రేపు విజయవాడలో భారీ వర్షాలు

- October 27, 2025 , by Maagulf
రేపు విజయవాడలో భారీ వర్షాలు

అమరావతి: మొంథా తుఫాన్ ప్రభావం కారణంగా రాబోయే 24 గంటల్లో విజయవాడ నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. 16 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే ప్రమాదం ఉందని సూచించింది. నగరంలో లోతట్టు ప్రాంతాలు నీటితో మునిగే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం విజ్ఞప్తి చేస్తోంది. ముఖ్యంగా అత్యవసర అవసరం తప్ప ఇతర పనుల కోసం బయటకు రాకూడదని అధికారులు పిలుపునిచ్చారు.

భారీ వర్షాల కారణంగా రవాణా వ్యవస్థకు ఆటంకం కలగవచ్చని, వంతెనలు, కాల్వలు, నదీ తీర ప్రాంతాల్లో ప్రజలు వెళ్లవద్దని సూచించారు. మెరుపు, ఈదురుగాలుల ప్రమాదం కూడా ఉన్నందున విద్యుత్ స్తంభాలు, చెట్ల కింద ఆశ్రయం తీసుకోవద్దని హెచ్చరించారు. నగరంలోని ట్రాఫిక్ పోలీస్, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉండగా, మురికి నీరు చేరే ప్రాంతాల్లో మున్సిపల్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. తుఫాన్ తీవ్రత పెరిగితే దుకాణాలు, మాల్స్ తాత్కాలికంగా మూసివేయాల్సి రావచ్చని చెప్పారు.

మనుగడ సేవలు మాత్రం కొనసాగుతాయని అధికారులు చెప్పారు. మెడికల్ షాపులు, కిరాణా, కూరగాయల దుకాణాలు, పాలు సరఫరా సాధారణంగానే ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో వెంటనే కలెక్టరేట్ కంట్రోల్ రూమ్‌కు సంప్రదించవచ్చని వివరించారు. కంట్రోల్ నంబర్: 9154970454. ప్రజలు పుకార్లను నమ్మకుండా ప్రభుత్వ అధికారిక సూచనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com