ టైమింగ్ సినిమాకి ప్రధాన బలం. కృష్ణభగవాన్.. షకలక శంకర్.. సుదర్శన్.. తాగుబోతు రమేష్.. రవిబాబు.. సత్య తదితరులు తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు.
హీరోయిన్లకి పెద్దగా ప్రాధాన్యం లేదు. ఉన్న కాసిన్ని సన్నివేశాల్లోనూ తేలిపోయారు. కామ్న లిప్ సింకింగ్ అయితే అసలు ఆమె తెలుగులో మాట్లాడినట్టే అనిపించదు. సాంకేతికంగా చెప్పుకోవల్సిందేమీ లేదు. డైమండ్ రత్నం మాటలు అక్కడక్కడా పేలాయి. కథలో బోలెడంత కన్‌ఫ్యూజన్ ఉన్నా దర్శకుడు మాత్రం స్పష్టతతో చిత్రాన్ని తెరకెక్కించారు.
+ అల్లరి నరేష్.. పృథ్వీ + స్పూఫ్ వినోదం
- కొత్తదనం కొరవడిన కథ - రెండో సగభాగం
చివరిగా.. సెల్ఫీరాజా స్పూఫ్‌బాజా గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టికోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్‌కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్‌ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్‌లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు









