ఏపీ: 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు

- December 13, 2025 , by Maagulf
ఏపీ: 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు

2027లో రానున్న గోదావరి పుష్కరాల నిర్వహణ తేదీలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాది పుష్కరాలు జూన్ 26వ తేదీ నుండి జూలై 7వ తేదీ వరకు మొత్తం 12 రోజుల పాటు జరగనున్నాయి. ఈ పవిత్ర ఘడియల నిర్ణయం కోసం తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) ఆస్తాన సిద్ధాంతి అయిన తంగిరాల వెంకట కృష్ణ పూర్ణ ప్రసాద్  అందించిన జ్యోతిష్య నివేదికను పరిగణలోకి తీసుకున్నారు.

పుష్కరాల ప్రవేశ, ప్రస్థాన సమయాలను ఖచ్చితంగా నిర్ధారించేందుకు సిద్ధాంతి అందించిన విశ్లేషణను ఎండోమెంట్స్ శాఖ ప్రభుత్వానికి సమర్పించగా, దానిని పరిశీలించిన ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత, ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఒక అసాధారణ గెజిట్ నోటిఫికేషన్‌ను కూడా విడుదల చేసింది.ఎక్స్‌ఆఫిషియో సెక్రటరీ డాక్టర్ ఎం.హరి జవహర్లాల్ అన్ని సంబంధిత శాఖలన్నీ తక్షణమే తమ ప్రణాళికలను వేగవంతం చేయాలని ఆదేశించారు.

కోట్లాది మంది భక్తులు పుణ్య స్నానాల కోసం తరలివచ్చే ఈ మహోత్సవాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావిస్తోంది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ఘాట్‌ల పునరుద్ధరణ పనులు, తాత్కాలిక స్నాన ఘాట్‌ల ఏర్పాటుపై అధికారులు దృష్టి సారించారు. భద్రత, రవాణా, పరిశుభ్రత (శానిటేషన్), తాగునీటి సరఫరా, ఆరోగ్య సేవలు, యాత్రికుల వసతి వంటి కీలక అంశాలపై వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం త్వరలోనే ఉన్నత స్థాయి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రధానంగా రాజమహేంద్రవరం, భద్రాచలం, పోలవరం, కోరుకొండ, కోటిపల్లి, దొండపూడి వంటి రద్దీ ప్రాంతాల వద్ద యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళికలను జిల్లా కలెక్టర్లు సిద్ధం చేస్తున్నారు. ఈసారి పుష్కరాలు వేసవి ముగింపు నాటికి వస్తున్నందున, మంచినీరు, ఆరోగ్య సేవలు, రాత్రి వేళల్లో భద్రత ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ మళ్లింపులు, పార్కింగ్ స్థలాల ఏర్పాటు, వైద్య బృందాల నియామకం వంటి అంశాలపై విభాగాలు పర్యవేక్షణ చేపట్టనున్నాయి. ఈ పవిత్ర కార్యక్రమాన్ని గతంలో కంటే మెరుగైన రీతిలో, సమన్వయంతో నిర్వహించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com