జగన్‌కు చెందిన ఆస్తులపై స్టే కొనసాగాలి

- November 15, 2025 , by Maagulf
జగన్‌కు చెందిన ఆస్తులపై స్టే కొనసాగాలి

అమరావతి: జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా స్తంభింపజేసిన జగతి పబ్లికేషన్స్ మరియు ఇందిరా టెలివిజన్ కరెంట్ ఖాతాల కోసం హామీగా ఇవ్వబడిన ఆస్తులను విడుదల చేయరాదని సీబీఐ(CBI) హైకోర్టుకు నివేదించింది. కేసు తీర్పు వచ్చిన తర్వాత అంకెలు లేదా ఇతర చిన్నపాటి సాంకేతిక లోపాలు ఉంటే తప్ప ఉత్తర్వుల్లో మార్పులకు అవకాశం ఉండదని పేర్కొంది. 2021లో ఈ విషయంపై ఇప్పటికే తుది ఆదేశాలు ఇచ్చినందున, వాటిపై ఇప్పుడు వేసిన మధ్యంతర పిటిషన్ విచారణకు అర్హం కాదని కోర్టును కోరింది. ఆర్థిక నేరాలకు సంబంధించిన ఆస్తుల జప్తుపై సుప్రీంకోర్టు తీర్పులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సీబీఐ ప్రస్తావించింది.

కరెంట్ ఖాతాల నిర్వహణకు 2012లో కోర్టు సూచనల మేరకు హామీగా సమర్పించిన మూడు స్థిరాస్తులను విడుదల చేయాలంటూ జగతి పబ్లికేషన్స్, జనని ఇన్‌ఫ్రా మరియు ఇందిరా టెలివిజన్ పిటిషన్‌లు దాఖలు చేశాయి. ఈ పిటిషన్‌లపై జస్టిస్ జె. శ్రీనివాసరావు విచారణ చేపట్టారు.

సీబీఐ(CBI) తరఫున న్యాయవాది శ్రీనివాస్ కపాటియా మాట్లాడుతూ, విచారణలో భాగంగా జగతికి చెందిన సుమారు రూ. 46.82 లక్షలు ఉన్న కరెంట్ ఖాతాలను స్తంభింపజేసినట్లు తెలిపారు. మీడియా కార్యకలాపాలు, సిబ్బంది జీతాలు ఇబ్బందికి గురికాకుండా ఉండేందుకు కోర్టు షరతులతో ఖాతాల నిర్వహణకు అనుమతి ఇచ్చిందని గుర్తుచేశారు. ఈ ప్రక్రియలో భాగంగా రూ. 23.42 లక్షల బ్యాంకు గ్యారంటీ, అలాగే రేవన్ ఇన్‌ఫ్రా తరఫున బెంగళూరు సమీపంలోని నల్లూరు వద్ద రూ. 6.30 కోట్ల విలువైన మూడు స్థిరాస్తులు హామీగా ఇచ్చినట్లు వివరించారు.

సీబీఐ వాదన ప్రకారం, ప్రధాన కేసు తుది నిర్ణయం వెలువడేవరకు ఈ హామీలు కొనసాగాలి. రేవన్ ఇన్‌ఫ్రాకు చెందిన ఆస్తులను మొదట ఈడీ జప్తు చేసినప్పటికీ, ట్రైబ్యునల్ ఆ నిర్ణయాన్ని రద్దు చేయడంతో, ఈడీ హైకోర్టును ఆశ్రయించిందని పేర్కొన్నారు. ప్రధాన పిటిషన్ ఇంకా పెండింగ్‌లో ఉందని, అందువల్ల హామీ ఆస్తులపై వెంటనే నిర్ణయం తీసుకోవడం సరైనది కాదని వాదించారు. సండూర్‌ నుంచి క్లాసిక్ రియాల్టీకి, అక్కడి నుంచి రేవన్ ఇన్‌ఫ్రాకు నిధుల మళ్లింపు జరిగిందని, అది అక్రమ డబ్బు ప్రవాహం (proceeds of crime) అని పేర్కొన్నారు. జగతి, జనని, ఇందిరా టెలివిజన్‌లతో పాటు రేవన్ ఇన్‌ఫ్రా కూడా జగన్‌తో అనుబంధ సంస్థలేనని పేర్కొంటూ, పిటిషన్లను కొట్టివేయాలని కోరారు.

పిటిషనర్ల తరఫు న్యాయవాది జీ. అశోక్ రెడ్డి మాట్లాడుతూ, రేవన్ ఇన్‌ఫ్రాకు జగతి, జనని, ఇందిరా టీవీలతో సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ఈడీ ట్రైబ్యునల్ కూడా నిర్ధారించిందని గుర్తు చేశారు. రేవన్ ఇన్‌ఫ్రా కేవలం హామీగా మాత్రమే ఆస్తులను సమర్పించిందని, ఇప్పుడు ఆ హామీ నుంచి వైదొలగుతున్న నేపథ్యంలో బ్యాంకు గ్యారంటీ లేదా ఫిక్స్‌డ్ డిపాజిట్ రూపంలో కొత్త హామీ ఇస్తామని తెలిపారు.

అంతేకాక, కరెంట్ ఖాతాల నిర్వహణకు అనుమతిస్తూ కోర్టు అప్పట్లో ఇచ్చిన తాత్కాలిక ఉత్తర్వుల్లో “ఆచరణలో ఇబ్బందులు ఉంటే సవరణ కోసం కోర్టును ఆశ్రయించవచ్చు” అని చెప్పిన విషయం పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. తమ అభ్యర్థన ఇతర కంపెనీ ఆస్తుల విడుదలకే పరిమితమైందని చెప్పారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి విచారణను సోమవారానికి వాయిదా వేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com