అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత

- November 11, 2025 , by Maagulf
అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందురోజే ఢిల్లీలో జరిగిన బాంబు పేలుడు దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఎర్రకోట సమీపంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోవడంతో భద్రతా విభాగాలు అలర్ట్ అయ్యాయి. ఎన్నికల సమయంలో దేశ రాజధానిలో ఇలాంటి దాడి జరగడం ఆందోళనకు గురిచేస్తోంది.

ఈ నేపథ్యంలో బీహార్‌ ఎన్నికల రెండో దశ పోలింగ్ జరుగుతున్నందున, భద్రతా కారణాల రీత్యా బీహార్‌ రాష్ట్రానికి ఆనుకుని ఉన్న అంతర్జాతీయ సరిహద్దులను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. రాష్ట్ర డీజీపీ వినయ్ కుమార్ తెలిపిన ప్రకారం, ఈ మూసివేత 72 గంటల పాటు కొనసాగనుంది.

ప్రస్తుతం బీహార్‌లో రెండో దశ పోలింగ్ కొనసాగుతుండగా, మధ్యాహ్నం 3 గంటల వరకు సుమారు 60.04 శాతం మంది ఓటు వేశారు. జన్‌సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్, మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ వంటి ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించారు. మొత్తం 20 జిల్లాల్లోని 122 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ దశలో 3.7 కోట్ల మంది ఓటర్లు పాల్గొంటుండగా, 45 వేలకు పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు నవంబర్ 14న జరగనుంది.

ఇక ఎర్రకోట పేలుడు ఘటనపై కేంద్ర ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా స్పందించింది. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కి అప్పగిస్తూ హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. దాడి వెనుక ఉన్న కుట్ర, నిందితుల వివరాలు త్వరలో వెలుగులోకి రానున్నాయి.

ఈ ఘటన పై ప్రధాని నరేంద్ర మోదీ కూడా తీవ్రంగా స్పందించారు. దేశ భద్రతకు సవాలు విసిరిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టబోమని ఆయన హెచ్చరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com