తెలంగాణ: 25వ తేదీన క్యాబినెట్ భేటీ

- November 21, 2025 , by Maagulf
తెలంగాణ: 25వ తేదీన క్యాబినెట్ భేటీ

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 25న రాష్ట్ర క్యాబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రధాన అజెండాగా రాబోయే పంచాయతీ ఎన్నికలు ఉండనున్నాయి. గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్, పోలింగ్ తేదీలపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. పంచాయతి శాఖ ఇప్పటికే ఎన్నికల నిర్వహణపై ప్రాథమిక వ్యూహరచన సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను విడతలవారీగా నిర్వహించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నది.

వచ్చే నెలలో మూడు విడతల్లో పోలింగ్ నిర్వహించాలనే నిర్ణయానికి ప్రభుత్వం చేరుకున్నట్లు సమాచారం.
ప్రాథమికంగా పరిశీలిస్తున్న తేదీలు ఇవి:

  • డిసెంబర్ 11 (విడత–1): సర్పంచ్ ఎన్నికలు
  • డిసెంబర్ 14 (విడత–2): ఎంపీటీసీ ఎన్నికలు
  • డిసెంబర్ 17 (విడత–3): జడ్పీటీసీ ఎన్నికలు

ఈ తుది తేదీలను క్యాబినెట్‌లో చర్చించిన తర్వాత అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికల ఏర్పాట్ల కోసం అవసరమైన నిధులు, సిబ్బంది, భద్రతా చర్యలపై కూడా సమావేశంలో సమీక్ష జరిగే అవకాశం ఉంది.

ఎన్నికల నిర్వహణలో వేగం–రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్
గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాల వేగవంతానికి, స్థానిక సంస్థలు సక్రమంగా పనిచేయడానికి ఎన్నికలను ముందుగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. నూతనంగా ఎన్నికైన స్థానిక సంస్థలకు త్వరగా అధికార హస్తాంతరణ జరిగేలా చర్యలు తీసుకోబోతున్నట్లు అధికార వర్గాల సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com