విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం

- November 04, 2025 , by Maagulf
విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం

న్యూ ఢిల్లీ: భారతీయ విమాన ప్రయాణికులకు శుభవార్త అందింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) తాజాగా ఒక కీలక ప్రతిపాదనను ప్రకటించింది. దీని ప్రకారం, ఇకపై ప్రయాణికులు తమ విమాన టిక్కెట్లను బుకింగ్ చేసిన 48 గంటల లోపు ఎటువంటి అదనపు రుసుము లేకుండా రద్దు చేయవచ్చు లేదా తేదీ మార్చుకోవచ్చు.

ఇప్పటివరకు విమానయాన సంస్థలు టికెట్ రద్దు లేదా మార్పులపై భారీ ఫీజులు వసూలు చేయడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.DGCA తీసుకొచ్చిన ఈ కొత్త ప్రతిపాదన ఆ సమస్యలను తగ్గించనుంది.

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రతిపాదన ప్రకారం, దేశీయ ప్రయాణాల కోసం 5 రోజుల ముందుగా బుక్ చేసిన టిక్కెట్లు, అంతర్జాతీయ ప్రయాణాల కోసం 15 రోజుల ముందుగా బుక్ చేసిన టిక్కెట్లకు ఈ సౌకర్యం వర్తిస్తుంది. 48 గంటల లోపు టికెట్ రద్దు లేదా తేదీ మార్పు చేసుకుంటే, రద్దు ఛార్జీలు పూర్తిగా మాఫీ అవుతాయి. అయితే, కొత్త టికెట్ ధర ఎక్కువైతే కేవలం ఆ తేడాను మాత్రమే చెల్లించాలి.

టిక్కెట్లు ఏజెంట్ లేదా ఆన్‌లైన్ ట్రావెల్ పోర్టల్ ద్వారా కొనుగోలు చేసినప్పటికీ, రీఫండ్ బాధ్యత ఎయిర్‌లైన్‌దే అని స్పష్టం చేసింది. ఏజెంట్లు విమానయాన సంస్థల అధికార ప్రతినిధులుగా పరిగణించబడతారు కాబట్టి, రీఫండ్ ఆలస్యమైతే ప్రయాణికులు నేరుగా ఎయిర్‌లైన్‌ను సంప్రదించవచ్చు.

మార్గదర్శకాలు ప్రకారం, అన్ని ఎయిర్‌లైన్‌లు రీఫండ్ ప్రక్రియను 21 పని దినాల్లోపు పూర్తిచేయాలి. ఆరోగ్య సమస్యలు లేదా అత్యవసర పరిస్థితుల కారణంగా ప్రయాణం రద్దు చేస్తే, విమానయాన సంస్థలు పూర్తి రీఫండ్ లేదా క్రెడిట్ షెల్ జారీ చేయవచ్చు. అదేవిధంగా, టికెట్ బుకింగ్ చేసిన 24 గంటల్లోపే పేరులో చిన్న పొరపాట్లు ఉంటే, ఎయిర్‌లైన్‌లు ఉచిత సవరణ చేసే అవకాశం ఇవ్వాలి అయితే ఇది ఎయిర్‌లైన్ అధికారిక వెబ్‌సైట్‌లో నేరుగా బుక్ చేసిన టిక్కెట్లకే వర్తిస్తుంది. ఈ ప్రతిపాదనపై నవంబర్ 30 వరకు ప్రజల సూచనలు తీసుకున్న తర్వాత, కొత్త నియమాలు అధికారికంగా అమల్లోకి రానున్నాయి. ఈ మార్పులు అమలైతే, భారతదేశంలో విమాన ప్రయాణం మరింత పారదర్శకంగా మరియు ప్రయాణికులకు అనుకూలంగా మారనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com