గ్లోబల్‌ సమిట్‌ 2025 ను గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ప్రారంభిం చారు

- December 08, 2025 , by Maagulf
గ్లోబల్‌ సమిట్‌ 2025 ను గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ప్రారంభిం చారు

గ్లోబల్‌ సమిట్‌ 2025 ను గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ప్రారంభించారు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘గ్లోబల్ సమిట్ 2025’ను రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. ఫ్యూచర్ సిటీలోని సువిశాలమైన వంద ఎకరాల విస్తీర్ణంలో జరుగుతున్న ఈ సదస్సు సోమ, మంగళవారాల్లో రెండు రోజుల పాటు కొనసాగనుంది. ఈ అంతర్జాతీయ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా 44 దేశాల నుంచి దాదాపు 154 మంది ప్రతినిధులు హాజరయ్యారు. పెట్టుబడులను ఆకర్షించడం, రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నారు.

సదస్సు ప్రారంభోపన్యాసంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రాష్ట్ర అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. వికసిత్ భారత్ లక్ష్యసాధనలో తెలంగాణ వేగంగా అడుగులు వేస్తోందని, నిర్ణీత లక్ష్యాలతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన వివరించారు. ముఖ్యంగా 2047 నాటికి రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చడమే లక్ష్యమని స్పష్టం చేశారు. మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ, మహిళా రైతులను ప్రోత్సహించడంతో పాటు ఆర్టీసీ బస్సుల నిర్వహణ బాధ్యతలను కూడా మహిళా సంఘాలకు అప్పగించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తమది స్థిరమైన, పారదర్శకమైన ప్రభుత్వమని, ఆవిష్కరణల్లో తెలంగాణ దేశంలోనే ముందుందని పేర్కొన్నారు. విమానాశ్రయాలు, రైల్వేలు, రోడ్ల విస్తరణ వంటి మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించామని గవర్నర్ తెలిపారు.

ఈ సదస్సుకు సినీ, పారిశ్రామిక, సామాజిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ప్రముఖ సినీ నటుడు నాగార్జున ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత 50 ఏళ్లుగా తాను హైదరాబాద్‌లోనే ఉంటున్నానని, ఇక్కడి వాతావరణం ఎంతో బాగుంటుందని కొనియాడారు. ఇప్పటికే తెలంగాణలో అన్నపూర్ణ స్టూడియో ఉన్నప్పటికీ, ఫ్యూచర్ సిటీలో మరో భారీ స్టూడియో నిర్మాణానికి బాలీవుడ్ ప్రముఖులు కూడా కలిసి రావడం శుభపరిణామమని ఆయన అన్నారు. అందరూ కలిసికట్టుగా కృషి చేస్తే ప్రపంచ స్థాయి సౌకర్యాలతో గొప్ప నిర్మాణం చేపట్టవచ్చని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతిపాదించిన ఫ్యూచర్ సిటీ ఆలోచన అద్భుతంగా ఉందని నాగార్జున ప్రశంసించారు.

సదస్సులో భాగంగా ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నోబెల్ బహుమతి గ్రహీతలు అభిజిత్ బెనర్జీ, కైలాశ్ సత్యార్థి కూడా పాల్గొని ప్రసంగించారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో, పెట్టుబడులే లక్ష్యంగా జరుగుతున్న ఈ సదస్సు రాష్ట్ర భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com