రికార్డు సృష్టించిన స్మృతి మంధాన

- December 22, 2025 , by Maagulf
రికార్డు సృష్టించిన స్మృతి మంధాన

విశాఖపట్నం: విశాఖపట్నం వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఘనవిజయం సాధించడమే కాకుండా, భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన ఒక అరుదైన ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. భారత మహిళల జట్టు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన 48 రోజుల తర్వాత మైదానంలోకి అడుగుపెట్టిన మంధాన, తన అద్భుతమైన బ్యాటింగ్‌తో చరిత్ర సృష్టించింది. 

టీ20లలో 4000 పరుగులు దాటిన రెండవ మహిళా క్రికెటర్‌గా ఆమె నిలిచింది. నిన్న‌ శ్రీలంక‌తో జ‌రిగిన‌ తొలి టీ20లో ఆమె ఈ ఘ‌న‌త‌ను సాధించింది. విశాఖపట్నం వేదిక‌గా జ‌రిగిన ఈ మ్యాచ్‌లో 25 పరుగులు చేసిన స్మృతి ఈ రికార్డును న‌మోదు చేసింది. స్మృతి 154 మ్యాచుల్లో 4007 ర‌న్స్ చేసింది. ఇందులో ఒక సెంచ‌రీతో పాటు 31 అర్ధ సెంచ‌రీలు ఉన్నాయి. ఓవ‌రాల్‌గా ఈ జాబితాలో కివీస్ ప్లేయ‌ర్ సుజీ బేట్స్ 4,716 ప‌రుగుల‌తో తొలి స్థానంలో ఉంది.  

మొత్తం మీద టీ20 క్రికెట్‌లో పురుషులు, మహిళలు కలిపి ఐదుగురు మాత్రమే 4000 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేశారు. భారత దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలతో పాటు బేట్స్, పాకిస్థాన్‌కు చెందిన బాబర్ ఆజం సహా స్మృతి ఈ జాబితాలో చేరింది. ఇక‌, ఈ జాబితాలో మంధాన అతి పిన్న వయస్కురాలు కావ‌డంతో భవిష్యత్తులో అగ్రస్థానాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com