విజయవాడలో నారెడ్కో 11వ అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్

- August 25, 2025 , by Maagulf
విజయవాడలో నారెడ్కో 11వ అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్

విజయవాడ:: కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ది మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నారెడ్కో సెంట్రల్ జోన్ 11వ అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్‌ను విజయవాడసి ‘ఏ’ కన్వెన్షన్‌లో సెప్టెంబర్ 19 నుండి 21 వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. సోమవారం నగరంలోని మాలక్ష్మి ఛాంబర్స్ లో నిర్వహించిన మీడియాకు సమావేశంలో వివరాలను ప్రకటించారు. మూడు రోజులపాటు జరిగే ఈ ప్రాపర్టీ ఎక్స్‌పో గృహ కొనుగోలుదారులు, స్ధిరాస్తి వ్యాపార రంగానికి చెందిన వారికి సంయిక్త వేదికగా నిలవనుంది. ఈ ఫెస్టివల్‌లో 60కుపైగా ఎగ్జిబిటర్స్ పాల్గొనబోతున్నారు. వీరిలో విశ్వసనీయ రియల్ ఎస్టేట్ డెవలపర్లు, హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలు, ఇంటీరియర్స్,  బిల్డింగ్ మెటీరియల్ బ్రాండ్లు, ఆర్కిటెక్ట్‌లు, కన్సల్టెంట్లు, బ్యాంకులు ఇతర అనుబంధ సేవల విభాగాలు ఉంటాయి.ఈ ఎక్స్‌పో ద్వారా విజయవాడ, ప్రజా రాజధాని అమరావతి పరిసర ప్రాంత ప్రజలు తమ బడ్జెట్‌కు అనుగుణంగా అన్ని రకాల ఆమోదం పొందిన రెసిడెన్షియల్ ప్రాజెక్టులను సరిచూసుకుని ఎంచుకునే అవకాశం ఉంది. బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ భాగస్వాములతో నేరుగా చర్చించి తక్షణ సలహాలు పొందవచ్చు. ఇంటీరియర్ సొల్యూషన్స్, హోమ్ ఇంప్రూవ్‌మెంట్ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉండనుండగా,  నగర వాసులు తమ సొంత ఇంటి కలను సాకారం చేసుకోవచ్చు.

ఈ సందర్భంగా నారెడ్కో సెంట్రల్ జోన్ అధ్యక్షుడు సందీప్ మండవ మాట్లాడుతూ నారెడ్కో 11వ అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్ ద్వారా పారదర్శకత, ప్రాక్టికల్ ఫైనాన్స్ సపోర్ట్ ఆలంబనగా గృహ కొనుగోలుదారులను క్రమబద్ధమైన మార్గదర్శకత్వం అందించేందుకు కట్టుబడి ఉందన్నారు. విశ్వసనీయ డెవలపర్లు, స్పష్టమైన ప్రాజెక్ట్ ఆప్షన్లు, తక్షణ ఫైనాన్షియల్ సహాయం అన్నింటినీ ఒకే గొడుగు కిందకి తీసుకురావటం ప్రాపర్టీ షో ప్రత్యేకత అన్నారు.  విజయవాడ-అమరావతి రియల్ ఎస్టేట్ రంగం తదుపరి వృద్ధి దశలోకి అడుగిడుతోందని, ప్రజలు ధైర్యంగా, తగిన సమాచారం ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయం అని సందీప్  మండవ పేర్కొన్నారు. అలాగే గత సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న సానుకూల చర్యలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నాలా చట్టం రద్దు, లేఅవుట్ డెవలప్‌మెంట్,  బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ నిబంధనల సడలింపు, విభిన్న అనుమతుల పరంగా వేగవంతమైన మంజూరు వంటి నిర్ణయాలు పరిశ్రమకు మేలు చేశాయని వివరించారు. 

రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కిరణ్ పరుచూరి మాట్లాడుతూ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, పాలసీ స్పష్టత, మౌలిక వసతుల అభివృద్ధి తద్వారా ప్రాజెక్టుల సమయానుకూల నిర్మాణంతో కొనుగోలుదారుల నమ్మకానికి అనుకూల వాతావరణం ఏర్పడిందన్నారు. టైటిల్ స్పాన్సర్ ఎస్‌ఎల్‌వి డెవలపర్స్ చైర్మన్ పెన్మత్స శ్రీనివాస రాజు మాట్లాడుతూ హోమ్ బయ్యర్స్‌కు నేరుగా సేవలందించే ఈ ఈవెంట్‌లో భాగస్వామ్యం కావటం గర్వంగా ఉందని,  మా ప్రీమియమ్ కమ్యూనిటీలను ఈ ఫెస్టివల్‌లో ప్రదర్శించి, ప్రత్యేక మార్గదర్శకతను అందిస్తామని తెలిపారు. నారెడ్కో సెంట్రల్ జోన్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ హరి ప్రసాద్ వేదిక వద్ద ఉండే వినియోగదారులకు అందుబాటులో ఉండే  సౌకర్యాలను వివరించారు. ఇందులో ప్రాజెక్ట్ జోన్లు, బ్యాంకులు, ఫైనాన్షియర్ డెస్క్‌లు, ఇంటీరియర్స్ ఎగ్జిబిషన్, కొనుగోలు దారుల సలహా కౌంటర్లు, రిజిస్ట్రేషన్ వంటి సదుపాయాలు ఉంటాయన్నారు. 

ఈ ప్రాపర్టీ ఫెస్టివల్ విజయవాడ–అమరావతి రియల్ ఎస్టేట్ భవిష్యత్తు, వివిధ ఆదాయ వర్గాల కోసం గృహ ఎంపికలు, తొలి సారి గృహం కొనుగోలు చేయదలచిన వారికి ఆర్థిక సహాయం, సలహా వంటి అంశాలపై చర్చలకు ముఖ్య వేదికగా నిలవనుంది. అలాగే, ప్రభుత్వం, పరిశ్రమ కలసి రియల్ ఎస్టేట్ రంగానికి అనుకూల వాతావరణం సృష్టించడంలో చేసిన ప్రయత్నాలను ఈ ఫెస్టివల్ హైలైట్ చేయనుంది. ప్రాపర్టీ షో కు ఉచిత ప్రవేశం కల్పించామని,  ‘ఏ’ కన్వెన్షన్ వద్ద తక్షణ రిజిస్ట్రేషన్ సదుపాయం అందుబాటులో ఉందని నిర్వాహకులు ప్రకటించారు. కార్యక్రమంలో నారెడ్కో రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి వంశీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com