హ్యూస్టన్ లో దిగ్విజయవంతంగా జరిగిన '14వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు'
- August 23, 2025
హ్యూస్టన్: అమెరికా హ్యూస్టన్ మహానగరంలో ఆగస్టు 16–17 తేదీలలో జరిగిన 14వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు ఘనంగా ముగిసింది.వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి సంయుక్తంగా నిర్వహించిన ఈ సదస్సు తెలుగు భాషా, సాహిత్య ప్రాధాన్యంతో విశిష్టంగా నిలిచింది.
భారతదేశం నుంచి 15 మంది ప్రముఖ సాహితీవేత్తలు, అమెరికాలోని వివిధ నగరాల నుండి 75 మందికి పైగా సాహితీ ప్రేమికులు హాజరై, మొత్తం 28 వేదికల్లో సుమారు 250 మంది ఆహూతుల సమక్షంలో తెలుగు సాహిత్య సౌరభాన్ని పంచుకున్నారు.
సదస్సు హ్యూస్టన్‌లోని తెలుగు బడి, మన బడి ఉపాధ్యాయులకు గురువందన సత్కారాలతో ప్రారంభమైంది. పద్మభూషణ్ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ లాంఛనప్రాయంగా సభను ప్రారంభించగా, తొలిసారి అమెరికా విచ్చేసిన ప్రముఖ సినీ రచయిత బుర్రా సాయి మాధవ్ "సినిమా సాహిత్యం – తెలుగు భాష" అనే అంశంపై చేసిన ప్రధానోపన్యాసం శ్రోతలను ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా తరఫున వంగూరి చిట్టెన్ రాజు, గిరిజ దంపతులు కాలిఫోర్నియాలోని ఆర్య విశ్వవిద్యాలయం తెలుగు శాఖ పురోభివృద్ధి కోసం లక్ష డాలర్ల విరాళం ప్రకటించారు.ఆ చెక్కును విశ్వవిద్యాలయం డైరెక్టర్ రాజు చమర్తికి అందజేశారు. తెలుగు భాషా, సాహిత్యాల అభివృద్ధికి సంస్థలను బలోపేతం చేయాలనే చిట్టెన్ రాజు పిలుపుకు ఆచార్య యార్లగడ్డ, రాజు చమర్తి సమర్థంగా స్పందించారు.
రెండు రోజుల సదస్సులో 17 కొత్త తెలుగు గ్రంథాలు ఆవిష్కరించబడ్డాయి, అందులో ఐదు వంగూరి ఫౌండేషన్ ప్రచురణలు కావడం విశేషం. పాణిని జన్నాభట్ల ఆధ్వర్యంలో ‘అమెరికా కథ’ చర్చా వేదిక, విన్నకోట రవిశంకర్ నిర్వహించిన కవితా వేదిక, బుర్రా సాయి మాధవ్‌తో శాయి రాచకొండ నిర్వహించిన ముఖాముఖి, ఉరిమిండి నరసింహారెడ్డి, శారదా కాశీవజ్ఝల సమన్వయంలో సాహిత్య ప్రహేళికలు, కథారచన పోటీ వంటి అనేక ఆసక్తికర కార్యక్రమాలు సదస్సుకు విశిష్టత చేకూర్చాయి.
ఈ సందర్భంగా డాలస్‌కు చెందిన సాహితీవేత్త, తానా సాహిత్య వేదిక అధ్యక్షుడు డా. తోటకూర ప్రసాద్ గారికి వంగూరి ఫౌండేషన్ జీవన సాఫల్య పురస్కారం అందజేసి సత్కరించారు.
సదస్సులో ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, బుర్రా సాయి మాధవ్, ఈమని శివనాగిరెడ్డి, జీ. వల్లీశ్వర్, రాధిక మంగిపూడి, కోసూరి ఉమాభారతి, హరి మద్దూరి, జ్యోతి వలబోజు, ఇర్షాద్ జేమ్స్ తదితర 50 మందికి పైగా వక్తలు వివిధ వేదికల్లో ప్రసంగించారు. అదనంగా, అమెరికా డయాస్పోరా కథ షష్టిపూర్తి ప్రత్యేక వేదికలో కాత్యాయనీ విద్మహే, సి. నారాయణస్వామి, భాస్కర్ పులికల్ పాల్గొన్నారు.
సదస్సు విజయవంతం కావడానికి సహకరించిన వదాన్యులకు వంగూరి చిట్టెన్ రాజు, శ్రీకాంత్ రెడ్డి సభాముఖంగా కృతజ్ఞతలు తెలిపారు.నిర్వాహకవర్గ సభ్యులుగా శాయి రాచకొండ, దీప్తి పెండ్యాల, శ్రీనివాస్ పెండ్యాల, ఇంద్రాణి పాలపర్తి, కోటి శాస్త్రి తదితరులు సేవలందించారు.
రెండు రోజులపాటు సాగిన ఈ సదస్సు యూట్యూబ్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేయబడింది.

తాజా వార్తలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో
- ‘అరైవ్ అలైవ్’ లక్ష్యంతో సైబరాబాద్ పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్‌లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్‌లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!







