సినిమా రివ్యూ: ‘అఖండ 2 తాండవం’
- December 12, 2025
బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన సినిమానే ‘అఖండ 2 తాండవం’. గతంలో ఇదే కాంబినేషన్‌లో వచ్చిన ‘అఖండ’ సెన్సేషనల్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. దాంతో ఈ సినిమాపై చాలా అంచనాలు నెలకొన్నాయ్. అలాగే గత వారమే రిలీజ్ కావల్సిన ‘అఖండ 2’ కొన్ని కారణాల వల్ల ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనూహ్యంగా ఈ వారం రిలీజ్ కావడంతో.. ముందుగా అనుకున్న చాలా చిన్న సినిమాలు ఆగిపోయాయ్. దాంతో, ఇండస్ట్రీలో కొంత కలకలం ఏర్పడింది. మరి, ఇంతటి కలకలానికి కారణమైన బాలయ్య మూవీ ‘అఖండ 2’ ఎలాంటి రిజల్ట్ అందుకుంది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
కథ:
బాల మురళీ కృష్ణ (బాలయ్య) కూతురు అయిన జనని (హర్షాలీ మల్హోత్రా) చిన్నతనంలోనే గొప్ప ప్రతిభ చూపించిన సైంటిస్ట్. దేశం కోసం పోరాడుతూ.. తమ ప్రాణాలను పణంగా పెట్టిన సైనికుల కోసం తన టీమ్‌తో కలిసి ఓ ప్రాజెక్ట్ చేస్తుంటుంది. మరోవైపు భారతదేశాన్నీ, హిందూ ధర్మంపై ప్రజలకున్న నమ్మకాల్ని చెడగొట్టడానికి శత్రు దేశమైన చైనా ఓ పన్నాగం పన్నుతుంది. కొన్ని కోట్ల మంది భారతీయులు పాల్గొనే కుంభమేళాలో ఓ దారుణమైన దుశ్చర్యకు పాల్పడుతుంది. తద్వారా ప్రజల్లో దేవునిపై వున్న నమ్మకాన్ని పోగొట్టాలన్నదే చైనా దురుద్దేశం. ఈ క్రమంలోనే కుంభమేళాలో డేంజర్ కెమికల్ కలిసిన నీటిలో స్నానమాచరించిన భక్తులు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతారు. వీళ్లని రక్షించేందుకు భారతీయ సైంటిస్టులు ఆగమేఘాల మీద ఓ యాంటి డోట్ మందును కనిపెడతారు. ఈ విషయం తెలుసుకున్న శత్రువులు భారత్‌లోని మరికొందరు స్వార్ధపరులతో చేతులు కలిపి, సైంటిస్టులున్న ల్యాబ్‌పై ఎటాక్ చేసి వారిని దారుణంగా చంపేస్తారు. ఈ మారణకాండ నుంచి తప్పించుకున్న యంగ్ సైంటిస్ట్ జననిని ఎలాగైనా చంపాలని ఆమె వెంట పడతారు. జననికి ప్రాణ గండం వుందని అఘోరా అఖండ (పెద్ద బాలయ్య)కి ఎలా తెలిసింది.? ఆమెను కాపాడి.. శత్రువులను అఘోరా అఖండ ఎలా చీల్చి చెండాడాడు.? అసలింతకీ, అఘోరాకీ, జననికీ వున్న సంబంధం ఏంటీ.? బోర్డర్‌లోని మన సైనికుల్ని, హిందూ సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి ఎలా చాటి చెప్పాడన్నదే ‘అఖండ 2 తాండవమ్’ కథ. అది మాత్రం తెరపైనే చూడాలి.
నటీ నటుల పనితీరు:
ఎమ్మెల్యే బాల మురళీ కృష్ణ మరియు అఘోరా అఖండ రెండు పాత్రల్లో డిఫరెంట్ వేరియేషన్లు చూపించడంలో బాలయ్య సక్సెస్ అయ్యారు. ఎమ్మెల్యే పాత్రలో యంగ్‌గా కనిపించారు. అఘోరా పాత్రలో యాక్షన్ ఘట్టాలు అదరగొట్టేశారు. అలాగే, బాలయ్యకు కొట్టిన పిండి అయిన డైలాగులు మరోసారి పదునుగా పేల్చి అభిమానుల్లో పూనకాలు తెప్పించారు. అర్చన పాత్రలో సంయుక్తా మీనన్‌కి పెద్దగా స్క్రీన్ స్పేస్ దక్కలేదు కానీ, వున్నంతలో గ్లామర్‌గా కనిపించి మెప్పించింది. ‘జాజి కాయ’ పాటలో గ్లామర్ చితక్కొట్టేసింది. జనని పాత్ర పోషించిన హర్షాలీ మల్హోత్రా చుట్టూనే సినిమా కథ తిరుగుతుంటుంది. ఆ పాత్రలో ఆమె బాగా నటించింది. తల్లి పాత్రలో విజి చంద్ర శేఖర్ భావోద్వేగాలతో కట్టి పడేశారు. నేత్రగా ఆది పినిశెట్టి పాత్రను ఇంకాస్త బలంగా తీర్చి దిద్ది వుంటే బాగుండేది. రచ్చ రవి, పూర్ణ, సాయి కుమార్, ఇతర నటీ నటులు తమ పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు.
సాంకేతిక వర్గం పనితీరు:
బోయపాటి - బాలయ్య కాంబినేషన్ అంటేనే హిట్టు కాంబినేషన్ లెక్క. ఈ కాంబినేషన్‌కి థమన్ మ్యూజిక్ తోడయ్యింది. జాజికాయ పాట తప్ప మిగిలిన పాటలన్నీ కథానుగుణంగా వస్తాయ్. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గురించి ఏం చెప్పాలి.. అది బాలయ్య - బోయపాటి కాంబో ఆయె.. సో, అందుకు తగ్గట్లుగానే ముఖ్యంగా ఇంట్రడక్షన్ సీన్లు, యాక్షన్ సీన్లలో థమన్ చితక్కొట్టేశాడు బీజీఎమ్. అలాగే సంభాషణలు బాగున్నాయ్. తమ్మిరాజు ఎడిటింగ్ బాగుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. టిబెట్, హిమాలయాలు.. ఇలా లొకేషన్లు తెరపై చాలా బాగుంటాయ్. నిర్మాణ విలువలు సినిమాకి తగ్గట్లుగా వున్నాయ్.
ప్లస్ పాయింట్స్:
బాలయ్య నటన (తాండవం), మదర్ సెంటిమెంట్, కొన్ని యాక్షన్ ఘట్టాలు, ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ అలాగే క్లైమాక్స్..
మైనస్ పాయింట్స్:
ఫస్టాఫ్ యంగ్ బాలయ్య ఇంట్రడక్షన్ ఓకే అనిపిస్తుంది. కానీ, ఆ తర్వాత వచ్చే సన్నివేశాలన్నీ చాలా బోరింగ్‌గా సాగతీతగా అనిపిస్తాయ్ సెకండాఫ్‌లో అఖండ ఎంట్రీ వరకూ.
చివరిగా:
‘అఖండ 2 తాండవమ్’.. బాలయ్య అభిమానులకు పూనకాలే.. కానీ, అభిమానేతరులకు మాత్రం సహన పరీక్షలే.!
తాజా వార్తలు
- కాగ్నిజెంట్ లో 25వేల మందికి ఉద్యోగాలు: CEO రవికుమార్
- కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- 2025లో యూఏఈ వీసా నియమాల్లో కీలక మార్పులు..!!
- కువైట్ లో పలు మీట్ షాప్స్ సీజ్..!!
- రసాయన ఆయుధాల నిషేధంపై కమిటీ ఏర్పాటు..!!
- టాక్సీ యజమానులకు జరిమానా మినహాయింపు..!!
- గూగుల్ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2..







