డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక

- November 04, 2025 , by Maagulf
డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక

న్యూ ఢిల్లీ: దేశవ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు కొత్త రకమైన(NPCI) మోసాలను అవలంబిస్తున్నారు. ఇప్పుడు వారు డిజిటల్ అరెస్ట్ పేరుతో ప్రజలను భయపెట్టి డబ్బులు దోచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

సైబర్ నేరగాళ్లు తమను పోలీసు, సీబీఐ,(CBI) ఆదాయ పన్ను లేదా కస్టమ్స్ అధికారులుగా పరిచయం చేసుకుంటూ, బాధితులను వీడియో కాల్స్ ద్వారా మోసం చేస్తున్నారు. వీడియోలో నకిలీ పోలీస్ స్టేషన్లు, లోగోలు, యూనిఫాంలతో కూడిన బ్యాక్‌డ్రాప్‌లు ఉపయోగించి నిజమైన అధికారుల్లా నటిస్తున్నారు.

మొదట బాధితులకు ఫోన్ కాల్ చేసి, తర్వాత వీడియో కాల్(NPCI) ద్వారా వారిని నమ్మించడానికి ప్రయత్నిస్తారు. వారి పేరుతో మనీ లాండరింగ్, పన్ను ఎగవేత లేదా డ్రగ్స్ కేసులు నమోదయ్యాయని చెబుతారు. వెంటనే అరెస్ట్ చేస్తామని, కేసు నుంచి తప్పించుకోవాలంటే కొంత డబ్బు చెల్లించాలని ఒత్తిడి తెస్తారు.

విచారణకు సహకరించాలి, మీ పేరు క్లియర్ అవుతుంది, ఇది రిఫండబుల్ డిపాజిట్ మాత్రమే అనే పేర్లతో డబ్బు బదిలీ చేయించుకుంటారు. కొన్ని సందర్భాల్లో వీడియో కాల్ నేపథ్యాల్లో పోలీస్ స్టేషన్ శబ్దాలు కూడా వినిపించేలా చేస్తారు.

ఎన్పీసీఐ ప్రకారం, ఏ ప్రభుత్వ సంస్థ లేదా దర్యాప్తు ఏజెన్సీ ఫోన్ లేదా వీడియో కాల్స్ ద్వారా విచారణ చేయదు, డబ్బు అడగదు. అలాంటి అనుమానాస్పద కాల్స్ వస్తే వెంటనే కాల్ కట్ చేయాలి మరియు ఆ నంబర్ వివరాలను ధృవీకరించుకోవాలి. మోసపూరిత కాల్స్ లేదా మెసేజ్‌లు వచ్చినప్పుడు, సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు ఫిర్యాదు చేయాలని లేదా ‘సంచార్ సాథి’ పోర్టల్ ద్వారా నివేదించాలని సూచించింది. అలాగే, మోసగాళ్లతో జరిగిన సంభాషణలు, స్క్రీన్‌షాట్‌లు, మెసేజ్‌లను భద్రపరచుకోవడం ద్వారా పోలీసులకు సాక్ష్యాలు అందించడం సులభమని NPCI వివరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com