నిమిష ప్రియకు ఉరిశిక్షను రద్దుచేస్తూ యెమెన్ ప్రభుత్వం నిర్ణయం..
- July 29, 2025
యెమెన్: భారతీయ నర్సు నిమిష ప్రియకు భారీ ఊరట లభించింది. అనేక ప్రయత్నాల అనంతరం ఎట్టకేలకు ఆమె ఉరిశిక్ష రద్దయింది. ఓ హత్య కేసులో ఆమెకు విధించిన ఉరిశిక్షను రద్దు చేసేందుకు యెమెన్ అధికారులు నిర్ణయించారు. సోమవారం అర్థరాత్రి ఈ నిర్ణయం వెలువడింది. ఈ మేరకు భారత గ్రాండ్ ముఫ్తీ, సున్నీ లీడర్ కాంతపురం ఏపీ అబూబకర్ ముస్లియూర్ కార్యాలయం నుంచి ఈ ప్రకటన వెలువడింది.
ఆమె మరణశిక్ష రద్దు చేయాలంటూ వస్తున్న అభ్యర్థనలను పరిశీలించేందుకు యెమెన్ రాజధాని సనా సిటీలో ఒక అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ భేటీలో ఉత్తర యెమెన్ అధికారులు, అంతర్జాతీయ దౌత్య ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో నిమిష ప్రియ ఉరిశిక్షను రద్దు చేస్తూ యెమెన్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
యెమెన్ జాతీయుడి హత్య కేసులో నిమిషకు మరణశిక్ష పడిన విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం జూలై 16నే ఆమెకు ఉరిశిక్ష అమలు కావాల్సి ఉంది. అయితే, భారత ప్రభుత్వ విజ్ఞప్తితో శిక్ష తాత్కాలిక వాయిదా పడింది. నిమిష, బాధిత కుటుంబాలు పరస్పర అంగీకారానికి వచ్చి కేసును పరిష్కరించుకునేందుకు మరింత సమయం ఇవ్వాలని యెమెన్ ప్రభుత్వాన్ని భారత విదేశాంగశాఖ పలుమార్లు కోరడంతో మరణశిక్షను తాత్కాలికంగా వాయిదా వేశారు.
నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దుకోసం భారత గ్రాండ్ ముఫ్తీ విజ్ఞప్తి మేరకు యెమెన్‌లోని సూఫీ ముఖ్య పండితుడు అయిన షేక్ హబీబ్ ఒమర్ బిన్ హఫీజ్ ఒక బృందాన్ని చర్చలకోసం నియమించారు. మరోవైపు అబుబాకర్ ముస్లియార్ ఉత్తర యెమెన్ ప్రభుత్వంతో పాటు అంతర్జాతీయంగా మధ్యవర్తిత్వం జరిపారు. దీంతో చర్చలు ఫలించడంతో ఆమె ఉరిశిక్ష రద్దుకు యెమెన్ అధికారులు అంగీకరించినట్లు ముఫ్తీ కార్యాలయం తెలిపింది. అబుబాకర్ ప్రకటనను యెమెన్‌లోని యాక్షన్ కౌన్సిల్ ఫర్ తలాల్ మహదీస్ జస్టిస్ ప్రతినిధి సర్హాన్ షంశాన్ అల్ విశ్వాబి ధ్రువీకరించారు.
నిమిష ప్రియ ప్రస్తుతం యెమెన్ జైలులో ఉంది. ఉరిశిక్ష రద్దయినప్పటికీ ఆమె జైలు నుంచి బయటకు వచ్చే విషయంపై స్పష్టమైన ప్రకటన రాలేదు. నిమిష ప్రియ జైలు నుంచి విడుదల అవుతుందా.. లేదా జీవిత ఖైదు పడే అవకాశం ఉందా అనేది తెలియాల్సి ఉంది. మృతుడు (యెమెన్ పౌరుడు) తలాల్ మహదీ కుటుంబ సభ్యులతో చర్చల అనంతరం తదుపరి నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- సౌదీ దౌత్య శిక్షణ సంస్థ డీజీతో భారత రాయబారి విపుల్ భేటీ
- సీఎం రేవంత్ US టూర్ రద్దు..
- యూట్యూబ్‌కు పోటీగా చైనా ‘బిలిబిలి’ వచ్చేసింది..
- CBSE–JEE విధానం విద్యార్థుల్లో ఆలోచనా వైవిధ్యాన్ని తగ్గిస్తోంది: బిట్స్ వీసీ రామగోపాల్ రావు
- విశాఖలో బ్రిక్స్ క్రీడా మంత్రుల భేటీ.. భారత్ కీలక ప్రతిపాదనలు
- వాహనాలపై ట్రాఫిక్ జరిమానాలు పేరుకుపోతే చర్యలు తప్పవు: దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- అబుదాబిలో డిసెంబర్ 3 నుంచి ఫార్ములా-1 గ్రాండ్ ప్రిక్స్
- కొలరాడోలో NATS చెస్ టోర్నమెంట్ చక్కటి స్పందన
- ముష్రిఫ్ నేషనల్ పార్క్‌లో కొత్త బ్రిడ్జి ప్రారంభం..
- బహ్రెయిన్‌లో లోజ్ పండ్ల ధరలకు రెక్కలు..!!







