ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష

- November 04, 2025 , by Maagulf
ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష

అమరావతి: వివిధ దేశాల్లో కీలక స్థానాల్లో పని చేస్తున్న ఎన్నారైలతో ఓ క్లబ్ ఏర్పాటు చేసి, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అన్ని అవకాశాలను వారికి వివరించి, వారి ద్వారా పెట్టుబడులను ఆకర్షించే దిశగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు.

విదేశాల్లో స్థిరపడిన పారిశ్రామిక వేత్తలను రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విధంగా ప్రోత్సహించాలని, పారిశ్రామిక విధానాన్ని వారికి అర్ధమయ్యే విధంగా, ప్రభుత్వం అమలు చేసే వివిధ కార్యక్రమాలను వారికి వివరిస్తూ, పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను ఎన్నారై క్లబ్ ద్వారా నిర్వహించాలని మంత్రి సూచించారు. విదేశీ సంస్థలలో కీలక స్థానాలలో పనిచేసే ముఖ్య కార్యనిర్వహణాధికారులు, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్లు, చీఫ్ టెక్నికల్ ఆఫీసర్లను ఈ క్లబ్ లో భాగస్వాములను చేయాలని తెలిపారు.

ఇదే సమయంలో ఏపీ ఎన్నార్టీ అధ్యక్షుడు,ముఖ్య కార్య నిర్వహాణ అధికారి ఈ పెట్టుబడులను ఆకర్షించే విషయంలో శక్తివంచన లేకుండా కృషి చేయాలని మంత్రి పేర్కొన్నారు. అదే విధంగా ఎగుమతిదారులు, దిగుమతి దారులతో సైతం ఓ క్లబ్ ఏర్పాటు చేసి, ఎగుమతి దారులు అందరినీ ఓ గొడుగు కింద, అలాగే దిగుమతిదారులను ఓ గొడుకు కిందకు తీసుకువచ్చి, ఎగుమతులు, దిగుమతులలో ఉన్న మెళుకువలను తెలియజేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎగుమతులను ప్రోత్సహించాలని మంత్రి పలు సూచనలు చేసారు. 135 దేశాల్లో ఉన్న తెలుగువారికి ఎగుమతులు, దిగుమతులపై స్పష్టమైన అవగాహన పెంపొందించడం ద్వారా, రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే వివిధ రంగాల్లోని వస్తువులను డిమాండ్ పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు.

అమరావతిలో నిర్మించ తలపెట్టిన ప్రవాసాంధ్రుల ఐకానిక్ టవర్ నిర్మాణ పనుల పురోగతిపై మంత్రి సమీక్షించారు.ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్నార్టీ అధ్యక్షులు వేమూరి రవి కుమార్, సీఈఓ కృష్ణ మోహన్ తదితరులు పాల్గొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com