ఐపీఎల్ మినీ వేలానికి ముహూర్తం ఫిక్స్

- October 10, 2025 , by Maagulf
ఐపీఎల్ మినీ వేలానికి ముహూర్తం ఫిక్స్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)19వ ఎడిషన్ కోసం మినీ వేలం పద్ధతులు మొదలవబోతున్నాయి. ఈసారి కూడా పెద్ద సంఖ్యలో క్రికెటర్లు ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ (ఐపీఎల్ జీడబ్ల్యూసీ) ఇప్పటికే ఈ మినీ వేలం గురించి ప్రాథమిక సమాచారాన్ని ఫ్రాంచైజీలకు పంపించింది.

ఆటగాళ్ల వేలం ప్రక్రియ డిసెంబర్ 14న జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అవసరమైతే డిసెంబర్ 13న కూడా నిర్వహించేందుకు వీలుగా ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ మేరకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ వర్గాలు ఫ్రాంచైజీలకు ప్రాథమిక సమాచారం అందించినట్లు వార్తలు వస్తున్నాయి.

గత రెండు సీజన్లుగా విదేశాల్లో జరుగుతున్న వేలంపాట, ఈసారి మళ్లీ స్వదేశానికి తిరిగి రానుంది. గతంలో దుబాయ్, జెడ్డాలలో వేలం నిర్వహించగా, ఈసారి భారత్‌లోనే జరపాలని నిర్వాహకులు భావిస్తున్నారు. వేలానికి ఆతిథ్యం ఇచ్చే నగరాల జాబితాలో ముంబై, బెంగళూరు ముందువరుసలో ఉన్నాయి.

డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న ఆర్సీబీ
ఆటగాళ్ల రిటెన్షన్‌కు సంబంధించి ఫ్రాంచైజీలు తమ తుది జాబితాను నవంబర్ 15లోగా సమర్పించాల్సి ఉంటుంది.గత సీజన్‌లో ఫాఫ్ డుప్లెసిస్‌ ను వదులుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ రజత్ పాటిదార్ కెప్టెన్సీలో తొలిసారి టైటిల్‌ను ముద్దాడింది.

డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న ఆర్సీబీ, తమ జట్టును మరింత పటిష్టం చేసుకునేందుకు ఈ వేలంపై దృష్టి సారించనుంది.మరోవైపు, గత సీజన్‌లో పేలవ ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లకు ఈ వేలం కీలకంగా మారింది.

కొత్త ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు సీఎస్‌కే
వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్‌కు వీడ్కోలు పలకడంతో చెన్నై పర్సులో భారీగా డబ్బు చేరనుంది. దీంతో కొత్త ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు సీఎస్‌కేకు మంచి అవకాశం లభించింది.

ఇక రాజస్థాన్ రాయల్స్ తమ కెప్టెన్ సంజూ శాంసన్‌ను ట్రేడింగ్ ద్వారా మరో జట్టుకు పంపే ఆలోచనలో ఉన్నట్లు వస్తున్న వార్తలు ఆసక్తిని రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ జట్టు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com