సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్

- September 18, 2025 , by Maagulf
సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్

న్యూ ఢిల్లీ: గత 11 ఏళ్లలో భారతదేశ విమానయాన రంగం అద్భుతమైన వృద్ధిని సాధించిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. 2014లో కేవలం 11 కోట్లుగా ఉన్న విమాన ప్రయాణికుల సంఖ్య 2025 నాటికి 25 కోట్లకు చేరిందని ఆయన వెల్లడించారు.ఇది విమానయాన రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని హిండన్ విమానాశ్రయంలో దేశవ్యాప్త ‘యాత్రి సేవా దివస్ 2025’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రయాణికులకు ప్రపంచస్థాయి సేవలు, అత్యుత్తమ ప్రయాణ అనుభూతిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. “గత 11 ఏళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీ దేశానికి ‘ప్రధాన సేవకుడిగా’ పాలనను మార్చేశారు. ఆయన స్ఫూర్తితోనే మేము ప్రతి ప్రయాణికుడిని మా ప్రాధాన్యతగా భావిస్తున్నాం” అని రామ్మోహన్ నాయుడు అన్నారు.

ప్రధాని మోదీ నాయకత్వంలో విమాన ప్రయాణం కేవలం ఉన్నత వర్గాలకే పరిమితం కాకుండా, సామాన్య ప్రజలకు కూడా అందుబాటులోకి వచ్చిందని మంత్రి వివరించారు. ‘ఉడాన్’ వంటి పథకాల ద్వారా విమాన ప్రయాణం చౌకగా, సులభంగా మారిందన్నారు. ఉదాహరణకు, హిండన్ విమానాశ్రయం నుంచి 2020లో కేవలం ఒక్క సర్వీసు ఉండగా, ఇప్పుడు 16 నగరాలకు విమానాలు నడుస్తున్నాయని తెలిపారు.

డిజిటల్ సేవలు, ఆత్మనిర్భర్ భారత్
‘డిజిటల్ ఇండియా మిషన్’లో భాగంగా అతి త్వరలో దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో వైఫై సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన కీలక ప్రకటన చేశారు. ఆత్మనిర్భర్ భారత్ పునాదులపై వికసిత భారత్ నిర్మించడమే లక్ష్యమని, దీని కోసం విమానయాన రంగంలోని భాగస్వాములందరూ స్థానిక ఉత్పత్తులనే ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com