తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- September 29, 2025
అబుదాబి: తెలంగాణ సంప్రదాయానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను యూఏఈలోని ప్రవాస తెలంగాణీయులు అబుదాబిలో అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఇండియా సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ వేదికగా, తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ సంబరాలు ఘనంగా జరిగాయి. ఎడారి ప్రాంతమైన అబుదాబిలో పూలు దొరకడం కష్టమైన నేపథ్యంలో, సంఘ నాయకత్వం ప్రత్యేకంగా తెలంగాణ నుండి వందలాది కిలోల పూలను తెప్పించి నగరాన్ని పూల వనంగా మార్చారు. శనివారం రాత్రి ఉదయం సామూహిక బతుకమ్మ తయారీతో కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి యు.ఏ.ఈ.లోని భారత రాయబార కార్యాలయం నుండి జార్జీ జార్జ్ (First Secretary, Community Welfare and Coordination) ముఖ్య అతిథిగా విచ్చేసి, తెలంగాణ సంస్కృతిని ప్రశంసించారు. ఆయన ప్రవాస భారతీయుల సాంస్కృతిక అంకితభావాన్ని కొనియాడుతూ, “ఇలాంటి ఉత్సవాలు భారతీయతను ప్రపంచానికి పరిచయం చేస్తాయి” అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమానికి ఇండియా సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ గౌరవ అధ్యక్షుడు జయచంద్రన్ నాయర్, గౌరవ ఉపాధ్యక్షుడు షాజీ వి.కె., కర్ణాటక రాష్ట్ర సంఘం అధ్యక్షుడు సర్వోత్తమ్ శెట్టి, మహారాష్ట్ర మండల్ అధ్యక్షుడు విజయ్ మానె, బీహార్ మరియు ఝార్ఖండ్ సంఘ అధ్యక్షుడు దివాకర్ ప్రసాద్, ఇండియా ఫర్ ఆర్ట్ అండ్ కల్చర్ సంఘ అధ్యక్షుడు వినాయక్ ఆవాటే, సంపంగి మరియు బ్యుటికా సంస్థల యాజమాన్యం ప్రత్యేక అతిథులుగా పాల్గొని, ప్రవాస తెలంగాణీయుల సాంస్కృతిక చైతన్యాన్ని అభినందించారు.అలాగే, తమిళ సంఘం, మలయాళి సంఘం, కన్నడ సంఘం, మరాఠీ సంఘం, గుజరాతీ సంఘం, పంజాబీ సంఘం తదితర రాష్ట్ర సంఘాల ప్రతినిధులు ప్రత్యేక అతిథులుగా విచ్చేసి, బతుకమ్మ ఉత్సవాన్ని తమ హాజరుతో మరింత వైభవవంతం చేశారు. భారతీయ సమైక్యతకు ప్రతీకగా, వారు తమ సంఘాల తరపున శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా యూఏఈలో ఉన్న తెలుగు మీడియా సంస్థ యాజమాన్యం శ్రీకాంత్ మరియు సౌమ్య దంపతులను తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ వారు సత్కరించారు. ప్రముఖ కవి, గాయకుడు డా.కోకిల నాగరాజు మరియు యువ గాయని సోనీ యాదర్ల ప్రత్యేకంగా ఇండియా నుండి విచ్చేసి తమ బతుకమ్మ ఆట పాటలతో అందరినీ ఉర్రూతలూగించారు.డప్పు వాయిద్యాలు, కోలాటాలతో బతుకమ్మ ప్రాంగణం మరో తెలంగాణ ను తలపించింది. అందమైన బతుకమ్మలకు, ముందుగా వచ్చిన బతుకమ్మలకు, నాట్యం చేసిన మహిళలకు, అందంగా ముస్తాబైన చిన్నారులకు బహుమతులు అందజేశారు.ఇండియా నుండి తెప్పించిన పిండి వంటలు—అరిసెలు, గారెలు, బోబట్ల వంటి వంటకాలు—అందరినీ ఆకట్టుకున్నాయి. బతుకమ్మ సంబరాలు ప్రతి సంవత్సరం మరింత ప్రాశస్త్యం పొందుతూ అందరి మన్ననలు పొందుతున్నందుకు కార్యవర్గానికి ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని కార్య నిర్వాహకులు రాజా శ్రీనివాస రావు, గంగారెడ్డి, వంశీ, సందీప్, గోపాల్, సతీష్, పావని, అర్చన, దీప్తి, పద్మజ తదితరులు తెలియ జేశారు “విదేశాల్లో కూడా బతుకమ్మను ఇంత ఘనంగా జరుపుకోవడం ఎంతో గర్వకారణం” అని నిర్వాహకులు తెలిపారు.









తాజా వార్తలు
- భారత్ ఫస్ట్ స్లీపర్ AC కోచ్, 5-స్టార్ హోటల్ కూడా తలదించాల్సిందే!
- సర్ (SIR) ప్రక్రియ: ఓటరు జాబితా ప్రక్షాళనలో కీలక అడుగు
- యోగాను నిత్యజీవితంలో భాగం చేసుకోవాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- మచిలీపట్నం బస్‌స్టాండ్ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఉండవల్లి గుహల వద్ద బాబా రామ్‌దేవ్ యోగాభ్యాసం
- ముంబై ఐఐటీ క్యాంపస్‌లో చిరుతపులి కలకలం
- బ్యాంకింగ్ రంగంలో దివ్యాంగుల హక్కుల ఉల్లంఘనపై UBIDEF ఆందోళన
- యూఏఈలో ఎండలు మండుతున్నాయి..49.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు
- కువైట్‌లో యోగా వేడుకల్లో 2,200 మందికి పైగా భాగస్వామ్యం..!!
- అమెరికా-ఇరాన్ ఒప్పందాన్ని స్వాగతించిన సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!







