గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు

- December 19, 2025 , by Maagulf
గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు

గుంటూరు: భాషే రమ్యం..సేవే గమ్యం అంటూ ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా  తెలుగు సంఘం నాట్స్ తాజాగా గుంటూరులో జానపద సాంస్కృతిక సంబరాలు అత్యంత వైభవంగా నిర్వహించింది.గుంటూరులోని వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నాట్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ జానపద సాంస్కృతిక సంబరాలు కేవలం ఒక కార్యక్రమంలా కాకుండా, తెలుగు సంప్రదాయాలను ప్రతిబింబించే వేదికలా మారాయి. స్థానిక పొట్టి శ్రీరాముల విగ్రహం నుంచి వేంకటేశ్వర విజ్ఙాన మందిరం వరకు జానపద ర్యాలీతో ఈ సంబరాలు ప్రారంభమయ్యాయి.  తప్పెటగుళ్లు, దరువులు.. కోలాటాల సందడి.. తెలుగు జానపద శోభను ప్రతిబింబించాయి. యువతకు స్ఫూర్తినిచ్చేలా ఇంజినీరింగ్ విద్యార్థులు కూడా ఈ సంప్రదాయ నృత్యాల్లో పాలుపంచుకోవడం విశేషం. ప్రముఖ జానపద కళాకారుడు రమణ ఆధ్వర్యంలో  ఈ సంబరాల్లో శ్రీకాకుళం నుంచి కోనసీమ వరకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు తమ ప్రతిభతో అందరిలో ఉత్సాహాన్ని నింపారు.

మన మూలాలు మరిచిపోకూడదు: NATS ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని.

మనం ఎంత ఎత్తుకు ఎదిగినా మన మూలాలను మర్చిపోకూడదని ఈ సంబరాల్లో పాల్గొన్న నాట్స్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని అన్నారు. తెలుగునాట కనుమరుగవుతున్న జానపద కళలు మన అస్తిత్వానికి ప్రతీకలని.. వాటిని కాపాడుకోవడం అంటే మనల్ని మనం కాపాడుకోవడమే అని ప్రశాంత్ పేర్కొన్నారు. మేం అమెరికాలో ఉన్నప్పటికీ, మాతృభూమిపై మమకారంతో కళాకారులను ఆదుకోవడానికి నాట్స్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు.

తెలుగు కళలకు నాట్స్ ప్రోత్సాహం: నాట్స్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి.

నాట్స్ తెలుగు కళలను ప్రోత్సాహించేందుకు ఎప్పుడూ ముందుంటుందని నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి అన్నారు. గతంలో కూడా ఇలాంటి కార్యక్రమాల ద్వారా కళాకారులకు నాట్స్ అండగా నిలిచిందని గుర్తుచేశారు.నాట్స్ తెలుగు భాష కోసం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు.

ఈ జానపద సాంస్కృతిక సంబరాల్లోనే ఉత్తమ ఉపాధ్యాయులు, కవులు, కళాకారులను నాట్స్ ఘనంగా సత్కరించింది. ఇంకా ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావుతో పాటు పలువురు కవులు, కళాకారులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com