శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా

- December 25, 2025 , by Maagulf
శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా

హైదరాబాద్:

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ దగ్గర ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా పడింది. ముందు వెళ్తున్న వాహనాన్ని తప్పించబోయే క్రమంలో బస్సు పల్టీ కొట్టింది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. గాయపడిన విద్యార్థులను హుటాహుటీన చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

బస్సు ప్రమాద సమయంలో 60మంది విద్యార్థులు ఉన్నారు. వీరంతా జలవిహార్‌కు బస్సులో విహారయాత్రకు వెళ్తున్నారు. శంషాబాద్ వద్ద ముందు వెళ్తున్న కారును తప్పించబోయి బస్సు బోల్తా పడింది. ఊహించని ఘటనతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. విద్యార్థులు అరుపులు కేకలతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. ఘటన జరిగిన వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు అక్కడకు చేరుకొని బస్సులో ఉన్న విద్యార్థులను సురక్షితంగా బయటకు తీశారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

బస్సు రోడ్డుకు అడ్డంగా బోల్తా పడడంతో బెంగళూరు హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. డ్రైవర్ బస్సును అతివేగంగా డ్రైవ్ చేయడం వల్లనే బస్సు బోల్తాపడినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళనతో ఆస్పత్రికి చేరుకున్నారు. అయితే, ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగకపోవటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

బస్సు బోల్తా ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బెంగళూరు హైవేపై భారీగా నిలిచిన పోయిన ట్రాఫిక్ ను క్లియర్ చేసే పనిలో నిమగ్నమయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com