కళాతపస్వి కాశీనాధుని విశ్వనాధ్ గారు దంపతుల సంస్మరణ సభ

- August 23, 2025 , by Maagulf
కళాతపస్వి కాశీనాధుని విశ్వనాధ్ గారు దంపతుల సంస్మరణ సభ

హైదరాబాద్‌: కళాతపస్వి కాశీనాధుని విశ్వనాధ్ సంస్మరణ సభ శుక్రవారం సాయంత్రం శ్రీనగర్ కాలనీ, శ్రీ సత్యసాయి నిగమాగమమ్ ఆడిటోరియంలో ఘనంగా జరిగింది.ఈ సభను విశ్వనాధ్ గారి కుమారులు, కుమార్తె, మరియు కుటుంబ సభ్యులు నిర్వహించారు.

ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు "సంగీతము–విశ్వనాధ్" అనే అంశంపై ప్రధాన ప్రసంగం చేశారు. సంగీతం మానవులనే కాదు, పశుపక్ష్యాదులను సైతం ఎంత ప్రభావితం చేస్తుందో సోదాహరణలతో వివరిస్తూ, విశ్వనాధ్ సంగీత-నృత్య కళలను ఆస్వాదించి, అనుభవించి, సినీ మాధ్యమం ద్వారా పండిత పామరులను ఎలా ఆకట్టుకున్నారో విశదీకరించారు. ఆయన ప్రసంగం గంటకు పైగా కొనసాగి శ్రోతలను తన్మయులను చేసింది.

సభకు ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరై విశ్వనాధ్ గారిపట్ల తమ గౌరవాన్ని వ్యక్తపరిచారు. మాజీ న్యాయమూర్తి యల్.వి. సుబ్రహ్మణ్యం, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, నటుడు తనికెళ్ళ భరణి, పార్ధసారథి తదితరులు సభను అలంకరించారు.

సత్యసాయి ఆడిటోరియం విశ్వనాధ్ అభిమానులతో నిండిపోయింది.చాగంటివారు తన ప్రసంగంలో త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి, రామయ్య, వెంకటరమణయ్య, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, హరి నాగభూషణం, పారుపల్లి తదితర మహానుభావుల ప్రస్తావన చేస్తూ, విశ్వనాధ్ సినిమాల్లో శాస్త్రీయ సంగీత ప్రభావాన్ని తెరపై చూపించారు.

విశ్వనాధ్ దర్శకత్వంలో వేటూరి వంటి సినీ గేయ రచయితల ప్రతిభ ఎలాంటి శోభను సంతరించుకుందో చాగంటివారు ప్రస్తావించినప్పుడు సభలోని శ్రోతలు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఎన్నోసార్లు విన్న పాటలకే ఆయన కొత్త కోణాలను ఆవిష్కరించడంతో అందరూ మంత్రముగ్ధులయ్యారు.

ఈ సభలో పాల్గొన్న అభిమానులు తీవ్ర ఉద్వేగానికి లోనై, విశ్వనాధ్ గురించిన జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. మన కాలంలో విశ్వనాధ్ ఉండటం, ఆయన ఉన్నత సంస్కార స్ఫూర్తితో సృష్టించబడిన చిత్రాలను చూడటానికి అవకాశం దక్కటం ప్రతి తెలుగు వానికి గర్వకారణమని సభలో పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com