డ్రగ్స్ జోలికెళ్లొద్దు: ఐజీ ఆకే రవికృష్ణ
- August 13, 2025
విజయవాడ: విద్యార్థులు మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధన దిశగా అడుగులేయాలని ఈగల్ అధిపతి, ఐజీ ఆకే రవికృష్ణ అన్నారు.యునైటెడ్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ ఫస్ట్ ఇయర్ విద్యార్థుల స్వాగత కార్యక్రమాన్ని ‘సంయుక్త’ పేరుతో బుధవారం నిర్వహించారు.
గవర్నరుపేట మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఐజీ ఆకే రవికృష్ణ ముఖ్య అతిథిగా హాజరై, విద్యార్థులతో నషా ముక్త్ భారత్ అభియాన్ ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ.. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, క్రమశిక్షణతో విద్యనభ్యసించి ఉత్తమ పౌరులుగా ఎదగాలని రవికృష్ణ పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాలు, గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, అటువంటి దుర్వ్యసనాల బారినపడితే జీవితం అంధకారంగా మారుతుందని హెచ్చరించారు. నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్ స్టాన్సెస్ (ఎన్డీపీఎస్) చట్టం పట్ల విద్యార్థులు అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కేసుల్లో పట్టుబడిన వారికి 20 ఏళ్ల వరకు జైలుశిక్ష, రూ. 2 లక్షల వరకు జరిమానా విధించబడతాయని చెప్పారు. విద్యార్థులపై ఈ చట్టం కింద కేసు నమోదైతే జీవితం అంధకారంగా మారుతుందని అన్నారు.
ప్రతి ఒక్కరూ మాదకద్రవ్యాల వినియోగానికి, సరఫరాకు దూరంగా ఉండాలని సూచించారు. అనంతరం, విజయవాడ డీసీపీ కె.జి.వి. సరిత మాట్లాడుతూ.. జీవితంలో స్థిరపడి తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేర్చాలని, దేశ ప్రగతికి కృషి చేయాలని అన్నారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం విద్యా సంస్థల నిర్వాహకులు, విద్యార్థులు ముందుకు రావాలని కోరారు.ఈగల్ ఎస్పీ కె.నగేష్ బాబు ప్రసంగిస్తూ.. ఆతిధ్య రంగంలో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అపారమైన ఉపాధి అవకాశాలున్నాయని, ఈ రంగాన్ని కెరీర్ గా ఎంచుకున్న యునైటెడ్ కాలేజీ విద్యార్థులకు ఉన్నతమైన భవిష్యత్తు ఉంటుందని అన్నారు. నషా ముక్త్ భారత్ అభియాన్ లక్ష్య సాధనలో విద్యార్థులే కీలకమని నగేష్ బాబు పేర్కొన్నారు. యునైటెడ్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ అబ్దుల్ రజాక్ ప్రసంగిస్తూ.. తమ విద్యార్థులందరూ ఐక్యంగా అభివృద్ధి సాధించాలనే సంకల్పంతో, ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశామన్నారు. యునైటెడ్ అనే తమ కళాశాల పేరుకు సంస్కృత అర్థమైన ‘సంయుక్త’గా ఈ కార్యక్రమానికి నామకరణం చేశామని వివరించారు. విద్యార్థుల్లోని కళా నైపుణ్యాలను వెలికితీసి, వారిని బహుముఖ ప్రతిభావంతులుగా తీర్చిదిద్దటమే ‘సంయుక్త’ లక్ష్యమని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గెస్ట్ ఫ్యాకల్టీ అబ్దుల్ రెహమాన్, యునైటెడ్ కాలేజీ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ కరీమా, ప్రిన్సిపాల్ జగదీష్ జంపన, ఈవెంట్ మేనేజర్ ఉష, ఈగల్ ఇన్స్పెక్టర్ ఎం. రవీంద్ర, ఎస్సై ఎం.వీరాంజనేయులు, యునైటెడ్ కళాశాల ఫ్యాకల్టీ బృందం, లెక్చరర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ఇటీవల ఐపీఎస్ హోదా పొందిన ఎస్పీ నగేష్ బాబును యునైటెడ్ కాలేజీ యాజమాన్యం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీకి ‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’ పురస్కారం
- 40 మంది సభ్యులతో గవర్నర్ను కలవనున్న జగన్
- మిసెస్ ఎర్త్ ఇంటర్నేషనల్-2025గా విద్యా సంపత్
- న్యాయ వ్యవస్థలో ఓ దురదృష్టకరమైన ట్రెండ్ నడుస్తోంది: చీఫ్ జస్టిస్ సూర్యకాంత్
- కొత్త ఏఐ ఫీచర్.. వాయిస్ మెసేజ్లు ఇక టెక్ట్స్లో!
- వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా
- ఖతార్ అర్దాలో ఆకట్టుకున్న అమీర్..!!
- భారత్-సౌదీ మధ్య పరస్పర వీసా మినహాయింపు..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్లతో బీభత్సం..!!
- ముబారక్ అల్-కబీర్లో వాహనాలు స్వాధీనం..!!







