సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం

- September 26, 2025 , by Maagulf
సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం

హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పారు. వచ్చే ఏడాది నుంచి తెలంగాణ రాష్ట్రంలో సీఎం బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ‘విద్యలో ముందంజలో తమిళనాడు’ అనే కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశారు.

తమిళనాడులోని ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలల్లో అమలు చేస్తున్న ‘సీఎం బ్రేక్ ఫాస్ట్’ పథకం తన హృదయాన్ని తాకింది. వచ్చే ఏడాది నుంచి తెలంగాణలో కూడా ఈ పథకాన్ని ప్రారంభిస్తాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.

నర్సరీ నుంచి ఎల్‌కేజీ, యూకేజీ విద్యార్థులకు కూడా అడ్మిషన్లు వచ్చే ఏడాది నుంచి తెలంగాణలో ప్రవేశపెడుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. విద్యను మరింత బలోపేతం చేయడానికి ఉత్తమ ప్రపంచ స్థాయి యూనివర్శిటీలను తెలంగాణకు తీసుకొస్తున్నామని చెప్పారు.

తమిళనాడు రాష్ట్రంలో మాదిరిగానే తెలంగాణలోనూ విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్న సీఎం రేవంత్.. అందుకోసమే విద్యాశాఖ తనవద్దే పెట్టుకున్నానని చెప్పారు. తెలంగాణలో ప్రతీయేటా 1.10 లక్షల మంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు బయటికి వస్తున్నారు. వారికి ఉద్యోగాలు రావట్లేదని, నైపుణ్యాలు లేకపోవడంతోనే ఇలా జరిగిందని అన్నారు.

యంగ్ ఇండియా పథకం ద్వారా స్కిల్స్ యూనివర్శిటీని పీపీపీ విధానంలో తెచ్చామని తెలిపారు. తొలి విడతగా 20వేల మందిలో నైపుణ్యాలు పెంచి 100శాతం ఉద్యోగాలు వచ్చేలా చేశామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.

ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అని విద్యార్థులను వేరు చేయకుండా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను పెట్టి అంతా ఒకే గొడుగు కింద నేర్చుకునేలా చేశామని, టాటా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని ఐటీఐలను అడ్వాన్సుడ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చి అధునాతన శిక్షణ ఇప్పిస్తున్నామని అన్నారు. ఇక్కడ శిక్షణ పొందే విద్యార్థులకు వచ్చే ఏడాది నుంచి రూ.2వేలు ఉపకార వేతనాన్ని ఇవ్వనున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com