హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్

- November 05, 2025 , by Maagulf
హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారి (NH-65) విస్తరణ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రవాణా రంగంలో కీలకమైన అభివృద్ధి దిశగా అడుగుపెట్టినట్లైంది. ఈ రహదారి హైదరాబాద్‌, సూర్యాపేట, నందిగామ, విజయవాడలను కలుపుతూ అత్యంత రద్దీగా ఉండే రూట్‌గా ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం నాలుగు లేన్లుగా ఉన్న ఈ మార్గాన్ని ఆరు లేన్లుగా విస్తరించేందుకు కేంద్ర రహదారి, రవాణా మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. మొత్తం 40 కిలోమీటర్ల నుండి 269 కిలోమీటర్ల మధ్య ఉన్న సుమారు 229 కిలోమీటర్ల దూరాన్ని విస్తరించే ఈ ప్రాజెక్టు పూర్తయ్యాక, హైదరాబాద్‌–విజయవాడ మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. అంతేకాదు, సరుకు రవాణా వేగం పెరగడం వల్ల ఆర్థిక కార్యకలాపాలు మరింత ఉత్సాహాన్ని సంతరించుకోనున్నాయి.

ఈ ప్రాజెక్టు కోసం సుమారు రూ.10వేల కోట్లకు పైగా వ్యయమవుతుందని అంచనా. ఇందులో పెద్ద భాగం భూసేకరణకు కేటాయించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో నందిగామ, కంచికచర్ల, జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, ఇబ్రహీంపట్నం, విజయవాడ పరిధిలోని 34 గ్రామాల్లో భూములను సేకరించేందుకు ఇప్పటికే సర్వే ప్రక్రియ మొదలైంది. ఇదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా సూర్యాపేట జిల్లా పరిధిలోని పలు ప్రాంతాల్లో భూసేకరణ కోసం అధికారులు నియమించబడ్డారు. రైతులకు సరైన పరిహారం అందించేందుకు కేంద్రం, రాష్ట్రాలు సంయుక్తంగా పనిచేయనున్నాయని సమాచారం. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఈ మార్గం ఒక ఆర్థిక కారిడార్‌గా మారి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య వాణిజ్య, పరిశ్రమల అభివృద్ధికి మరింత ఊతం ఇవ్వనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com