WCL టోర్నీ నుంచి భార‌త్ వాకౌట్‌..

- July 31, 2025 , by Maagulf
WCL టోర్నీ నుంచి భార‌త్ వాకౌట్‌..

లండన్: ఇంగ్లాండ్ వేదిక‌గా వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ రెండో సీజ‌న్ జ‌రుగుతోంది. ఈ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియ‌న్‌గా బ‌రిలోకి దిగిన ఇండియా ఛాంపియ‌న్స్ జ‌ట్టు సెమీస్‌కు చేరుకుంది. గురువారం సెమీస్‌లో దాయాది పాకిస్థాన్‌తో త‌ల‌ప‌డాల్సి ఉంది.

అయితే.. పాక్‌తో ఎట్టి ప‌రిస్థితుల్లో ఆడ‌బోమ‌ని భార‌త ఆట‌గాళ్లు స్ప‌ష్టం చేశారు. ప‌హ‌ల్గాం ఉగ్ర‌దాడి త‌రువాత పాక్‌తో ద్వైపాక్షిక క్రీడా సంబంధాల‌కు వ్య‌తిరేకంగా భారత జ‌ట్టు త‌న వైఖ‌రిని మ‌రోసారి పున‌రుద్ఘాటించింది.

గ్రూపు ద‌శ‌లోనూ పాక్‌తో ఆడేందుకు జ‌ట్టులోకి కీల‌క ఆట‌గాళ్లైన శిఖ‌ర్ ధావ‌న్‌, యువ‌రాజ్ సింగ్‌, హ‌ర్భ‌జ‌న్ సింగ్‌, సురేశ్ రైనా, ఇర్ఫాన్ ప‌ఠాన్‌, యూస‌ఫ్ ప‌ఠాన్ నిరాక‌రించిన సంగ‌తి తెలిసిందే. దీంతో టోర్నీ నిర్వాహ‌కులు గ్రూపు ద‌శ‌లో మ్యాచ్‌ను ర‌ద్దు చేసి ఇరు జ‌ట్లకు చెరో పాయింట్‌ను కేటాయించారు.

ఇక ఇప్పుడు సెమీస్‌లో పాక్‌తో ఆడేది లేద‌ని భార‌త్ స్ప‌ష్టం చేసింది. టీమ్ఇండియా సెమీస్ మ్యాచ్ నుంచి వైదొల‌గ‌డంతో పాక్ నేరుగా ఫైన‌ల్‌కు అర్హ‌త సాధించింది. మ‌రో సెమీస్ లో ద‌క్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించిన జ‌ట్టుతో శ‌నివారం పాక్ ఫైన‌ల్ ఆడ‌నుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com